౪
౧ నేను చెప్పేదేమిటంటే, వారసుడు తండ్రి సంపద అంతటికీ యజమాని అయినప్పటికీ పిల్లవాడుగా ఉన్నంతకాలం అతనికీ దాసునికీ ఏ తేడా లేదు. ౨ తండ్రి నిర్ణయించిన రోజు వచ్చే వరకూ అతడు సంరక్షకుల, నిర్వాహకుల అధీనంలో ఉంటాడు. ౩ అలాగే మనం పిల్లలంగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులంగా ఉన్నాము.
విశ్వాసి ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాడు
౪ అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి, ౫ మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు.
విశ్వాసి కుమారత్వాన్ని వాస్తవం చేసేది ఆత్మ
౬ మీరు కుమారులు కాబట్టి, “అబ్బా! తండ్రీ!” అని పిలిచే తన కుమార ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు. ౭ కాబట్టి నీవిక ఏమాత్రం బానిసవి కాదు, కొడుకువే. కొడుకువైతే దేవుని ద్వారా వారసుడివి.
ధర్మశాస్త్ర క్రియల వైపుకు మళ్ళడం అంటే తిరిగి ప్రాథమిక మతం వైపు తిరగడమే
౮ ఆ కాలంలో మీరు దేవుని ఎరగనివారై, వాస్తవానికి దేవుళ్ళు కాని వారికి బానిసలుగా ఉన్నారు గాని ౯ ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్న వారు. మరి విశేషంగా దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నాడు. కాబట్టి బలహీనమైనవీ ప్రయోజనం లేనివీ అయిన మూల పాఠాల వైపు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ బానిసలుగా ఉండాలనుకుంటున్నారా? ౧౦ మీరు ప్రత్యేక దినాలూ అమావాస్య దినాలూ ఉత్సవ కాలాలూ సంవత్సరాలూ జాగ్రత్తగా ఆచరిస్తున్నారట. ౧౧ మీ విషయంలో నా కష్టం వ్యర్థమై పోతుందేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. ౧౨ సోదరులారా, నేను మీలాంటి వాడినయ్యాను కాబట్టి మీరు కూడా నాలాంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. ౧౩ మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు. ౧౪ నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా నన్ను మీరు తృణీకరించ లేదు, నిరాకరించనూ లేదు గాని దేవుని దూతలాగా, క్రీస్తు యేసులాగా నన్ను అంగీకరించారు.
చట్టపరమైన నీతికి మళ్లడం ద్వారా గలతీయులు తమ దీవెనలను పోగొట్టుకున్నారు
౧౫ మీ సంతోషం ఇప్పుడు ఏమయింది? వీలుంటే మీ కళ్ళు తీసి నాకిచ్చేసే వారని మీ గురించి సాక్ష్యం చెప్పగలను. ౧౬ నేను మీకు వాస్తవం చెప్పి విరోధినయ్యానా?
౧౭ వారు అత్యాసక్తితో మీ వెంట పడుతున్నారు, కానీ వారి ఉద్దేశం మంచిది కాదు. మీరు వారిని అనుసరించాలని నా నుంచి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు. ౧౮ నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ మంచి కారణాల విషయం అత్యాసక్తి కలిగి ఉండడం మంచిది.
ధర్మశాస్త్రం, కృప, ఈ రెండూ కలిసి ఉండడం అసాధ్యం
౧౯ నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకూ మీ విషయం మళ్ళీ నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను. ౨౦ మిమ్మల్ని గురించి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక రకంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ౨౧ ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని కోరే వారంతా నాకో మాట చెప్పండి- మీరు ధర్మశాస్త్రం చెప్పేది వినడం లేదా? ౨౨ దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కొడుకులు అబ్రాహాముకు కలిగారని రాసి ఉంది గదా? ౨౩ అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టాడు.
౨౪ ఈ విషయాలను అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లల్ని కంటుంది. ఇది హాగరు. ౨౫ ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది. ౨౬ అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి.
౨౭ “గొడ్రాలా, పిల్లల్ని కననిదానా, ఆనందించు.
ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు.
ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటే భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు” అని రాసి ఉంది.
౨౮ సోదరులారా, మీరు కూడా ఇస్సాకు లాగా వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నారు. ౨౯ అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా ఆలాగే జరుగుతున్నది. ౩౦ అయితే లేఖనం ఏమి చెబుతున్నది? “దాసిని, ఆమె కొడుకుని వెళ్ళగొట్టు. దాసి కొడుకు స్వతంత్రురాలి కొడుకుతో పాటు వారసుడుగా ఉండడు.” ౩౧ అందుచేత, సోదరులారా, మనం స్వతంత్రురాలి కొడుకులమే గాని దాసి కొడుకులం కాదు.