ఆలయ నిర్మాణానికి సొలొమోను యత్నం
2
యెహోవా పేరు ఘనపర్చబడేలా ఆలయ నిర్మాణానికి సొలొమోను సన్నాహం చేశాడు. తన కొరకై ఒక రాజభవనాన్ని కూడ నిర్మించుకోవాలని సొలొమోను తలచాడు. సొలొమోను డెబ్బైవేల మందిని సరుకు చేరవేయటానికి నియమించాడు. ఎనబైవేల మందిని కొండల్లో రాళ్లు కొట్టడానికి అతడు నియమించాడు. పనివాళ్ల మీద నిఘావుంచడానికి మూడువేల ఆరువందల మందిని నియమించాడు.
తరువాత సొలొమోను హీరాముకు ఒక వర్తమానం పంపాడు. హీరాము తూరు నగరపు రాజు. సొలొమోను హీరాముకు యిలా చెప్పి పంపాడు:
“నీవు నా తండ్రి దావీదుకు సహాయపడినట్లు నాకు కూడ సహాయం చెయ్యి. తను నివసించే భవన నిర్మాణానికి నీవాయనకు సరళ వృక్షాల కలపను పంపావు. నా దేవుడైన యెహోవా గౌరవార్థం నేనొక ఆలయం నిర్మింపదలిచాను. నా ప్రజలు ఆరాధించుకొనటానికి వీలుగా దానిని నా దేవునికి అంకితం చేస్తాను. యెహోవా ముందు ధూపం వేసి, ఆయన సన్నిధిని ప్రతినిత్యం పవిత్రమైన రొట్టెను నైవేద్యంగా వుంచి, బలిపీఠంపై ఉదయం, సాయంత్రం దహనబలులు అర్పిస్తూ, మేము మా దేవుని ఆరాధిస్తాము. సబ్బాతు దినాలలోను, అమావాస్య రోజులందును, మరి ఇతర ప్రత్యేక ఉత్సవదినాలలోను, తనను ఆరాధించుమని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞ యిచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతంగా పాటించే ఒక నియమం.
“మా దేవుడు మిగిలిన దైవాలకంటె మహోన్నతుడు గనుక, ఆయనకు నేను నిర్మించే ఆలయం కూడా ఉన్నతంగా ఉంటుంది. నిజానికి మానవ మాత్రుడెవ్వడూ మా దేవునికి ఆలయం నిర్మించలేడు. పరలోక భూలోకాలే మా దేవునికి నిలయాలు కాలేనప్పుడు, నేను ఆయనకు ఆలయం నిర్మాణంచేయ లేను. నేను కేవలం ఆయన సన్నిధిని ధూపం వేయటానికి ఒక పీఠం మాత్రమే నిర్మించగలను.
“కావున వెండి బంగారు పనులలోను; కంచు, ఇనుము పనులలోను నేర్పరియైన ఒక పనివానిని ఇప్పుడు నా వద్దకు పంపించు. అతడు ఊదా, నీలిరంగు పదార్థాలు పనిలో కూడా నేర్పరియై ఉండాలి. నావద్ద వున్న యూదా, యెరూషలేము శిల్పులతో కలిసి అతడు చెక్కడపు పనులు చేయగలిగి ఉండాలి. నా తండ్రియగు దావీదు ఇక్కడ ఈ మనుష్యులను ఎంపిక చేశాడు. సరళ వృక్షాల, దేవదారు వృక్షాల, చందనపు చెట్ల కలపను లెబానోను అడవుల నుండి పంపించు. లెబానోనులో చెట్లను కొట్టడంలో నీ మనుష్యులు అనుభవం కలవారని నాకు తెలుసు. నా సేవకులు నీ మనుష్యులకు సహాయపడతారు. సాధ్యమైనంత ఎక్కువ కలపను నాకు పంపించు. నేను నిర్మించబోయే ఆలయం చాల గొప్పదై, అద్భతమైనదిగా వుంటుంది. 10 కలప నరికే పనివారికి ఆహారం నిమిత్తం నేను నాలుగు వందల గరిసెల* గోధుములు, నాలుగు వందల గరిసెల యవలు, ఒక లక్షా పదిహేను వేలగేలనుల (మూడూ వేల ఎనిమిది వందల పడులు లేక ఇరువది వేల బాదులు) ద్రాక్షారసమును, అదే పరిమాణములో నూనెను కేటాయిస్తున్నాను.”
