యోనాతాను ఫిలిష్తీయులపై పడటం
14
సౌలు కుమారుడైన యోనాతాను తన ఆయుధాలు మోసే యువకుని పిలిచి “లోయ ఆవలి పక్కన వున్న ఫిలిష్తీయుల గుడారాల వద్దకు వెళదాము” అన్నాడు. కాని ఈ విషయం మాత్రం తన తండ్రికి చెప్పలేదు.
మిగ్రోనులో ఒక కొండ కొనలో ఒక దానిమ్మ చెట్టు క్రింద సౌలు కూర్చుని ఉన్నాడు. ఇది అక్కడ ఉన్న కళ్లానికి దగ్గర్లో ఉంది. సౌలుతోకూడ ఆరువందల మంది మనుష్యులు ఉన్నారు. వారిలో ఒకడు అహీయా. ఈకాబోదు సోదరుడగు అహీటూబు కుమారుడు అహీయా. ఈకాబోదు ఫీనెహాసు కుమారుడు. ఫీనెహాసు ఏలీ కుమారుడు. షిలోహు పట్టణంలో యెహోవా యాజకునిగా అహీయా పని చేస్తున్నాడు. అతడు ఏఫోదు అనబడే పవిత్ర వస్త్రం ధరించాడు.
కనుమకు ఇరుప్రక్కలా నిటారైన బండ లున్నాయి. యోనాతాను ఆ కనుమగుండా ఫిలిష్తీయుల శిబిరమునకు వెళ్లాలని నిర్ణయించాడు. ఒక పక్కనున్న కొండ పేరు బొస్సేసు. రెండవ పక్కనున్న నిడుపు కొండ కనుమ పేరు సెనే. ఒక బండ మిక్మషు వైపు ఉత్తరానికి ఉంది. మరొక బండ గిబియా వైపు దక్షిణంగా ఉంది.
యోనాతాను తన ఆయుధాలు మోసే యువకునితో వారి మీదికి వెళదాము రమ్మన్నాడు. “బహుశః యెహోవా మనకు సహాయం చేయవచ్చు. మనతో ఎక్కువ మంది వున్నారా, తక్కువమంది ఉన్నారా, అన్నది సమస్య కాదు. దేవుడు సంకల్పిస్తే ఇవేమీ అడ్డురావు విజయానికి” అన్నాడు యోనాతాను.
“మీ చిత్తమొచ్చినట్లు చేయండి. నేను ఎంతసేపూ నిన్ను కనిపెట్టుకొనే ఉంటాను” అన్నాడు ఆ యువసైనికుడు.
“అయితే, రా! ఫిలిష్తీయుల దగ్గరకు పోదాము. వారు మనలను చూసేలా వెళదాము. వాళ్లు గనుక మనల్ని చూసి ‘తాము వచ్చే వరకూ ఆగండని’ అంటే, మనము అప్పడు ఎక్కడ వుంటే అక్కడే ఆగిపోదాము. వారి వద్దకు పోవద్దు. 10 కానీ ‘మా దగ్గరకు పైకి రండి’ అని ఫిలిష్తీయులు చెబితే, మనం వాళ్ల దగ్గరకు ఎక్కి పోదాము. ఎందుకంటే అది దేవుని నుండి వచ్చే గుర్తు గనుక. మనం వారిని ఓడించేలా యెహోవా చేస్తాడని దాని అర్థం.” అని యోనాతాను తన యువ సైనికునితో చెప్పాడు.
11 ఫిలిష్తీయులు వారిని చూసేలా యోనాతాను, అతని సహాయకుడు ఇద్దరూ కలిసి వెళ్లారు. వీరిని చూసిన ఫిలిష్తీయులు వారిలో వారు, “చూడండి! హెబ్రీ సైనికులు వారు దాగిన బొరియలనుండి బయటికి వస్తున్నారు!” అని అనుకున్నారు. 12 శిబిరంలో వున్న ఫిలిష్తీయులు వారిద్దరినీ చూసి, “మావద్దకు పైకి రండి. మీకు మంచి గుణపాఠం చెబతాము” అన్నారు.
అది విన్న యోనాతాను తన సహాయకునితో, “నా వెనుకనే కొండ ఎక్కు. యెహోవా ఫిలిష్తీయులను ఇశ్రాయేలుకు అప్పగించాడు!” అని చెప్పాడు.
