రూబేనీయుల సంతతివారు
5
1-3 ఇశ్రాయేలు పెద్ద కుమారుని పేరు రూబేను. రూబేను జ్యేష్ఠ కుమారునికి అర్హమైన ప్రత్యేకాధిక్యతలు అందుకోవలసి ఉంది. కాని రూబేను తన తండ్రి భార్యలలో ఒకదానితో శయనించిన కారణంగా, ఆ ప్రత్యేక ఆధిక్యతలు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి. కావున వారి వంశావళిలో రూబేను పేరు జన్మలో మొదటివాడుగా పేర్కొనబడలేదు. వారి అన్నదమ్ములలో యూదా మిక్కిలి బలపరాక్రమాలు గలవాడు. అందువల్ల నాయకులంతా అతని కుటుంబంలో నుంచే వచ్చారు. కాని యోసేపు కుటుంబానికి జ్యేష్ఠ పుత్రునికి లభించే ప్రత్యేక ఆదరణ, ఆధిపత్యాలు లభించాయి.
రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ అనేవారు.
యోవేలు సంతతి ఈ విధంగా వుంది: షెమయా అనేవాడు యోవేలు కుమారుడు. షెమయా కుమారుడు గోగు. గోగు కుమారుడు షిమీ. షిమీ కుమారుడు మీకా. మీకా కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు బేలు. బేలు కుమారుడు బెయేర. అష్షూరు (అస్సీరియా) రాజైన తిగ్లత్పిలేసెరు బెయేరను ఇల్లు వెడలగొట్టాడు. దానితో బెయేర అష్షూరు రాజుకు బందీ అయ్యాడు. రూబేను వంశానికి బెయేర పెద్ద.
యోవేలు సోదరుల పేర్లు, అతని వంశావళి వారి వంశ చరిత్రలో పొందుపర్చబడినట్లే క్రమ పద్ధతిలో సరిగ్గా వ్రాయబడినాయి. అవి ఏవనగా: యెహీయేలు మొదటివాడు. తరువాత జెకర్యా మరియు బెల. బెల తండ్రి పేరు ఆజాజు. ఆజాజు తండ్రి షెమ. షెమ తండ్రి పేరు యోవేలు. వారంతా అరోయేరు నుండి నెబో వరకు, బయల్మెయోను వరకు గల ప్రాంతంలో నివసించారు. బెల వంశీయులు తూర్పు దిశన యూఫ్రటీసు నది ఒడ్డున అడవి అంచువరకుగల ప్రాంతంలో నివసించారు. గిలాదులో వారికి లెక్కలేనన్ని ఆవుల మందలు వున్నందున వారక్కడ నివసించసాగారు. 10 సౌలు రాజుగా ఉన్న కాలంలో బెల వంశీయులు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. తరువాత వారు హగ్రీయులకు చెందిన గుడారాలను ఆక్రమించి వాటిలో నివసించారు. గిలాదుకు తూర్పు ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయుల గుడారాలలో వారునివసించసాగారు.
గాదు సంతతివారు
11 గాదు వంశం వారు రూబేనీయులకు సమీపంలోనే నివసించారు. గాదీయులు బాషాను ప్రాంతంలోను, సల్కా వరకు గల ప్రదేశంలోను నివసించారు. 12 బాషానులో యోవేలు మొదటి నాయకుడు (పెద్ద). షాపాము రెండవ నాయకుడు. పిమ్మట యహనైషాపాత్ ముఖ్యుడయ్యాడు. 13 వారి కుటుంబాలలో ఏడుగురు అన్నదమ్ములు. వారు మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ మరియు ఏబెరు. 14 వీరు అబీహాయిలు సంతతివారు. అబీహాయిలు అనేవాడు హూరీ కుమారుడు. హూరీ తండ్రి పేరు యారోయ. యారోయ తండ్రి గిలాదు. గిలాదు తండ్రి మిఖాయేలు. మిఖాయేలు తండ్రి యెషీషై, యెషీషై తండ్రి యహదో. యహదో తండ్రి బూజు. 15 అహీ అనువాడు అబ్దీయేలు కుమారుడు. అబ్దీయేలు తండ్రి పేరు గూనీ. అహీ వారి వంశ పెద్ద.
