6
నాజీరు వారు
1 తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. 2 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. ఎవరన్నా స్త్రీ గానీ పురుషుడు గానీ తనను యెహోవా కోసం ప్రత్యేకపరచుకుని * 6:2 యెహోవా పని కోసం ప్రత్యేకించబడిన.నాజీరు కావడానికి మొక్కుకుంటే ఆ వ్యక్తి ద్రాక్షారసాన్ని గానీ మత్తు కలిగించే పానీయాలు గానీ తీసుకోకూడదు. పులిసిన ద్రాక్షారసం గానీ మద్యాన్ని గానీ తీసుకోకూడదు. 3 ఎలాంటి ద్రాక్షారసాన్నీ తాగకూడదు. ద్రాక్షాపళ్ళు పండినవైనా, ఎండినవైనా తినకూడదు. 4 నా కోసం అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో ద్రాక్ష తీగల నుండి తీసిన దేనినీ తినకూడదు. అవి పచ్చి కాయలైనా, పైన ఉండే తోలు అయినా తినకూడదు.
5 అతడు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజుల్లో మంగలి కత్తి అతడి తలని తాకకూడదు. యెహోవాకు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజులు పూర్తయే వరకూ జుట్టు పెరగనియ్యాలి. దేవుని కోసం అతడు ప్రత్యేకంగా ఉండాలి. తలపై జుట్టు పొడుగ్గా పెరగనియ్యాలి.
6 అతడు తనను యెహోవాకు ప్రత్యేకించుకున్న రోజుల్లో మృతదేహాన్ని సమీపించకూడదు. 7 తన తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, వీరిలో ఎవరు మరణించినా అతడు వారిని తాకి తనను అపవిత్రం చేసుకోకూడదు. 8 అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో పవిత్రంగా ఉంటాడు. యెహోవా కోసం ప్రత్యేకంగా ఉంటాడు.
9 ఎవరైనా అతని పక్కనే అకస్మాత్తుగా పడి చనిపోతే, దానివల్ల ప్రత్యేకంగా ఉండే వ్యక్తి అపవిత్రుడైతే అతడు తాను పవిత్రం అయ్యాక అంటే ఏడు రోజుల తరువాత తన తల జుట్టుని కత్తిరించుకోవాలి. అంటే ఏడో రోజున కత్తిరించుకోవాలన్నమాట.
10 ఎనిమిదో రోజున అతడు రెండు గువ్వలను గానీ లేదా రెండు పావురం పిల్లలను గానీ పట్టుకుని వాటిని సన్నిధి గుడారం ద్వారం దగ్గర ఉన్న యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. 11 అప్పుడు యాజకుడు ఒకదాన్ని పాపం కోసం చేసే బలిగా. రెండో దాన్ని దహనబలిగా అర్పించాలి. ఆ వ్యక్తి మృతదేహాన్ని తాకి పాపం చేసాడు కాబట్టి ఇవి అతని కోసం పరిహారం అవుతాయి. ఆ రోజునే అతడు తనను తను పవిత్రం చేసుకోవాలి.
12 తరువాత అతడు తిరిగి నాజీరుగా ఉండే కాలాన్ని ప్రతిష్టించాలి. అతడు అపరాధ బలిగా ఒక ఏడాది వయసున్న మగ గొర్రె పిల్లని తీసుకురావాలి. అతడు అపవిత్రుడు కాకముందు మొక్కుకున్న రోజులు లెక్కలోకి రాకూడదు. ఎందుకంటే అతడు యెహోవా కోసం ప్రత్యేకంగా ఉండి అపవిత్రం అయ్యాడు.
13 నాజీరుగా ఉండటానికి మొక్కుకుని ఆ నాజీరుగా ఉండే సమయం ముగిసిన తరువాత అతడు చేయాల్సిన దాని గురించిన చట్టం ఇది. అతణ్ణి సన్నిధి గుడారం ద్వారం దగ్గరకి తీసుకురావాలి. 14 అతడు తన అర్పణ యెహోవాకు అర్పించాలి. ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఒక మగ గొర్రెపిల్లని దహనబలిగా అర్పించాలి. అలాగే ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఆడ గొర్రెపిల్లను పాపం కోసం చేసే అర్పణగా తీసుకురావాలి. అతడింకా లోపరహితమైన ఒక పొట్టేలును శాంతి బలిగా తీసుకురావాలి. 15 అలాగే అతడు తన నైవేద్య అర్పణ, పానార్పణలతో పాటు పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన గంపెడు రొట్టెలూ, సన్నని గోదుమ పిండితో నూనె రాసి చేసిన వంటకాలూ, పొంగజేసే పదార్ధం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలూ యెహోవా దగ్గరకి తీసుకురావాలి.
16 అప్పుడు యాజకుడు యెహోవా సమక్షంలోకి వాటిని తెచ్చి అతడి కోసం దహనబలినీ, పాపం కోసం చేసే బలినీ అర్పించాలి. 17 పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెల గంపతో పాటు ఆ పొట్టేలును యెహోవాకు శాంతి బలిగా అర్పించాలి. అతని నైవేద్యాన్ని పానార్పణతో కలిపి అర్పించాలి.
18 అప్పుడా నాజీరు సన్నిధి గుడారం ద్వారం దగ్గర తన ప్రత్యేకతను సూచించే తల జుట్టు కత్తిరించుకోవాలి. ఆ జుట్టును శాంతిబలి అర్పణ సామగ్రి కింద ఉన్న మంటలో పడవేయాలి.
19 అప్పుడు యాజకుడు ఉడికిన పొట్టేలు జబ్బనీ గంపలోనుండి పొంగని పదార్ధంతో చేసిన ఒక రొట్టెనూ పొంగని పదార్ధంతో చేసిన ఒక అప్పడాన్నీ తీసుకోవాలి. యాజకుడు వాటిని ప్రత్యేకతను సూచించే తన తల వెండ్రుకలు కత్తిరించుకున్న నాజీరు చేతుల్లో ఉంచాలి. 20 తరువాత యాజకుడు యెహోవా సమక్షంలో పైకెత్తి కదిల్చే అర్పణ గా వాటిని కదిలించాలి. వాటిని యెహోవాకు అర్పించాలి. అది పవిత్ర ఆహారం. పైకెత్తి కదిలించిన రొమ్ము భాగం, తొడ భాగంతో కలిపి ఇది యాజకునికి చెందుతుంది. దాని తరువాత ఆ నాజీరు ద్రాక్షారసం తాగవచ్చు.
21 మొక్కుకున్న నాజీరును గురించిన ఉపదేశం ఇది. తనను యెహోవా కోసం ప్రత్యేకించుకోడానికి అతడు అర్పించాల్సిన వాటిని గురించిన ఉపదేశం ఇది. తాను నాజీరు కావడానికి మొక్కుకున్న దంతా అతడు నెరవేర్చాలి.”
యాజకుడు ప్రజలను దీవించే విధానం
22 యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు. 23 “అహరోనుకూ అతని కొడుకులకూ ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించాలి. మీరు వారితో ఇలా చెప్పాలి.
24 యెహోవా మిమ్మల్ని దీవించి సంరక్షిస్తాడు గాక!
25 యెహోవా మీపై తన వెలుగు ప్రకాశింప చేస్తాడు గాక! మిమ్మల్ని కరుణిస్తాడు గాక!
26 యెహోవా మిమ్మల్ని కన్నులారా చూసి మీకు శాంతి ప్రసాదించు గాక!
27 ఈ విధంగా వారు ఇశ్రాయేలు ప్రజలకి నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. నేను అప్పుడు వారిని దీవిస్తాను.”