22
బాలాకు, బిలాము కోసం కబురంపటం
1 తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరంలో ఉన్న మోయాబు మైదానాల్లో శిబిరం వేసుకున్నారు.
2 సిప్పోరు కొడుకు బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయు పట్ల చేసిందంతా చూశాడు. 3 ప్రజలు ఎక్కువగా ఉన్న కారణంగా మోయాబీయులు వారిని చూసి చాలా కంగారుపడ్డారు. మోయాబీయులు ఇశ్రాయేలీయులను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. 4 మోయాబీయులు మిద్యాను పెద్దలతో “ఒక ఎద్దు పొలంలో ఉన్న పచ్చిగడ్డి తినేసినట్టు ఈ జనసమూహహం ఇప్పుడు మన చుట్టూ ఉన్నదంతా తినేస్తారు” అన్నారు. ఆ కాలంలో సిప్పోరు కొడుకు బాలాకు మోయాబీయులకు రాజు.
5 కాబట్టి అతడు బెయోరు కొడుకు బిలామును పిలవడానికి అతని ప్రజల దేశంలో ఉన్న నది దగ్గర ఉన్న పెతోరుకు ఇలా కబురంపారు. “చూడు, ఒక జాతి ఐగుప్తులోనుంచి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి, ఇప్పుడు నాకు ఎదురు గుండా శిబిరం వేసుకున్నారు. 6 కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా కోసం ఈ జనాన్ని శపించు. వారు నాకంటే చాలా బలవంతులు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో. ఎందుకంటే నువ్వు దీవించినవాడికి దీవెన, శపించిన వాడికి శాపం కలుగుతాయని నాకు తెలుసు” అని అన్నాడు.
7 కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు భవిష్యవాణి చెప్పడానికి ఇచ్చే చెల్లింపు తీసుకుని బిలాము దగ్గరికి వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పారు. 8 అతడు వారితో “ఈ రాత్రి ఇక్కడే ఉండండి. యెహోవా నాకు చెప్పిన మాటలు నేను మళ్ళీ వచ్చి మీతో చెప్తాను” అన్నాడు. అప్పుడు మోయాబు నాయకులు ఆ రాత్రి బిలాము దగ్గర ఉన్నారు.
9 దేవుడు బిలాము దగ్గరికి వచ్చి “నీ దగ్గరున్న ఈ మనుషులు ఎవరు?” అన్నాడు. 10 బిలాము దేవునితో “సిప్పోరు కొడుకు బాలాకు అనే మోయాబు రాజు వార్త పంపించి, 11 ‘చూడు, ఒక జాతి ఐగుప్తునుంచి బయలుదేరి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి ఉన్నారు. నువ్వు వెంటనే వచ్చి నా కోసం వారిని శపించు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో’ అని వీళ్ళతో నాకు వార్త పంపించాడు” అన్నాడు.
12 దేవుడు బిలాముకు జవాబిస్తూ “నువ్వు వారితో వెళ్లకూడదు. ఆ ప్రజలను శపించకూడదు. వారు ఆశీర్వాదం పొందిన వారు” అన్నాడు. 13 కాబట్టి బిలాము ఉదయాన లేచి, బాలాకు నాయకులతో “మీరు మీ స్వదేశానికి వెళ్ళి పొండి. మీతో వెళ్ళడానికి యెహోవా నాకు అనుమతి ఇవ్వలేదు” అన్నాడు. 14 కాబట్టి మోయాబు నాయకులు లేచి బాలాకు దగ్గరికి వెళ్లి “బిలాము మాతో రావడానికి నిరాకరించాడు” అని చెప్పారు.
15 బాలాకు వారికంటే ఘనత కలిగిన ఇంకా ఎక్కువ మంది నాయకులను మళ్ళీ పంపించాడు. 16 వారు బిలాము దగ్గరికి వచ్చి అతనితో “సిప్పోరు కొడుకు బాలాకు, ‘నువ్వు నా దగ్గరికి రావడానికి దయచేసి ఏదీ నిన్ను ఆపనివ్వకు, 17 ఎందుకంటే, నేను నిన్ను చాలా గొప్పవాణ్ణి చేస్తాను. నువ్వు నాతో ఏం చెప్పినా చేస్తాను. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి, నా కోసం ఈ జనాన్ని శపించు’ అని చెప్పమన్నాడు” అన్నారు.
18 బిలాము జవాబిస్తూ “బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా, నేను చెయ్యాల్సిన పని చిన్నదైనా పెద్దదైనా, నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. 19 కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి కూడా ఇక్కడ ఉండండి. యెహోవా నాతో ఇంకేం చెప్తాడో నేను తెలుసుకుంటాను” అన్నాడు. 20 ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి వచ్చి “ఆ మనుషులు నిన్ను పిలిపించారు గనక నువ్వు లేచి వారితో వెళ్ళు. కాని కేవలం నేను నీతో చెప్పినట్టే నువ్వు చెయ్యాలి” అని చెప్పాడు.