13-14 అప్పుడు యోనాతాను తన కాళ్లు, చేతులతో మీదికి ఎగబాకినాడు. భటుడు అతని వెనుకనే అనుసరించాడు. యోనాతాను మరియు అతని సహాయకుడు ఫిలిష్తీయులను ఎదుర్కొన్నారు. మొదటి వధయందు వారు ఇరవై మంది ఫిలిష్తీయులను అర ఎకరము నేల పొడవున చంపారు. యోనాతాను ఎదురుగా వచ్చిన వారితో పోరాడాడు. ఆయుధాలు మోసేవాడు అతని వెనుకనే వస్తూ చావకుండా గాయపడ్డవారిని చంపేసాడు.
15 ఫిలిష్తీయులంతా చాలా భయపడిపోయారు. మెరుపు దాడులను చేయగల దళంవారితో సహా శిబిరంలో ఉన్న వారంతా మిక్కిలిగా భయపడ్డారు. భూమి కూడ కంపించింది! వారు చాలా భయంతో వణకిపోయారు.
16 బెన్యామీను దేశంలోని గిబియా వద్ద ఉన్న సౌలు సైనికులు, ఫిలిష్తీ సైనికులు చెల్లాచెదురై పారిపోవటం చూశారు. 17 సౌలు తనతోకూడ ఉన్న సైన్యంతో “మనుష్యుల్ని లెక్కబెట్టండి. శిబిరాన్ని విడిచిపోయింది ఎవరో నేను తెలుసుకోవాలి” అన్నాడు.
వారు లెక్క పెట్టి చూస్తే, అక్కడ లేని వారు యోనాతాను, అతని ఆయుధము మోసేవాడు.
18 “దేవుని పవిత్ర పెట్టెను తెమ్మని” యాజకుడైన అహీయతో సౌలు చెప్పాడు. (ఆ సమయంలో పవిత్ర పెట్టె ఇశ్రాయేలీయుల వద్ద ఉంది). 19 సౌలు యాజకునితో మాట్లాడుతూ వుండగానే ఫిలిష్తీయులలో అలజడి ఎక్కువయ్యింది. అప్పుడు సౌలు అసహనంతో, “నీ ప్రార్థన యిక చాలు, నీ చేతులు క్రిందికి దించు” అని యాజకునితో చెప్పాడు.
20 సౌలు, మరియు అతనితోవున్న సైన్యం సమకూడి యుద్ధానికి దిగారు. ఫిలిష్తీయులు గందరగోళంగా ఉన్నారని వారు గమనించారు. కొంతమంది ఫిలిష్తీయులు తమలో తామే కత్తులతో పొడుచు కొంటున్నట్టువారు చూశారు. 21 గతంలో వారి క్రింద పని చేసిన హెబ్రీయులు కొందరు ఫిలిష్తీయుల శిబిరంలో ఉన్నారు. ఈ హెబ్రీయులు సౌలు, యోనాతానుతో వున్న ఇశ్రాయేలీయులకు మద్దతు ఇచ్చారు. 22 ఎఫ్రాయిము కొండల దేశంలో దాగివున్న ఇశ్రాయేలీయులంతా పారిపోతున్న ఫిలిష్తీయుల గూర్చి విన్నారు. వీరంతా యుద్ధంలో చేరి ఫిలిష్తీయులను తరిమికొట్టారు.
23 ఆ విధంగా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యుద్ధం బేతావెను దాటిపోయింది. సైన్యమంతా సౌలు దగ్గర ఉంది. సుమారు పదివేల మంది అతని వద్ద ఉన్నారు. తరువాత ఎఫ్రాయిము రాజ్యంలోని ప్రతి నగరానికీ యుద్ధం వ్యాపించింది.
సౌలు చేసిన మరో తప్పు
24 ఆరోజు సౌలు ఒక పెద్ద తప్పు చేశాడు. ఇశ్రాయేలు సైనికులు ఆకలితో నకనకలాడి పోయారు. దీనికంతటికీ కారణం వారిని సౌలు ఒక ప్రమాణం క్రింద వుంచటమే! “సాయంత్రమయ్యేలోగా గాని, లేక నా శత్రువులను నేను ఓడించక ముందుగాని ఎవ్వరైనా భోజనం చేస్తే వారు శపించబడతారు!” అని వారికి సౌలు ముందుగానే చెప్పాడు. దానితో ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరూ ఆహారం ముట్టలేదు.
25 ఆ ప్రాంతంలో ఒక తేనెతుట్ట వుంది. 26 సైనికులు దానివద్దకు వచ్చేసరికి వాళ్ల ప్రమాణం జ్ఞాపకం రావటంతో తేనె ముట్టటానికి భయపడిపోయారు. 27 అయితే సౌలు చేయించిన ఈ ప్రమాణం గురించి యోనాతానుకు తెలియదు. అతను తన చేతికర్రను తేనెతుట్టలోనికి గుచ్చి లాగగానే తేనెవచ్చింది. అతడు దానిని తాగగా అతనికి ఎంతో హాయినిచ్చింది.
