౬
సీళ్ళు విప్పడం: మొదటిది
౧ ఆ గొర్రెపిల్ల ఆ ఏడింటిలో మొదటి సీలు తెరవడం చూశాను. అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి గర్జిస్తున్నట్టుగా, “ఇలా రా” అనడం విన్నాను. ౨ నేను అటు చూస్తుంటే తెల్లని గుర్రం ఒకటి కనిపించింది. దాని మీద కూర్చున్న రౌతు చేతిలో ఒక విల్లు ఉంది. అతనికి ఒక కిరీటం ఇచ్చారు. అతడు జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు.
రెండవ సీలు: యుద్ధాలు
౩ గొర్రెపిల్ల రెండవ సీలు తెరచినప్పుడు రెండవ ప్రాణి, “ఇలా రా” అనడం విన్నాను. ౪ అప్పుడు ఎర్రగా ఉన్న మరో గుర్రం బయల్దేరింది. దాని పైన కూర్చున్న రౌతుకు పెద్ద కత్తి ఇచ్చారు. మనుషులు ఒకరినొకరు హతం చేసుకునేలా భూమి పైన శాంతిని తీసివేయడానికి అతనికి అనుమతి ఉంది.
మూడవ సీలు: కరువు కాటకాలు
౫ ఆ తరువాత గొర్రెపిల్ల మూడవ సీలు తెరిచాడు. అప్పుడు, “ఇలా రా” అని మూడవ ప్రాణి పిలవడం విన్నాను. నేను అప్పుడు ఒక నల్లని గుర్రం చూశాను. దానిమీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు. ౬ నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “రోజు కూలికి ఒక కిలో గోదుమలూ, రోజు కూలికి మూడు కిలోల బార్లీ గింజలు. ఇక నూనెనీ, ద్రాక్షారసాన్నీ పాడు చేయవద్దు” అని పలకడం విన్నాను.
నాలుగవ సీలు: మరణం
౭ గొర్రెపిల్ల నాలుగవ సీలు తెరచినప్పుడు, “ఇలా రా” అని నాలుగవ ప్రాణి చెప్పడం విన్నాను. ౮ అప్పుడు బూడిద రంగులో పాలిపోయినట్టు ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మరణం. పాతాళం వాడి వెనకే వస్తూ ఉంది. కత్తితో, కరువుతో, వ్యాధులతో, క్రూరమృగాలతో చంపడానికి భూమి మీద నాలుగవ భాగంపై అతనికి అధికారం ఇవ్వడం జరిగింది.
ఐదవ సీలు: హతసాక్షులు
౯ ఆయన అయిదవ సీలు తెరచినప్పుడు దేవుని వాక్కు కోసమూ, తమ సాక్ష్యం కారణంగానూ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం కింద చూశాను. ౧౦ వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, “సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్నవారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?” ౧౧ అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ తెల్లని దుస్తులు ఇచ్చారు. “మీలాగే హతం కావాల్సిన మీ తోటి సేవకుల, సోదర సోదరీల లెక్క మొత్తం పూర్తి అయేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి” అని వారికి చెప్పడం జరిగింది.
ఆరవ సీలు: ఆకాశంలో ఉత్పాతాలు
౧౨ ఆయన ఆరవ సీలు తెరిచినప్పుడు నేను చూస్తూ ఉండగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు గొంగళిలాగా నల్లగా మారిపోయాడు. చంద్రబింబమంతా రక్తంలా ఎర్రగా అయింది. ౧౩ పెనుగాలి వీచినప్పుడు అంజూరు చెట్టు నుండి పచ్చి కాయలు రాలినట్టుగా ఆకాశంలోని నక్షత్రాలు భూమిపై రాలాయి. ౧౪ ఆకాశమంతా చుట్టిన కాగితంలా అదృశ్యమై పోయింది. పర్వతాలూ, ద్వీపాలూ అన్నీ వాటి వాటి స్థానాల నుండి కదిలిపోయాయి.
౧౫ అప్పుడు భూమి మీద ఉన్న రాజులూ, ప్రముఖులూ, సేనాధిపతులూ, సంపన్నులూ, శక్తిమంతులూ, ఇంకా బానిసలూ, స్వేచ్ఛాజీవులూ అంతా పర్వతాల రాళ్ళ సందుల్లోనూ, గుహల్లోనూ దాక్కున్నారు. ౧౬ వారు, “మీరు మా మీద పడండి! సింహాసనంపై కూర్చున్న ఆయన ముఖకాంతి నుండీ గొర్రెపిల్ల తీవ్ర ఆగ్రహం నుండీ మమ్మల్ని దాచిపెట్టండి. ౧౭ వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది. ఎవరు నిలబడగలరు?” అంటూ పర్వతాలనూ, రాళ్ళనూ బతిమాలుకున్నారు.