16 గాదీయులు గిలాదు ప్రాంతంలో నివసించారు. వారు బాషానులోను, దాని చుట్టుపట్ల గ్రామాలలోను, షారోను సరిహద్దు వరకు గల పొలాలలోను కూడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
17 యోతాము, యరోబాముల కాలంలో ఈ ప్రజల పేర్లన్నీ గాదు వంశ చరిత్రలో వ్రాయబడినాయి. యోతాము యూదాకు రాజు. యరోబాము ఇశ్రాయేలు రాజు.
యుద్ధ నైపుణ్యంగల కొందరు సైనికులు
18 మనష్షే వంశంలో సగం మందిలోను, రూబేను, గాదు వంశాలలోను మొత్తం నలుబది నాలుగువేల ఏడు వందల అరవై మంది యుద్ధ వీరులున్నారు. వారు డాళ్లను, కత్తులను చేపట్టగలవారు. వారు బాణవిద్యలో నేర్పరులు. చాకచక్యంతో యుద్ధం చేయగలవారు. 19 వారు హగ్రీయులతోను, యేతూరు, నాపీషు, నోదాబు వారితోను యుద్ధం చేశారు. 20 మనష్షే వంశం వారు, రూబేను, గాదు వంశాల ప్రజలు యుద్ధంలో దేవుని సహాయం అర్థించి ప్రార్థన చేశారు. వారు దేవునియందు విశ్వాసమున్న వారు గనుక తమకు సహాయపడమని దేవుని అర్థించారు. కావున దేవుడు వారి ప్రార్థన ఆలకించి సహాయపడ్డాడు. హగ్రీయులను యుద్ధంలో ఓడించటానికి దేవుడు వారికి సహాయం చేసాడు. హగ్రీయులతో వున్న ఇతరులను కూడ వారు ఓడించారు. 21 హగ్రీయులకు చెందిన పశు సంపదనంతా వారు వశపర్చుకున్నారు. వారు ఏబై వేల ఒంటెలను, రెండు లక్షల ఏబైవేల గొర్రెలను, రెండువేల గాడిదలను, మరియు ఒక లక్ష మంది మనుష్యులను పట్టుకున్నారు. 22 యద్ధంలో రూబేనీయులకు దేవుని సహాయం ఉన్న కారణంగా హగ్రీయులలో చాలామంది చనిపోయారు. అప్పుడు మనష్షే, రూబేను, గాదు వంశీయులు హగ్రీయుల రాజ్యంలో నివసించసాగారు. వారక్కడ బబులోను (బాబిలోనియా) సైన్యం ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా బబలోనుకు పట్టుకుపోయే సమయం వరకు నివసించారు.
23 మనష్షే వంశం వారిలో సగంమంది బాషాను ప్రాంతంలో బెల్‌హెర్మోను వరకు, శెనీరు, హెర్మోను పర్వతం వరకు నివసించారు. వారి ప్రజలు అధిక సంఖ్యలో విస్తరించారు.
24 మనష్షే కుటుంబంలో ఒక సగంమంది కుటుంబ పెద్దలు ఎవరనగా ఏషెరు, ఇషీ, ఎలీయేలు, అజీ్రయేలు, యిర్మీయా, హోదవ్యా మరియు యహదీయేలు. వీరంతా బలపరాక్రమ సంపన్నులు, ప్రసిద్ధి గాంచిన వ్యక్తులు. వారి వారి కుటుంబాలకు వారు పెద్దలు. 25 కాని, వారి పూర్వీకులు ఆరాధించిన దేవుని పట్ల వారు పాపం చేశారు. వారు స్థిరపడినచోట వున్న విగ్రహాలనే వారు ఆరాధించటం మొదలు పెట్టారు. అటువంటి వాళ్లను దేవుడు నాశనము చేసియుండెను.
26 ఇశ్రాయేలు దేవుడు పూలును యుద్ధానికి పురిగొల్పాడు. పూలు అష్షూరు (అస్సీరియా) రాజు. అతనినే తిగ్లత్పిలేసెరు అని కూడ పిలుస్తారు. అతడు మనష్షే, రూబేను, గాదు వంశీయులతో యుద్ధం చేసాడు. వారిని తమ ఇండ్లు వదిలి వేసేలా బలవంతం చేసి బందీలుగా పట్టుకున్నాడు. తరువాత వారిని హాలహు, హాబోరు, హారా పట్టణాలకు, గోజాను నదీ తీరానికి తీసుకొని వెళ్లాడు. అప్పటినుండి ఈనాటికీ ఆ ఇశ్రాయేలీయుల కుటుంబాల వారు అక్కడ నివసిస్తున్నారు.