28 సైనికులలో ఒకడు యోనాతానుకు “నీ తండ్రి సైనికులతో ప్రమాణము చేయించి, ఆహారము పుచ్చుకొనువాడు శపించబడును అని చెప్పాడు. అందువల్లనే ఏ ఒక్క సైనికుడు కూడా ఆ రోజు ఏమీ తినలేదని అన్నాడు. అందువల్లనే సైనికులంతా విపరీతంగా అలసిపోయారని” చెప్పాడు.
29 “మా తండ్రి దేశానికి లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టాడు. చూడండి! ఈ తేనెను నేను కొంచెం రుచిచూస్తేనే నాకు చాలా హాయిగా వుంది! 30 ఈ రోజు శత్రువుల వద్ద తీసుకున్న ఆహారమంతా మన సైనికులు గనుక తినివుంటే, వారు ఎంత హాయిగా ఉండేవారు! ఇంకా చాలా మంది ఫిలిష్తీయులను కూడ చంపి ఉండే వాళ్లు!” అన్నాడు యోనాతాను.
31 ఆ రోజు మిక్మషునుండి అయ్యాలోను వరకూగల ఫిలిష్తీయులనందరినీ ఇశ్రాయేలు సైనికులు ఓడించారు. ఆ తరువాత వారు బాగా నీరసించి పోయారు. 32 వారు ఫిలిష్తీయుల గొర్రెలను, పశువులను, దూడలను పట్టుకొన్నారు. ఆకలికి తట్టుకోలేక వారు ఆ పశువులను నేలమీదే చంపి రక్తంతో నిండిన మాంసాన్నే తినివేశారు.
33 ఒక వ్యక్తి వెళ్లి సౌలుతో, “చూశావా! సైనికులంతా యెహోవా పట్ల పాపం చేస్తున్నారు. రక్తం కలసివున్న మాంసాన్నే వారు తింటున్నారు” అని చెప్పాడు.
అది విని సౌలు, “మీరు పాపం చేశారు! ఒక పెద్ద బండను ఇక్కడికి దొర్లించండి” అన్నాడు. 34 “నీవు వెళ్లి ప్రతి ఒక్కడ్నీ తన ఎద్దును, గొర్రెను ఇక్కడికి తీసుకుని రమ్మను. వారు వచ్చి తమ పశువులను ఇక్కడ బండ మీద వధించాలి. దేవుని పట్లపాపం చేయవద్దు. రక్తం కలిసివున్న మాంసాన్ని తినకండి” అన్నాడు సౌలు.
ఆ రాత్రి ప్రతి ఒక్కడూ తన పశువులను తెచ్చి అక్కడ వధించాడు. 35 తరువాత సౌలు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. అది సౌలు తానే యెహోవాకి నిర్మించిన మొదటి బలిపీఠం.
36 “పదండి! ఈ రాత్రి ఫిలిష్తీయులను తరుముదాము. వాళ్లనందరినీ చంపివేసి వాళ్ల వస్తువులన్నీ తీసుకుందాము!” అన్నాడు సౌలు.
“నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి” అని సైనికులు జవాబిచ్చారు.
కానీ “మనము దేవుని అడుగు దాము” అని యాజకుడు చెప్పాడు.
37 అందువల్ల సౌలు లేచి, “దేవా! నేను వెళ్లి ఫిలిష్తీయులను తరిమికొట్టనా? మేము వాళ్లను ఓడించేలా సహాయం చేస్తావా?” అని అడిగాడు. కాని ఆ రోజు సౌలుకు యెహోవా సమాధానం ఇవ్వలేదు.
38 “నాయకులందరినీ నా దగ్గరకు తీసుకుని రండి. ఈ వేళ ఎవరు పాపం చేసారో మనము తెలుసు కొందాము. 39 ఇశ్రాయేలును రక్షించే యెహోవా తోడుగా నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. ఈ పాపం నా స్వంత కుమారుడు యోనాతాను చేసినా, అతడు చావాల్సిందే” అని చెప్పాడు సౌలు. సైన్యంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.
40 సౌలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి వారందరినీ ఒక పక్కన నిలబెట్టి, తన కుమారునితో కలిసి తానొక పక్కన నిలబడ్డాడు.
“మీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయండి” అని సైనికులంతా చెప్పారు.
