ఒడంబడిక పెట్టె యెరూషలేముకు తేబడుట
15
దావీదు నగరంలో తన కొరకు దావీదు ఇండ్లు కట్టుకున్నాడు. తరువాత ఒడంబడిక పెట్టెను పెట్టటానికి అతడొక ప్రదేశాన్ని సిద్ధం చేశాడు. అతడక్కడ ఒక గుడారం దాని కొరకు నిర్మించాడు. “ఒడంబడిక పెట్టెను మోయటానికి కేవలం లేవీయులు మాత్రమే అనుమతించబడ్డారు. ఒడంబడిక పెట్టెను మోయటానికి, ఆయనను అర్పించటానికి యెహోవా లేవీయులను శాశ్వతంగా ఎంపిక చేశాడు” అని దావీదు చెప్పాడు.
తాను ఏర్పాటు చేసిన స్థలానికి ఒడంబడిక పెట్టెను తేవటానికి యెరూషలేము ప్రజలందరినీ దావీదు సమావేశపర్చాడు. అహరోను సంతతి వారిని, లేవీయులను దావీదు పిలిపించాడు.
కహాతు సంతతివారు నూట ఇరవై మంది వున్నారు. వారి నాయకుని పేరు ఊరియేలు.
మెరారి వంశీయులు రెండు వందల ఇరవై మంది వున్నారు. అశాయా వారికి పెద్ద.
గెర్షోను కుటుంబం వారు నూటముప్పది మంది వున్నారు. యోవేలు వారి అధిపతి.
ఎలీషాపాను సంతతివారు రెండువందల మంది. షెమయా వారి నాయకుడు.
హెబ్రోను సంతతివారు ఎనుబది మంది. ఎలీయేలు వారి నాయకుడు.
10 ఉజ్జీయేలు కుటుంబం వారు నూట పన్నెండు మంది. అమ్మీనాదాబు వారి పెద్ద.
దావీదు యాజకులతో, లేవీయులతో సంప్రదించటం
11 యాజకులైన సాదోకును, అబ్యాతారును తన వద్దకు రమ్మని దావీదు కబురు పంపాడు. మరియు లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనువారిని కూడ దావీదు తన వద్దకు రమ్మని కబురు పంపాడు. 12 దావీదు వారితో ఇలా అన్నాడు: “మీరంతా లేవి సంతతి వారికి నాయకులు. మీరు, మీతోటి వారైన ఇతర లేవీయులు పవిత్రంగా వుండి, ఒడంబడిక పెట్టెను నేను ఏర్పాటు చేసిన స్థలానికి తీసుకొనిరండి. 13 కిందటి సారి ఒడంబడిక పెట్టెను ఎలా తీసుకొని రావాలి అనే విషయం మనం యెహోవాను అడుగలేదు. లేవీయులైన మీరు ఒడంబడిక పెట్టెను మోయలేదు. అందువల్ల యెహోవా మనల్ని శిక్షించాడు.”
14 పిమ్మట ఇశ్రాయేలు దేవుని ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి యాజకులు, లేవీయులు శుద్ధియైనారు. 15 ఒడంబడిక పెట్టెను మోషే ఆజ్ఞాపించిన విధంగా వారి భుజాలపై మోయటానికి లేవీయులు ప్రత్యేకమైన కర్రలను వినియోగించారు. యెహోవా సెలవిచ్చిన ప్రకారమే వారు ఆ ఒడంబడిక పెట్టెను మోసారు.
గాయకులు
16 వారి సోదరులైన గాయకులను తీసుకొని రమ్మని దావీదు లేవీయులతో చెప్పాడు. గాయకులంతా వీణలు, తంబూరాలు, సితారలు, తాళాలు వాయిస్తూ ఆనందంతో హాయిగా పాడాలి.
17 అప్పుడు లేవీయులు హేమానును, అతని సోదరులను, ఆసాపును, ఏతానును తీసుకొని వచ్చారు. హేమాను తండ్రి పేరు యోవేలు. ఆసాపు తండ్రి పేరు బెరెక్యా. ఏతాను తండ్రి పేరు కూషాయాహు. వీరంతా మెరారి సంతతివారు. 18 లేవీయులో రెండవ వర్గం వారు కూడ వున్నారు. వారు జెకర్యా, యహాజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు. వీరంతా లేవీయులకు చెందిన ద్వారపాలకులు.
19 గాయకులైన హేమాను, ఆసాపు, ఏతాను కంచు తాళాలు వాయించేందుకు నియమితులయ్యారు. 20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా హెచ్చు స్థాయి వీణలు వాయించాలి. 21 మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు మరియు అజజ్యాహు తగ్గుస్థాయి వీణలు వాయించటానికి నియమింప బడ్డారు. శాశ్వతంగా అది వారిపని. 22 లేవీయుల నాయకుడు కెనన్యా సంగీత కార్యక్రమ నిర్వాహకుడు. కెనన్యా ఈ కార్యక్రమం నిర్వహించటానికి కారణం అతడు ప్రసిద్ధ గాయకుడు కావటమే.
23 ఒడంబడిక పెట్టెకు కాపలాదారులుగా నియమితులైన వారిలో బెరెక్యా, ఎల్కానా వున్నారు. 24 యాజకులైన షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా మరియు ఎలీయెజెరు ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదారు. ఓబేదెదోము, యెహీయాలిరువురూ కూడ ఒడంబడిక మందసానికి కాపలాదార్లు.
25 దావీదు, ఇశ్రాయేలు పెద్దలు, వెయ్యిమంది సైనికులు గల దళాలకు నాయకులు ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి వెళ్లారు. వారు దానిని ఓబేదెదోము ఇంటినుండి బయటకు తెచ్చినప్పుడు చాలా ఆనందంగా వున్నారు. 26 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులకు దేవుడు సహాయపడ్డాడు. వారు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను బలియిచ్చారు. 27 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులంతా సన్నని నారబట్టలు ధరించారు. భజన సంకీర్తన నిర్వాహకుడుగా వున్న కెనన్యా, ఇతర గాయకులు సన్నని నారబట్టలు ధరించారు. దావీదు కూడ సన్నని నారబట్టలు ధరించాడు. సన్నని నారతో నేసిన ఏఫోదు అనబడే ఒక అంగీని కూడా దావీదు ధరించాడు.
28 ఇశ్రాయేలు ప్రజలు జయజయ ధ్వనులు చేస్తూ, పొట్టేలు కొమ్మలు, బాకాలు వూదుతూ, వీణలు, స్వరమండలాలు, తాళాలు వాయిస్తూ ఒడంబడిక పెట్టెను తీసుకొని వచ్చారు.
29 దేవుని ఒడంబడిక పెట్టె దావీదు నగరం చేరినప్పుడు మీకాలు కిటికీ గుండా చూసింది. మీకాలు సౌలు కుమార్తె. రాజైన దావీదు చిందులేస్తూ పాటలు పాడటం ఆమె చూసింది. అతనినొక మూర్ఖునిగా భావించడంతో దావీదు పట్ల ఆమెకున్న గౌరవం పోయింది.