ఆలయం నిర్మాణానికి దావీదు యోచన
28
1 దావీదు ఇశ్రాయేలు పెద్దలందరినీ సమావేశపర్చాడు. వారందరనీ యెరూషలేముకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన పిలిచిన పెద్దలు ఎవరనగా: వంశాల పెద్దలు, రాజ సేవలో వున్న సైనికాధికారులు, వేయిమంది సైనికులకు అధిపతులు, వందమంది గల దళాలకు అధిపతులు, రాజు యొక్క, రాజకుమారుల యొక్క ఆస్తులను, పశువులను కాపాడే అధికారులు, రాజు యొక్క ముఖ్యాధికారులు, పరాక్రమశాలురు మరియు వీర సైనికులు.
2 రాజైన దావీదు నిలబడి వారినుద్దేశించి ఇలా చెప్పాడు: “సోదరులారా, నా ప్రజలారా, మీరంతా నేను చేప్పేది వినండి. యోహోవా ఒడంబడిక పెట్టెను ఉంచటానికి ఒక ఆలయాన్ని కట్టటానికి నేను నా హృదయంలో సంకల్పించాను దేవుని పాదం మోపటానికి ఒక స్థానం నిర్మించాలని నేను అనుకున్నాను. ఆలయ నిర్మాణానికి నేను ఒక పథకం కూడ తయారుచేశాను.
3 కాని దేవుడు నాతో ఇలా అన్నాడు: ‘దావీదూ’ వద్దు. నా పేరు మీద నీవు ఆలయం కట్టించకూడదు. నీవు సైనికుడవై, అనేకమందిని సంహరించావు. అందువల్ల నీవు ఆలయ నిర్మాణం చేయకూడదు.”
4 “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇశ్రాయేలు పన్నెండు వంశాల వారిని నడిపించటానికి యూదా వంశాన్ని ఎంపిక చేశాడు. మళ్లీ ఆ వంశంలో నుండి నా తండ్రి కుటుంబాన్ని యోహోవా ఎంపిక చేశాడు. ఆ కుటుంబంలో నుండి ఇశ్రాయేలును శాశ్వతంగా ఏలటానికి యెహోవా నన్ను ఎంపికచేశాడు! దేవుడు నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయదలచాడు!
5 యెహోవా నాకు చాలా మంది కుమారులను ఇచ్చాడు. వారందరిలో ఇశ్రాయేలుకు నూతన రాజుగా సొలొమోనును మాత్రం యెహోవా ఎంపిక చేసాడు. నిజానికి ఇశ్రాయేలు యెహోవా రాజ్యం.
6 యెహోవా నాతో, ‘దావీదూ, నీ కుమారుడు సొలొమోను నా ఆలయాన్ని, దాని ప్రాంగణాన్ని నిర్మిస్తాడు. ఎందువల్లననగా సొలొమోనును నా కుమారునిగా భావించాను. నేను అతనికి తండ్రిగా వ్యవహరిస్తాను.
7 సొలొమోను ఇప్పుడు నా ధర్మాన్ని, ఆజ్ఞలను పాటిస్తున్నాడు. అతడు నా ధర్మాన్ని, న్యాయాన్ని నిరంతరం పాటిస్తే నేను సొలొమోను రాజ్యాన్ని శాశ్వతంగా బలవంతమైనదిగా చేస్తాను!’” అని అన్నాడు.
8 “ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందు, దేవుని సమక్షాన నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. యెహోవా దేవుని శాసనాలన్నిటినీ మీరు పాటించేలా జాగ్రత్త పడండి! అప్పుడు ఈ మంచి దేశాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. పైగా దీనిని మీరు, మీ తర్వాత మీ సంతతి వారికి కూడ శాశ్వతంగా అందజేయగలరు.
9 “కుమారుడా, సొలొమోనూ! నీ తండ్రి యొక్క దేవుని నీవు తెలుసుకో. పవిత్ర హృదయంతో దేవుని ప్రార్థించు. దేవుని సేవించటానికి హృదయానందం కలిగివుండు. ఎందువల్లననగా, ప్రతివాని మనస్సులో ఏమున్నదో దేవునికి తెలుసు. నీవు ఆలోచించే ప్రతిదీ యెహోవా అర్థం చేసుకుంటాడు! సహాయం కోరి యెహోవాను అర్థిస్తే, నీకు సమాధానం దోరుకుతుంది. నీవు దేవునికి విముఖంగా వుంటే ఆయన నిన్ను శాశ్వతంగా వదిలివేస్తాడు.
10 సొలొమోనూ, తన పవిత్ర స్థలమైన ఆలయాన్ని నిర్మించటానికి యెహోవా నిన్ను ఎంపిక చేశాడని నీవు అర్ధం చేసుకోవాలి. ధైర్యంగా వుండి కార్యం నెరవేర్చు.”
