2
యూదేతర నీతి బోధకులు
1 కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా?
2 ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు. 3 ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు? 4 దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా?
5 నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు. 6 ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. 7 మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు. 8 అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి. 9 చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి బాధ, వేదన కలుగుతాయి. 10 అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి మహిమ, ఘనత, శాంతిసమాధానాలు కలుగుతాయి.
11 ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. 12 ధర్మశాస్త్రం ఉండి పాపం చేసినవారు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారు కూడా ధర్మశాస్త్రం లేకపోయినా నాశనం అవుతారు. 13 ధర్మశాస్త్రం వినే వారిని కాదు, దాన్ని అనుసరించి ప్రవర్తించే వారినే దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. 14 ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వాభావికంగా ధర్మశాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటే వారికి ధర్మశాస్త్రం లేకపోయినా, తమకు తామే ధర్మశాస్త్రంలాగా ఉంటారు. 15 అలాటి వారి మనస్సాక్షి కూడా సాక్షమిస్తుంది. వారి ఆలోచనలు వారిపై తప్పు మోపడమో లేక తప్పులేదని చెప్పడమో చేస్తాయి. అలాటివారి హృదయాలపై ధర్మశాస్త్ర సారం రాసినట్టే ఉంటుంది రాసినట్టే ఉంటుంది. 16 నా సువార్త ప్రకారం దేవుడు యేసు క్రీస్తు ద్వారా మానవుల రహస్యాలను విచారించే రోజున ఈ విధంగా జరుగుతుంది.
ధర్మశాస్త్రం తెలిసిన యూదులకు ధర్మశాస్త్రం ప్రకారమే శిక్ష
17 నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవుని విషయంలో అతిశయిస్తున్నావు కదా? 18 ఆయన చిత్తం తెలిసి, ధర్మశాస్త్రంలో ఉపదేశం పొంది ఏది మంచిదో తెలిసి దాన్ని మెచ్చుకొంటావు కదా? 19 జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలిగిఉండి, “నేను గుడ్డివారికి దారి చూపేవాణ్ణి, చీకటిలో ఉండేవారికి వెలుగు చూపేవాణ్ణి, 20 బుద్ధిలేని వారిని సరిదిద్దే వాణ్ణి, చిన్న పిల్లలలకు అధ్యాపకుణ్ణి అని” అని నిశ్చింతగా ఉన్నావు కదా? 21 ఎదుటి మనిషికి ఉపదేశించే వాడివి, నీకు నీవు బోధించుకోవా? దొంగతనం చేయకూడదని చెప్పే నీవే దొంగతనం చేస్తావా? 22 వ్యభిచారం చేయవద్దని చెప్పే నీవే వ్యభిచారం చేస్తావా? విగ్రహాలను అసహ్యించుకుంటూ నీవే గుడులను దోచుకుంటావా? 23 ధర్మశాస్త్రంలో గొప్పలు చెప్పుకునే నీవు ధర్మశాస్త్రం మీరి, దేవునికి అవమానం తెస్తావా? 24 “మిమ్మల్ని బట్టే గదా దేవుని పేరు యూదేతరుల మధ్య దూషణ పాలవుతున్నది?” అని రాసి ఉంది కదా.
25 నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడివైతే నీకు సున్నతి ప్రయోజనం వర్తిస్తుంది గాని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడివైతే, నీ సున్నతి సున్నతి కానట్టే. 26 కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తే సున్నతి లేకపోయినా సున్నతి పొందినవాడుగా ఎంచబడతాడు గదా? 27 సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవాడు, లేఖనాలూ, సున్నతి కలిగి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే నీకు తీర్పు తీరుస్తాడు కదా? 28 పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు. 29 అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయానికి చెందింది. అది ఆత్మలో జరిగేదే గాని అక్షరార్ధమైనది కాదు. అలాటి వాణ్ణి మనుషులు కాదు, దేవుడే మెచ్చుకుంటాడు.