౨౧
౧ మనష్షే పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 12 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లిపేరు హెప్సిబా. ౨ అతడు యెహోవా దృష్టిలో చెడుతనం జరిగిస్తూ, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసినట్లు అసహ్యమైన పనులు చేస్తూ వచ్చాడు. ౩ తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలు అతడు మళ్ళీ కట్టించి, బయలు దేవుడుకు బలిపీఠాలు కట్టించి ఇశ్రాయేలురాజు అహాబు చేసినట్టు దేవతాస్తంభాలు చేయించి, నక్షత్రాలకు మొక్కి, వాటిని పూజిస్తూ ఉన్నాడు.
౪ ఇంకా “నా పేరు యెరూషలేములో శాశ్వతంగా ఉంచుతాను” అని యెహోవా చెప్పిన ఆ యెరూషలేములో అతడు యెహోవా మందిరంలో బలిపీఠాలు కట్టించాడు. ౫ ఇంకా, యెహోవా మందిరానికి ఉన్న రెండు ప్రాంగణాల్లో ఆకాశ నక్షత్రాలకు అతడు బలిపీఠాలు కట్టించాడు. ౬ అతడు తన కొడుకును దహన బలిగా అర్పించి జ్యోతిష్యం, శకునాలు అలవాటు చేసి, చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్ళతో, సోదె చెప్పే వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఈ విధంగా అతడు యెహోవా దృష్టిలో ఎంతో చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.
౭ యెహోవా దావీదుకు, అతని కొడుకు సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చి “ఈ మందిరంలో ఇశ్రాయేలు గోత్రస్దానాల్లోనుంచి నేను కోరుకున్న ఈ యెరూషలేములో నా పేరు ఎల్లకాలం ఉంచుతాను” అని దేన్నీ గురించి చెప్పాడో ఆ యెహోవా మందిరంలో తాను చేయించిన అషేరా రూపాన్ని పెట్టాడు. ౮ ఇంకా “ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించిన దానంతటినీ నా సేవకుడు మోషే వాళ్లకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రాన్నీ వారు పాటిస్తే, వాళ్ళ పితరులకు నేనిచ్చిన దేశంలోనుంచి వాళ్ళ పాదాలు ఇంక తొలగి పోనివ్వను” అని యెహోవా చెప్పిన మాట వినకుండా ౯ ఇశ్రాయేలీయుల ఎదుట నిలబడకుండా యెహోవా నాశనం చేసిన ప్రజలు జరిగించిన చెడుతనాన్ని మించిన చెడుతనం చేసేలా మనష్షే వాళ్ళను పురిగొల్పాడు.
౧౦ అయితే, యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ, ౧౧  “యూదా రాజు మనష్షే ఈ అసహ్యమైన పనులు చేసి, తన ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొన్న విగ్రహాల వల్ల యూదావారు పాపం చెయ్యడానికి కారకుడయ్యాడు. ౧౨ కాబట్టి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, వినేవాళ్ళకు రెండు చెవులూ గింగురుమనేంత కీడు యెరూషలేము మీదకీ, యూదావాళ్ళ మీదకీ రప్పిస్తాను.
౧౩ నేను షోమ్రోనును కొలిచిన నూలు, అహాబు కుటుంబీకులను సరి చూసిన మట్టపు గుండు యెరూషలేము మీద సాగలాగుతాను. ఒకడు పళ్ళెం తుడిచేటప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్టు నేను యెరూషలేమును తుడిచివేస్తాను. ౧౪ ఇంకా, నా స్వాస్ధ్యంలో మిగిలిన వాళ్ళను నేను తోసివేసి, వాళ్ళ శత్రువుల చేతికి వాళ్ళను అప్పగిస్తాను. ౧౫ వారు తమ పూర్వికులు ఐగుప్తు దేశంలోనుంచి వచ్చిన రోజునుంచి ఈ రోజు వరకూ నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టిస్తున్నారు గనుక వారు తమ శత్రువులందరివల్ల దోపిడీకి గురై నష్టం పొందుతారు.”
౧౬ ఇంకా మనష్షే యెహోవా దృష్టిలో చెడునడత నడిచి, యూదావాళ్ళను పాపంలో దింపడమే కాకుండా యెరూషలేమును ఈ మూల నుంచి ఆ మూల వరకూ రక్తంతో నిండేలా నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు. ౧౭ మనష్షే చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి, అతని దోషం గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. ౧౮ మనష్షే తన పూర్వీకులతో బాటు చనిపోయిన తరువాత, ఉజ్జా తోటలో తన ఇంటి దగ్గర అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఆమోను అతని స్థానంలో రాజయ్యాడు.
౧౯ ఆమోను పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయస్సు 22 సంవత్సరాలు. అతడు యెరూషలేములో రెండు సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు మెషుల్లెమెతు. ఆమె యొట్బ ఊరివాడైన హారూసు కూతురు. ౨౦ అతడు తన తండ్రి మనష్షే నడిచినట్టు యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.
౨౧ తన పితరుల దేవుడైన యెహోవాను వదిలిపెట్టి, యెహోవా మార్గంలో నడవకుండా, తన తండ్రి ప్రవర్తించినట్టు తానూ ప్రవర్తిస్తూ, ౨౨ తన తండ్రి పూజించిన విగ్రహాలను తానూ పూజించాడు. ౨౩ ఆమోను సేవకులు అతని మీద కుట్రచేసి అతన్ని రాజనగరులో చంపారు.
౨౪ దేశ ప్రజలు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వాళ్ళందర్నీ చంపి, అతని స్థానంలో అతని కొడుకు యోషీయాకు పట్టాభిషేకం చేశారు. ౨౫ ఆమోను చేసిన ఇతర పనుల గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. ౨౬ ఉజ్జా తోటలో అతనికి ఉన్న సమాధిలో అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు యోషీయా అతని స్థానంలో రాజయ్యాడు.