41 “ఓ ఇశ్రాయేలీయుల దేవుడవై యెహోవా, నీ సేవకుడనైన నా ప్రార్థన ఈ రోజున ఎందుకు ఆలకించలేదు! నేను గాని, నా కుమారుడు యోనాతాను గాని పాపం చేస్తే మాకు ఊరీము పడేలా చేయుము. నీ ప్రజలయిన ఇశ్రాయేలీయులు పాపం చేస్తే, వారికి తుమ్మీము* పడేలా చేయము” అని సౌలు ప్రార్థన చేశాడు.
సౌలు యోనాతాను పాపం చేసినట్టు ఊరీము పడింది. అందుచేత ప్రజలు నిర్దోషులని తేలటంతో వారు వెళ్లిపోయారు. 42 సౌలు, యోనాతానుల మధ్య మళ్లీ వేస్తే యోనాతాను దోషి అని తేలింది.
43 “ఏమి చేసావో చెప్పు” అని సౌలు యోనాతానును అడిగాడు.
“నేను కేవలం నా చేతికర్ర చివరన అంటిన తేనెనురుచి చూసాను. దానికే నేను మరణశిక్ష అనుభవించాలా?” అన్నాడు యోనాతాను.
44 సౌలు “దేవునికి నేను తీవ్రమైన ప్రమాణం చేసాను. నా ప్రమాణాన్ని గనుక నేను నిలబెట్టుకోక పోతే నాకు ఎన్నో దారుణాలు చేయుమని నేను దేవుని అడిగాను. కనుక యోనాతానూ, నీవు మరణించాల్సిందే” అన్నాడు.
45 అయితే సైనికులు, “ఈవేళ ఇశ్రాయేలీయులను మహా విజయానికి నడిపించిన వాడు యోనాతానే. అలాంటప్పుడు యోనాతాను మరణించాలా? వీల్లేదు. సజీవ దేవుని తోడు, యోనాతాను తలమీదనుండి ఒక్క వెంట్రుక నేలరాలదుగాక! ఈ వేళ ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి దేవుడే యోనాతానుకు సహాయం చేసాడు!” ఇని సౌలుతో చెప్పారు. అందుచేత సైనికులు యోనాతానును కాపాడారు. అతడు చంపబడలేదు.
46 కనుక ఫిలిష్తీయులను తరమటం సౌలుమానుకున్నాడు. ఫిలిష్తీయులు వారి స్థలానికి వెళ్లి పోయారు.
ఇశ్రాయేలు శత్రువులతో సౌలు పోరాటం
47 సౌలు పరిపాలన సాగించిన కాలంలో, ఇశ్రాయేలు చుట్టూవున్న దాని శత్రువులందరితో అతడు యుద్ధం చేశాడు. మోయాబీయులతోను అమ్మోనీయులతోను, ఎదోమీయులతోను, సోబాదేశపు రాజులతోను, ఫిలిష్తీయులతోను సౌలు యుద్ధంచేశాడు. సౌలు ఎక్కడికి వెళితే అక్కడ శత్రువులను ఓడించి విజయంసాధించాడు. 48 సౌలు చాలా ధైర్యవంతుడు. అతడు అమాలేకీయులను సహా జయించాడు. ఇశ్రాయేలును కొల్లగొట్టాలని ప్రయత్నించిన దాని శత్రువులందరినీ సౌలు చీల్చి చెండాడి ఇశ్రాయేలును రక్షించాడు.
49 యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ, ఈ ముగ్గురూ సౌలు కుమారులు. సౌలు పెద్దకుమార్తె పేరు మేరబు. ఆయన చిన్న కుమర్తె మీకాలు. 50 సౌలు భార్య పేరు అహీనోయము. ఆమె అహిమయస్సు అనే వాని కుమార్తె సౌలు సైన్యాధికారి పేరు అబ్నేరు.
అతడు నేరు అనేవాని కుమారుడు. నేరు సౌలు పినతండ్రి. 51 సౌలు తండ్రి కీషు; అబ్నేరు తండ్రి నేరు-ఇద్దరూ అబీయేలు అనే వాని కుమారులు.
52 సౌలు జీవితాంతం ధైర్యశాలిగా ఉన్నాడు. ఫిలిష్తీయులతో తీవ్రంగా పోరాడాడు. సౌలు తన రాజ్యంలో ఎప్పుడయినా, ఎక్కడయినా ఒక ధైర్యవంతుని గాని బలశాలిని గాని చూస్తే వానిని తన కోటలోని ప్రత్యేక సైనిక దళంలో చేర్చుకొనేవాడు.

* 14:41: ఊరీము … తుమ్మీము దేవుని నుండి తమ ప్రశ్నలకు జవాబులు పొందేందుకు యాజకులు వీటిని ఉపయోగించేవారు.