11 సొలొమోనుకు సమాధానమిస్తూ, హీరాము ఒక వర్తమానాన్ని పంపాడు. ఆ వర్తమానం ఇలా వుంది:
“సొలొమోనూ, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. అందువల్లనే ఆయన నిన్ను వారికి రాజుగా నియమించాడు.” 12 హీరాము తన సందేశంలో ఇంకా యీలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు స్తోత్రం చేయండి! ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన రాజైన దావీదుకు ఒక తెలివైన కుమారుని ప్రసాదించాడు. సొలొమోనూ, నీకు తెలివి, అవగాహన వున్నాయి. నీవు యెహోవా కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నావు. నీకొరకు నీవొక రాజభవనాన్ని కూడా నిర్మింప తలపెట్టావు. 13 నేను నీ వద్దకు ఒక నైపుణ్యంగల పనివానిని పంపుతాను. అతడు రకరకాల కళలలో అభిరుచి, అనుభవం వున్నవాడు. అతని పేరు హూరాము అబీ. 14 అతని తల్లి దాను వంశస్థురాలు. అతని తండ్రి తూరు నగరవాసి. హూరాము — అబీ బంగారం, వెండి, కంచు, ఇనుము, రాతి, కలప పనులలో బహు నేర్పరి. హూరాము — అబీ ఊదా, నీలి, ఎర్రపు రంగుల వస్తువుల, ఖరీదైన వస్త్రాల పనులలో కూడమంచి నేర్పరి. పైగా హూరాము — అబీ చెక్కడపు పనులలో కూడా నిపుణుడు. నీవు చూపిన ఏ నమూనానైనా అతడు అర్థం చేసికొని దాని ప్రకారం పనిచేయగల నేర్పరి. అతడు నీ వద్ద వున్న శిల్పులకు, కళాకారులకు సహాయకారిగా వుంటాడు. దావీదు ఏర్పరచిన కళాకారులకు కూడ సహాయపడతాడు. నీ తండ్రియగు దావీదు మాటను నేను అనుసరిస్తాను.
15 “నీవు గోధుములు, యవల, నూనె ద్రాక్షారసం నాకు పంపుతానని రాశావు. వాటిని నా పనివాళ్ల నిమిత్తం పంపించు. 16 లెబానోను దేశంలో మేము కలప నరుకుతాము. నీకు ఎంతకలప కావాలో అంత కలప నరుకుతాము. ఆ కలపనంతా తెప్పలుగా కట్టి యొప్పా పట్టణం నుండి సముద్రం మీద పంపుతాము. తరువాత ఆ కలపను నీవు యెరూషలేముకు మోయించవచ్చు.”
17 అప్పుడు సొలొమోను ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయులందరినీ లెక్కించాడు. ఇది దావీదు జనాభా లెక్కలు తీయించిన తరువాత జరిగింది. దావీదు సొలొమోను తండ్రి. దేశంలో ఒక లక్షా ఏబై మూడువేల ఆరువందల మంది పరదేశీయులున్నట్లు వారు కనుగొన్నారు. 18 బరువులు మోయటానికి డెబ్బై వేలమంది విదేశీయులను సొలొమోను నియమించాడు. కొండల్లో రాళ్లు చెక్కటానికి ఎనబై వేల మంది విదేశీయులను దావీదు నియమించాడు. పనివారిపై విచారణ చేయడానికి మరి మూడువేల ఆరువందల విదేశీయులను సొలొమోను ఎంపిక చేశాడు.

* 2:10: నాలుగు వందల గరిసెల ఇంచుమించు డెభై వేల కిలో గ్రాములు, లేక రెండు లక్షల తూములు.