16
ఎవీఫజుకు యోబు జవాబు
అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:
 
“ఈ విషయాలు నేను యిదివరకే విన్నాను.
మీరు ముగ్గురూ నాకు కష్టమే కలిగిస్తున్నారు కాని ఆదరణకాదు.
మీ దీర్గ ఉపన్యాసాలకు అంతం లేదు.
మీరెందుకు వాదము కొనసాగిస్తారు?
నా కష్టలే మీకు ఉంటే ఇప్పుడు
మీరు చెబుతున్న మాటలు నేనూ చెప్పగలను.
మీకు విరోధంగా జ్ఞానం గల మాటలు చెప్పి,
మిమ్మల్ని చూచి నేను తల ఊపగలను.
కాని నేను చెప్పే మాటలతో నేను మిమ్మల్ని ప్రోత్సహించి మీకు ఆశ ఇవ్వగలను.
 
“అయితే నేను చెప్పేది ఏదీ నా బాధ పోయేట్టుగా చేయలేదు.
కానీ నేను మాట్లాడకపోతే నాకు ఆదరణ లేదు.
నిజంగా దేవా, నీవు నా బలం తీసివేశావు.
నా కుటుంబం మొత్తాన్ని నీవు నాశనం చేశావు.
నీవు నన్ను కట్టివేశావు. అది ప్రతి ఒక్కరూ చూడగలరు.
నా శరీరం రోగంతో ఉంది, నేను భయంకరంగా కనబడుతున్నాను.
దాని అర్థం నేను దోషిని అని ప్రజలు తలస్తున్నారు.
 
“దేవుడు నా మీద దాడి చేస్తున్నాడు,
ఆయన నా మీద కోపంగా ఉండి నా శరీరాన్ని చీల్చ వేస్తున్నాడు.
దేవుడు నా మీద తన పళ్లు కొరుకుతున్నాడు.
నా శత్రువుల కళ్లు ద్వేషంతో చూస్తున్నవి.
10 మనష్యలు నన్ను చూచి నప్వుతారు.
వాళ్లంతా నా చుట్టూ చేరి నన్ను అవమానించి నా ముఖం మీద కొట్టడానికి సమ్మతిస్తారు.
11 దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు.
12 నా విషయం అంతా బాగానే ఉంది. నేను నెమ్మదిగా జీవిస్తూ వచ్చాను.
కాని దేవుడు నన్ను చితుకగొట్టేశాడు.
అవును ఆయన నన్ను మెడపట్టి లాగి,
నన్ను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాడు.
గురి చూసి కొట్టడం అభ్యసించడానికి దేవుడు నన్ను ప్రయోగిస్తున్నాడు.
13 దేవుని విలుకాండ్లు నా చుట్టూరా ఉన్నారు.
నా మూత్రపిండాలలో ఆయన బాణాలు కొడుతున్నాడు.
ఆయన దయ చూపించడు. ఆయన నా పైత్య రసాన్ని నేలమీద ఒలక బోస్తాడు.
14 మరల మరల దేవుడు నా మీద దాడి చేస్తాడు.
యుద్ధంలో సైనికునిలా ఆయన నా మీదకు పరుగెత్తుతాడు.
 
15 “నేను (యోబు) చాలా విచారంగా ఉన్నాను,
కనుక గోనెపట్టతో చేయబడిన బట్టలు నేను ధరిస్తాను.
నేను ఇక్కడ దుమ్ములో, బూడిదలో కూర్చొని
ఓడిపోయినట్టుగా భావిస్తున్నాను.
16 ఏడ్బుట మూలంగా నా ముఖం ఎర్రబడింది.
ఛాయలు నా కళ్ల చుట్టూరా ఉంగరాల్లా ఉన్నాయి.
17 నేను ఎన్నడూ క్రూరమైన నేరం ఏది చేయలేదు.
నా ప్రార్థన నిర్మలమయినది.
 
18 “భూమీ, నా రక్తాన్ని దాచి పెట్టకు. (నాకు జరిగిన చెడుగులను కప్పి పెట్టకు).
న్యాయం కోసం అరిచే నా అరుపులను (ప్రార్థనలను) అగిపోనీయకు.
19 ఇప్పుడు కూడ పరలోకంలో ఎవరో ఒకరు ఉన్నారు.
నా పక్షంగా (నా పక్కన) ఉండి నాకు సాక్షిగా ఉన్నాడు.
20 నా స్నేహితులు నాకు విరోధంగా ఉన్నారు.
కాని నా కన్నులు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి.
21 ఒక మనిషి తన స్నేహితుని కోసం బతిమలాడి నట్టుగా,
నా కోసం దేవునిని బతిమలాడే ఒక మనిషి నాకు కావాలి.
 
22 “నేను ఏ చోట నుండి (మరణం) తిరిగి రానో ఆ చోటికి నేను వెళ్లేందుకు ఇంకా కొద్ది సంవత్సరాలే జరగాల్సి ఉంది.