సొలొమోను నిర్మించిన నగరాలు
8
ఆలయ నిర్మాణానికి, తన స్వంత ఇంటి నిర్మాణానికి సొలొమోనుకు ఇరవై సంవత్సరాలు పట్టింది. పిమ్మట హీరాము తనకు ఇచ్చిన పట్టణాలను తిరిగి నిర్మించాడు. ఆ పట్టణాలలో కొంత మంది ఇశ్రాయేలీయులను సొలొమోను నివసింపనిచ్చాడు. దీని తరువాత సొలొమోను సోబాలోని హమాతు నగరాన్ని వశపర్చుకున్నాడు. సొలొమోను తద్మోరు అనే పట్టణాన్ని కూడా ఎడారిలో నిర్మించాడు. హమాతులోని పట్టణాలన్నిటినీ వస్తుసామగ్రులను నిలవచేయటానికి నిర్మించాడు. సొలొమోను ఎగువ బేత్ హోరోను, దిగువ బేత్ హోరోను పట్టణాలను కూడ కట్టించాడు. అతడీ పట్టణాలను బలమైన కోటలుగా తయారు చేశాడు. వాటి చుట్టూ గోడలు, వాటి ద్వారాలు, ద్వారాలకు కడ్డీలు ఏర్పాటు చేశాడు. బయలతు పట్టణాన్ని వస్తువులు నిల్వచేసే ఇతర పట్టణాలను సొలొమోను మళ్లీ కట్టించాడు. రథశాలలున్న పట్టణాలను, గుర్రాలను నడిపే రౌతుల నగరాలన్నిటినీ సొలొమోను కట్టించాడు. యెరూషలేములోను, లెబానోనులోను, తాను రాజుగా వున్న ప్రాంతాలన్నిటిలోను సొలొమోను తనకు కావలసిన వాటినన్నిటినీ కట్టించాడు.
7-8 ఇశ్రాయేలీయులు నివసిస్తున్న దేశంలో చాలా మంది పరదేశీయులున్నారు. వారిలో హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు వున్నారు. ఆ పరదేశీయులందరినీ సొలొమోను బానిసలుగా పనిచేయించాడు. వారు ఇశ్రాయేలీయులు కారు. వారంతా దేశాన్ని వదలిపోగా మిగిలిన వారంతా పరదేశీయుల సంతతివారు. పైగా వారు ఇశ్రాయేలీయులచే చంపబడకుండా మిగిలిపోయినవారు. ఈవెట్టి చాకిరి ఈనాటికీ కొనసాగుతూనే వుంది. ఇశ్రాయేలీయులైన వారెవరినీ బానిసలుగా చేయమని సొలొమోను వత్తిడి చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను యొక్క పోరాట యోధులు వారు అతని సైనికాధికారులలో ముఖ్యులుగాను, రథాలకు అధిపతులుగాను, రథసారధులకు నాయకులుగాను నియమింప బడ్డారు. 10 కొంతమంది ఇశ్రాయేలీయులు సొలొమోను ముఖ్యాధిపతులకు పైఅధికారులుగా వున్నారు. ప్రజల కార్యకలపాలు తనిఖీ చేయటానికి ఇలాంటివివారు రెండు వందల ఏబై మంది ఉన్నారు.
11 ఫరోరాజు కుమార్తెను దావీదు నగరం నుండి ఆమె కొరకు కట్టించిన భవంతికి సొలొమోను తీసుకొని వచ్చాడు. “నా భార్య రాజైన దావీదు ఇంటిలో నివసించ కూడదు. ఎందువల్లనంటే దేవుని ఒడంబడిక పెట్టె వెళ్లిన ప్రతిచోటూ పవిత్రమైనది” అని సొలొమోను అన్నాడు.
12 యెహోవా బలిపీఠం మీద సొలొమోను దహన బలులు అర్పించాడు. 13 మోషే ఆజ్ఞాపించిన విధంగా సొలొమోను ప్రతిరోజూ బలులు అర్పించాడు. బలులు ప్రతి సబ్బాతు దినాన, ప్రతి అమావాస్య రోజున, మరియు సంవత్సరంలో వచ్చే మూడు పండుగ సెలవు రోజులలోను అర్పించేవారు. ఆ మూడు పండుగలకు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ మరియు పర్ణశాలల పండుగ అని పేర్లు. 14 తన తండ్రి దావీదు ఉపదేశాలన్నిటినీ సొలొమోను పాటించాడు. సొలొమోను వివిధ కార్యాలకు అర్హతగల యాజక వర్గాలను నియమించాడు. లేవీయులను కూడ వారికి తగిన పనులకు సొలొమోను నియమించాడు. భక్తిగీతాల కార్యక్రమ నిర్వహణ, ఆలయంలో దేవుని సేవలో నిత్యం కావలసిన వస్తువులు చేయుటలో యాజకులకు తోడ్పడటం లేవీయుల పని. ప్రతి ద్వారంవద్ద సేవ చేయటానికి తగిన విధంగా జట్లను సొలొమోను ఎంపిక చేశాడు. ఈ రకంగా చేయమని యెహోవా సేవకుడైన దావీదు ఆజ్ఞాపించాడు. 15 యాజకులకు, లేవీయులకు సొలొమోను ఇచ్చిన ఆదేశాలను ఇశ్రాయేలు ప్రజలు మార్చటంగాని, అనాదరించటంగాని చేయలేదు. కనీసం విలువైన వస్తువుల భద్రత విషయాలలో కూడ వారు ఏ ఒక్క ఆదేశాన్నీ మార్చలేదు.
16 సొలొమోను చేయవలసిన పసంతా పూర్తి అయ్యింది. ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుండి అది పూర్తి అయ్యేవరకు పనియావత్తూ ఒక క్రమ పద్ధతిలో సాగింది. ఆ విధంగా ఆలయం నిర్మింపబడింది.
17 పిమ్మట సొలొమోను ఎసోన్గెబరు, ఏలతు పట్టణాలకు వెళ్లాడు. ఆ పట్టణాలు ఎదోము దేశంలో ఎర్ర సముద్ర తీరంలో వున్నాయి. 18 హీరాము ఓడలను సొలొమోను వద్దకు పంపాడు. హీరాము స్వంత మనుష్యులు ఓడలను నడిపారు. సముద్రయానంలో హీరాము మనుష్యులు ఆరితేరినవారు. హీరాము మనుషష్యులు సొలొమోను సేవకులతో కలిసి ఓఫీరుకు వెళ్లి పదిహేడు టన్నుల* బంగారాన్ని రాజైన సొలొమోనుకు తీసుకొని వచ్చారు.

* 8:18: పదిహేడు టన్నుల నాలుగు వందల ఏబై తలాంతులని లేక తొమ్మిది వందల మణుగులు అని పాఠాంతరం.