64
సంగీత నాయకునికి. దావీదు కీర్తన.
దేవా, నా ప్రార్థన ఆలకించుము.
నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము.
నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము.
ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు.
వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.
వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీ పరుని మీద వేస్తారు.
అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడ్డాడు.
అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు.
“వారు వారి ఉరులను పెడతారు.” వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని వారనుకొంటారు.
మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు.
మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతోకష్టం.
కాని దేవుడు తన “బాణాలను”వారిమీద వేయగలడు.
అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు.
కానీ దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు.
ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు.
అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు.
దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు.
వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు.
అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు.
ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు.
10 మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి.
వారు ఆయన్ని నమ్ముకోవాలి.
మంచి మనుష్యులారా మీరంతా యెహోవాను స్తుతించండి.