యూదారాజుగా యెహోషాపాతు
17
ఆసా స్థానంలో యెహోషాపాతు యూదాకు కొత్తగా రాజయ్యాడు. యెహోషాపాతు ఆసా కుమారుడు. యెహోషాపాతు యూదా రాజ్యాన్ని ఇశ్రాయేలుతో పోరాడగల శక్తిగలదిగా రూపొందించాడు. కోటలుగా మార్చబడిన పట్టణాలన్నిటిలో అతడు సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాడు. యెహోషాపాతు యూదాలోను, తన తండ్రియైన ఆసా వశపర్చుకున్న ఎఫ్రాయిము పట్టణాలలోను కోటలు నిర్మించాడు.
యెహోవా యెహోషాపాతు పక్షాన వున్నాడు. ఎందువల్లనంటే, యెహోషాపాతు చిన్న వాడైనప్పటికి, తన పూర్వీకుడైన దావీదు చేసిన మంచి పనులన్నీ చేశాడు. యెహోషాపాతు బయలు విగ్రహాలను పూజించలేదు. తన పూర్వీకులు అనుసరించిన యెహోవా కోసమే యెహోషాపాతు నిరీక్షించాడు. అతడు దేవుని ఆజ్ఞలను పాటించాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవించిన విధంగా అతడు జీవనాన్ని గడపలేదు. యూదాపై యెహోషాపాతును ఒక శక్తివంతమైన రాజుగా దేవుడు చేశాడు యూదా ప్రజలంతా యెహోషాపాతుకు కానుకులు సమర్పించారు. ఆ విధంగా యెహోషాపాతుకు ఎక్కువ ధనం, గౌరవం లభించాయి. యెహోవా మార్గాల ననుసరించటానికి యెహోషాపాతు హృదయం సంతోషంతో యిష్టపడింది. అతడు ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను యూదా రాజ్యం నుండి తీసివేశాడు.
యెహోషాపాతు కొందరు పెద్దలను యూదా రాజ్యంలో ధర్మశాస్త్రాన్ని బోధించేందుకు పంపించాడు. అది యెహోషాపాతు పాలనలో మూడవయేట* జరిగింది. ఆ పెద్దలు ఎవరంటే బెన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మరియు మీకాయా. ఈ పెద్దలతో పాటు యెహోషాపాతు లేవీయలను కూడ పంపాడు. ఆ లేవీయులు ఎవరంటే షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, మరియు టోబీయా. యెహోషాపాతు యాజకులైన ఎలీషామా, యెహోరాములను కూడా పంపాడు. ఆ పెద్దలు, లేవీయులు, యాజకులు యూదాలో ప్రజలకు బోధించారు. వారి వద్ద యెహోవా ధర్మ శాస్త్ర గ్రంథం వుంది. వారు యూదా పట్టణాలన్నిటికీ వెళ్లి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించారు.
10 యూదా పొరుగు రాజ్యాల వారు యెహోవాకు భయపడ్డారు. అందువల్ల వారు యెహోషాపాతుపై యుద్ధం ప్రకటించలేదు. 11 కొంతమంది ఫిలిష్తీయులు యెహోషాపాతుకు కానుకలు తెచ్చారు. వారు యెహోషాపాతుకు వెండిని కూడా తెచ్చారు. కారణమేమంటే యెహోషాపాతు చాలా శక్తివంతుడైన రాజని వారికి తెలియటమే. అరబీయులు కొందరు గొర్రెల మందలను యెహోషాపాతుకు కానుకలుగా తెచ్చారు. వారు ఏడువేల ఏడు వందల గొర్రెపొట్టేళ్ళను ఏడువేల ఏడు వందల మేకలను తెచ్చారు.
12 యెహోషాపాతు రాను రాను చాలా బలమైన రాజుగా రూపొందాడు. అతడు యూదా రాజ్యంలో కోటలను, గిడ్డంగుల పట్టణాలను కట్టించాడు. 13 సరుకు నిల్వచేసే ఆ పట్టణాలకు నిత్యావసర, తదితర సామగ్రిని అతడు బాగా రవాణా చేశాడు. బాగా శిక్షణ పొందిన సైనికులను యెరూషలేములో యెహోషాపాతు వుంచాడు. 14 ఈ సైనికులువారి పితరుల వంశాలలో చేర్చబడినవారు. యెరూషలేములో వున్న సైనికుల వివరాలు ఏవనగా:
యూదా వంశం నుండి నియమింపబడిన వారిలో సేనాధిపతులున్నారు. అద్నా క్రింద మూడు లక్షల మంది సైనికులున్నారు.
15 యెహోహానాను రెండు లక్షల ఎనబై వేలమంది వున్న సేనకు అధిపతి.
16 అమస్యా రెండు లక్షల మంది సైనికులకు అధిపతి. అమస్యా జిఖ్రీ కుమారుడు. అతడు యెహోవా సేవకు సంతోషంతో అంకితమయ్యాడు.
17 బెన్యామీను వంశం నుండి ఎంపిక చేయబడిన సేనాధిపతుల వివరాలు.
ఎల్యాదా క్రింద విల్లంబలు, డాళ్లు పట్టగల రెండు లక్షల మంది సైనికులున్నారు. ఎల్యాదా మిక్కిలి ధైర్యశాలియైన సేనాని.
18 యెహోజా బాదు క్రింద యుద్ధ సన్నద్ధులైన లక్షా నలబై వేల మంది సైనికులున్నారు.
19 ఈ సైనికులంతా రాజైన యెహోషాపాతుకు సేవ చేశారు. రాజుకు యూదాలో వున్న అన్ని కోటలలో ఇతర సైనికులున్నారు.

* 17:7: యెహోషాపాతు … మూడవయేట సుమారు క్రీ. పూ 871వ సంవత్సరం.