22
యూదా రాజైన అహజ్యా
22:1-6; 2రాజులు 8:25-29
22:7-9; 2రాజులు 9:21-29
యెరూషలేము నివాసులు యెహోరాము ఆఖరి కొడుకు అహజ్యాను అతనికి బదులు రాజుగా చేశారు. ఎందుకంటే, అరబీయులతో కూడ శిబిరం పైకి దండెత్తి వచ్చినవారు అతని పెద్దకొడుకులందరినీ చంపేశారు. ఈ విధంగా యూదారాజు యెహోరాము కొడుకు అహజ్యా రాజయ్యాడు.
అహజ్యా పరిపాలన మొదలు పెట్టినప్పుడు 42 ఏళ్ల వయసులో యెరూషలేములో ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గంగా ప్రవర్తించడం అతని తల్లి అతనికి నేర్పిస్తూ వచ్చింది, కాబట్టి అతడు కూడా అహాబు ఇంటి వారి పద్ధతుల్లో నడిచాడు.
అహాబు ఇంటివారు చేసినట్లుగా అతడు యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత వారు అతనికి సలహాదారులుగా ఉండి అతని నాశనానికి కారణమయ్యారు. వారి సలహా ప్రకారమే అతడు కూడా ప్రవర్తించాడు. అతడు రామోతు గిలాదులో అరాము రాజు హజాయేలుతో యుద్ధం చేయడానికి అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాముతో కూడా వెళ్ళాడు. అరామీయులు యెహోరామును గాయపరిచారు.
అరాము రాజు అయిన హజాయేలుతో తాను రమాలో చేసిన యుద్ధంలో తనకు తగిలిన గాయాలను బాగుచేసుకోడానికి అతడు యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అహాబు కొడుకు యెహోరాము గాయపడ్డాడని విని యూదా రాజు యెహోరాము కొడుకు అహజ్యా అతనిని చూడడానికి యెజ్రెయేలు వెళ్ళాడు.
యెహోరాము దగ్గరికి అహజ్యా రావడం వలన దేవుడు అతనికి నాశనం కలిగించాడు. అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలం చేయడానికి యెహోవా అభిషేకించిన నింషీ కొడుకు యెహూ మీదికి అతడు యెహోరాముతో కలిసి వెళ్ళాడు.
యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అతడు యూదావారి అధికారులనూ, అహజ్యాకు సేవచేస్తున్న అహజ్యా సోదరుల కొడుకులనూ చూసి వారిని చంపేశాడు. తరువాత అతడు అహజ్యా కోసం వెతికాడు. అతడు షోమ్రోనులో దాగి ఉంటే వారు అతణ్ణి పట్టుకుని యెహూ దగ్గరికి తీసుకువచ్చారు. వారు అతణ్ణి చంపిన తరువాత “ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కొడుకు గదా” అనుకుని అతణ్ణి పాతిపెట్టారు. కాబట్టి రాజ్యమేలడానికి అహజ్యా ఇంట్లో ఎవరూ లేకుండా పోయారు.
అతల్యా, యోవాషు
22:10-23:21; 2రాజులు 11:1-21
10 అహజ్యా తల్లి అతల్యా తన కొడుకు చనిపోయాడని విని, యూదావారి సంబంధులైన రాజ వంశస్తులందరినీ చంపేసింది. 11 అయితే రాజైన యెహోరాము కుమార్తె యెహోషబతు అహజ్యా కొడుకు యోవాషును, మరణమైన రాకుమారుల్లోనుండి రహస్యంగా తెచ్చి, అతనిని, అతని దాదిని ఒక పడకగదిలో దాచింది. యెహోరాము రాజు కుమార్తె, యెహోయాదా అనే యాజకుని భార్య యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతణ్ణి దాచిపెట్టింది గనక అతల్యా ఆ పసివాణ్ణి చంపలేకపోయింది. ఈ యెహోషబతు అహజ్యాకు సోదరి. 12 ఆరు సంవత్సరాలు అతణ్ణి వారితో కూడా దేవుని మందిరంలో దాచారు. అప్పుడు అతల్యా దేశాన్ని పరిపాలించింది.