11 పిమ్మట దావీదు ఆలయ నిర్మాణానికి సిద్ధం చేసిన సమూనా పత్రాలను తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చాడు. ఆ పత్రాలలో ఆలయం చుట్టూ నిర్మింప తలపెట్టిన ఆవరణ, మండపాలు, వస్తువులను భద్రపరచు గదులకు పైగదులు, లోపలి గదులు మరియు పాపపరిహారం ప్రాయశ్చిత్తం చేయు స్థానం మొదలగు వాటి నమూనాలు కూడ ఇమిడి వున్నాయి.
12 ఆలయపు అన్ని విభాగాలకూ దావీదు నమూనాలు గీయించాడు. దావీదు ఆ నమూనాలను సొలొమోనుకు ఇచ్చాడు. ఆలయం చుట్టూ ప్రాంగణానికి, ఇతర గదులకు, వస్తువులను భద్రపరచు గదులకు, పవిత్ర వస్తువులను వుంచే కొట్లకు గీచిన నమూనాలను కూడ దావీదు అతనికి ఇచ్చాడు.
13 దావీదు సొలొమోనుకు యాజకులలోను, లేవీయులలోను గల వర్గీకరణలను గూర్చి తెలియ జెప్పాడు. ఆలయపు సేవాకార్యక్రమ వివరాలు, ఆలయంలో వినియోగించే వస్తుసామగ్రి విషయాల గూర్చి దావీదు సొలొమోనుకు వివరించాడు.
14 ఆలయంలో ఉపయోగించే వస్తు సామగ్రి చేయటానికి ప్రతి దానికీ ఎంతెంత వెండి బంగారాలు వినియోగించాలో దావీదు సొలొమోనుకు చెప్పాడు.
15 బంగారు దీపాలకు, వెండి దీపాలకు, దీప స్తంభాలకు విడివిడిగా కొలతలు, నమూనాలు వున్నాయి. ఒక్కొక్క దీప స్తంభానికి, దాని దీపాలకు ఉపయోగించే బంగారం లేక వెండి పరిమాణాన్ని దావీదు సొలొమోనుకు తెలియజేశాడు. అవసరమైన చోట వివిధ దీపస్తంభాలు నెలకొల్పవచ్చు.
16 నైవేద్యంగా పవిత్ర రొట్టెను దేవుని ముందు పెట్టటానికి పనికివచ్చే ప్రతి బల్లకు ఎంత బంగారం వాడాలో దావీదు చెప్పాడు. వెండి బల్లలకు కావలసిన వెండి పరిమాణం కూడా దావీదు చెప్పాడు.
17 శూలాలకు, నీరు చిలికే పాత్రలకు, మూతి వెడల్పు చెంబులకు ఎంతెంత శుద్ధ బంగారం కావాలో దావీదు వివరించాడు. ప్రతి బంగారు పాత్రకు, ప్రతి వెండి పాత్రకు ఎంతెంత బంగారం కావాలో దావీదు చెప్పాడు.
18 ధూప పీఠానికి కావలసిన శుద్ధ బంగారం విషయం దావీదు చెప్పాడు. దేవుని రథమైన రెక్కలుచాపి ఒడంబడిక పెట్టెను కప్పివుండే కెరూబుల నమూనాను కూడా దావీదు సొలొమోనుకు ఇచ్చాడు. ఇదే ధర్మ పీఠం. కెరూబు దూతల ప్రతిమలు బంగారంతో చేయబడ్డాయి.
19 “యెహోవా నాకు సూచించిన మేరకు ఈ నమూనాలన్నీ వ్రాయబడ్డాయి. నమూనాలలో ప్రతి విషయాన్నీ నేను అర్థం చేసుకొనేలా యెహోవా నాకు సహాయపడ్డాడు” అని దావీదు చెప్పాడు.
20 దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా ఇలా అన్నాడు: “నీవు ధైర్యంగా, నిలకడగా వుండు. పని మొదలు పెట్టు. నీవు భయపడవద్దు. ఎందు వల్లననగా నీ దేవుడైన యెహోవా నీతో వున్నాడు. పనంతా పూర్తయ్యే వరకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీవు యెహోవా ఆలయం నిర్మిస్తావు.
21 ఆలయ నిర్మాణ కార్యక్రమంలో యాజకులు, లేవీయులు తమ తమ విధులు నిర్వహించటానికి సిద్ధంగా వున్నారు. నైపుణ్యంగల పనివారంతా నీకు సహాయం చేయటానికి సిద్ధంగా వున్నారు. నీవు ఇచ్చే ప్రతి ఆజ్ఞ అధికారులు, ప్రజలు అంతా శిరసావహిస్తారు.”