౨౦
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన
౧ ఆపద సమయంలో యెహోవా నీకు జవాబిస్తాడు గాక. యాకోబు దేవుని నామం నిన్ను కాపాడుతుంది గాక.
౨ పరిశుద్ధ స్థలంలోనుంచి ఆయన నీకు సహాయం చేస్తాడు గాక. సీయోనులోనుంచి నిన్ను ఆదుకుంటాడు గాక.
౩ ఆయన నీ అర్పణలు జ్ఞాపకం చేసుకుని, నీ దహన బలులు అంగీకరిస్తాడు గాక.
౪ నీ హృదయవాంఛను తీర్చి నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తాడు గాక.
౫ అప్పుడు నీ రక్షణను బట్టి మేము ఆనందిస్తాము. దేవా, నీ పేరట జెండా ఎత్తుతాము. నీ అభ్యర్ధనలన్నీ యెహోవా మంజూరు చేస్తాడు గాక.
౬ యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలిసింది. రక్షించగల తన కుడిచేతి బలంతో తన పవిత్రాకాశంలోనుంచి అతనికి జవాబిస్తాడు.
౭ కొందరు రథాలను, కొందరు గుర్రాలను నమ్ముకుంటారు. కాని మనం మన దేవుడైన యెహోవాకు మొర పెడతాము.
౮ వాళ్ళు కుంగి నేల మీద పడిపోతారు, మనం లేచి తిన్నగా నిలిచి ఉంటాము!
౯ యెహోవా, రాజును రక్షించు. మేము మొరపెట్టినప్పుడు మాకు సహాయం చెయ్యి.