బిలాము గాడిద
21 ఉదయాన బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు నాయకులతోపాటు వెళ్ళాడు. 22 అతడు వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత అతనికి విరోధంగా దారిలో అడ్డంగా నిలిచి ఉన్నాడు. అతడు తన గాడిద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు, అతని పనివారు ఇద్దరు అతనితోపాటు ఉన్నారు. 23 యెహోవా దూత కత్తి దూసి, దారిలో నిలిచి ఉండడం ఆ గాడిద చూసింది గనక అది దారి మళ్ళి పొలంలోకి వెళ్ళింది. బిలాము గాడిదను దారిలోకి మళ్ళించాలని దాన్ని కొట్టాడు.
24 యెహోవా దూత అటూ ఇటూ గోడలున్న ద్రాక్షతోటల సందులో నిలిచాడు. 25 గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది గనక అతడు మళ్ళీ దాన్ని కొట్టాడు.
26 యెహోవా దూత ముందుకు వెళ్లి, కుడికైనా ఎడమకైనా తిరగడానికి దారిలేని ఇరుకు ప్రాంతంలో నిలిచినప్పుడు, 27 ఆ గాడిద యెహోవా దూతను చూసి బిలాముతోబాటు కింద పడిపోయింది గనక బిలాము మండిపడ్డాడు. తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు.
28 అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచాడు. అది “నువ్వు నన్ను మూడుసార్లు కొట్టావు. నేను ఏమి చేశాను?” అని బిలాముతో అంది. 29 బిలాము “నువ్వు నన్ను ఒక వెర్రివాణ్ణి చేశావు. నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపేసే వాణ్ణి” అన్నాడు. 30 ఆ గాడిద “ఈ రోజు వరకూ నీ జీవితమంతా నువ్వు స్వారీ చేసిన నేను నీదాన్ని కాదా? నేనెప్పుడైనా నీ పట్ల ఈవిధంగా చేశానా?” అని బిలాముతో అంది. బిలాము “లేదు” అన్నాడు.
31 అప్పుడు యెహోవా బిలాము కళ్ళు తెరిచాడు గనక దూసిన కత్తి చేత్తో పట్టుకుని దారిలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. 32 యెహోవా దూత “నీ గాడిదను మూడుసార్లు ఎందుకు కొట్టావు? చూడు, నా దృష్టిలో నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు గనక నేను నీకు విరోధిగా వచ్చాను. 33 ఆ గాడిద నన్ను చూసి ఈ మూడుసార్లు నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళింది. అది నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళకపోతే కచ్చితంగా అప్పుడే నేను నిన్ను చంపి దాని ప్రాణం రక్షించి ఉండేవాణ్ణి” అని అతనితో అన్నాడు.
34 అందుకు బిలాము “నేను పాపం చేశాను. నువ్వు నాకు ఎదురుగా దారిలో నిలుచుని ఉన్నావని నాకు తెలియలేదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను ఎక్కడనుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను” అని యెహోవా దూతతో చెప్పాడు. 35 యెహోవా దూత “నువ్వు ఆ మనుషులతోపాటు వెళ్ళు. కాని, నేను నీతో చెప్పే మాటలేగాని, ఇంకేమీ పలకొద్దు” అని బిలాముతో చెప్పాడు. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో పాటు వెళ్ళాడు.
36 బిలాము వచ్చాడని బాలాకు విని, ఆ సరిహద్దు చివర ఉన్న అర్నోను తీరంలో అతన్ని కలుసుకోడానికి మోయాబు పట్టణం వరకూ వెళ్ళినప్పుడు, 37 బాలాకు బిలాముతో “నిన్ను పిలవడానికి నేను నీ దగ్గరికి రాయబారులను పంపాను గదా! నువ్వెందుకు నా దగ్గరికి రాలేదు? నిన్ను గొప్పవాణ్ణి చేసే సామర్థ్యం నాకు లేదా?” అన్నాడు.
38 అప్పుడు బిలాము “చూడు, నేను నీ దగ్గరికి వచ్చాను. నాకిష్టమొచ్చింది చెప్పడానికి నాకు శక్తి ఉందా? దేవుడు నా నోట పలికించే మాటే పలకగలను గదా” అని బాలాకుతో చెప్పాడు. 39 అప్పుడు బిలాము బాలాకుతో పాటు వెళ్ళాడు. వారు కిర్యత్ హుజోతుకు వచ్చినప్పుడు 40 బాలాకు ఎడ్లు, గొర్రెలు బలిగా అర్పించి, కొంతభాగం బిలాముకు, అతని దగ్గరున్న నాయకులకు పంపించాడు.
41 బాలాకు ఆ తరువాత రోజు బిలామును * 22:41 బామోతు బయలు.బయలుకు చెందిన ఎత్తైన స్థలాల దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అక్కడనుంచి బిలాము ఇశ్రాయేలీయుల శిబిరంలో కొంత భాగమే చూడగలిగాడు.