బుద్ధిహీనులను గూర్చిన జ్ఞాన సూక్తులు
26
తెలివి తక్కువ వానిని గౌరవించటం వ్యర్థం. అది వేసవిలో మంచులా, కోతకాలంలో వర్షంలా ఉంటుంది.
నీకు చెడు సంగతులు సంభవించాలని ఒక మనిషి కోరుకొంటే చింతపడవద్దు. నీవు తప్పు ఏమీ చేయక పోతే నీకేమీ చెడు సంభవించదు. ఆ మనిషి మాటలు నీ పక్కగా ఎగురుతూ, ఎన్నడూ ఆగని పక్షుల్లా ఉంటాయి.
గుర్రాన్ని చబుకుతో కొట్టాలి. గాడిదకు కళ్లెం పెట్టాలి. బుద్ధిహీనుణ్ణి బెత్తంతో కొట్టాలి.
ఇక్కడ ఒక కష్టతరమైన పరిస్థితి ఉంది. ఒక బుద్ధి హీనుడు ఒక మూర్ఖ ప్రశ్న నిన్ను అడిగితే, నీవు మూర్ఖ జవాబు ఇవ్వవద్దు, అలా ఇస్తే నీవుకూడ బుద్ధిహీనునిలా కనబడతావు. కానీ ఒక బుద్ధిహీనుడు ఒక మూర్ఖ ప్రశ్న అడిగితే, అప్పుడు నీవు తగిన మూర్ఖపు జవాబు ఇవ్వాలి, లేకపోతే అతడు తాను చాలా తేలివిగలవాడిని అనుకొంటాడు.
తెలివి తక్కువ వాణ్ణి ఎన్నడూ నీ సందేశం తీసికొని వెళ్లనివ్వకు. నీవు అలా చేస్తే, నీ స్వంత కాళ్లు కోసి కొన్నట్టు ఉంటుంది. నీవు కష్టం అడిగి తెచ్చుకొంటావు.
బుద్ధిహీనుడు జ్ఞానముగలది చెప్పటానికి ప్రయత్నించినప్పుడు, అది ఒక కుంటివాడు నడవటానికి ప్రయత్నించిట్టు ఉంటుంది.
బుద్ధిహీనునికి గౌరవం చూపించటం వడిసెలలో బండను కట్టడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.
ఒక బుద్ధిహీనుడు జ్ఞానముగల మాట చెప్పటానికి ప్రయత్నిస్తే, అది ఒక తాగుబోతువాడు తన చేతిలోని ముల్లు తీసికోవటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.
10 ఒక బుద్ధిహీనుణ్ణి లేక దారిన పోయే వాళ్లను ఎవరినంటే వారిని కూలికి పెట్టుకోవటం ప్రమాదకరం. ఎవరికి హాని జరుగుతుందో నీకు తెలియదు.
11 ఒక కుక్క ఆహారం తింటుంది. తరువాత దానికి జబ్బుచేసి, వాంతి చేసికొంటుంది. తర్వాత ఆ కుక్క ఆ ఆహారాన్ని మళ్లీ తింటుంది. ఒక బుద్ధిహీనుని విషయం కూడ అలానే ఉంటుంది. అతడు బుద్ధిహీనమైన అదే పనిని మరల మరల చేస్తాడు.
12 ఒక మనిషి జ్ఞానము లేకుండానే జ్ఞానిని అని తలిస్తే అతడు బుద్ధిహీనునికంటె దౌర్భాగ్యుడు.
13 “నేను ఇల్లు విడిచి వెళ్లలేను. వీధిలో సింహంఉంది” అంటాడు ఒక సోమరి.
14 ఒక సోమరి ఒక తలుపులాంటివాడు. ఒక తలుపు దాని బందుల మీద తిరిగినట్టు తన పడక మీద అటు ఇటు తిరగటమే అతడు చేసేది అంతాను. అతడు ఎన్నడూ ఎక్కడికి వెళ్లడు.
15 ఒక సోమరి మనిషి తన పళ్లెంలో నుండి తన భోజనాన్ని తన నోటి వరకు గూడ ఎత్తని మరీ బద్ధకస్తుడు.
16 ఒక సోమరి మనిషి తాను చాలా జ్ఞానము గలవాడను అనుకుంటాడు. వారి తలంపులకు మంచి కారణాలు ఇవ్వగలిగిన ఏడుగురు మనుష్యులకంటే తాను చాలా ఎక్కువ తెలివిగల వాడనని అతడు తలస్తాడు.
17 ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంలో పాల్గొనడం ప్రమాదకరం. అది దారిన పోతూ ఒక కుక్క చెవులు పట్టి లాగినట్టు ఉంటుంది.
18-19 మరో మనిషిని మాయచేసి, ఊరకనే సరదాగా అలా చేసాను అనేవాడు, అగ్ని బాణాలు గాలిలోకి కొట్టి, ప్రమాదవశాత్తు ఎవరినో చంపిన పిచ్చివాడిలా ఉంటాడు.
20 మంటకు కట్టెలు లేకపోతే మంట చల్లారి పోతుంది. అదే విధంగా చెప్పుడు మాటలు లేకపోతే వివాదం సమసిపోతుంది.
21 బొగ్గలు బూడిదను మండింపచేస్తూ ఉంటాయి. కట్టెలు మంటను మండిస్తూ ఉంటాయి. అదే విధంగా చిక్కులు పెట్టే మనుష్యులు వివాదాన్ని బతకనిస్తారు.
22 మనుష్యులు చెప్పుడు మాటలను ప్రేమిస్తారు. అది మంచి ఆహారాన్ని భోంచేసినట్టు ఉంటుంది.
23 ఒక దుర్మార్గపు పథకాన్ని దాచిపెట్టే మంచి మాటలు ఒక చవకబారు మట్టి కుండ మీద వెండి పూతలా ఉంటాయి. 24 ఒక దుర్మార్గుడు తాను చెప్పే విషయాల ద్వారా తాను మంచివానిలా చూపెట్టు కుంటాడు. కాని అతడు తన దుర్మార్గపు పథకాలను తన హృదయంలో దాచి పెడతాడు. 25 అతడు చెప్పే విషయాలు మంచివిగా కనబడవచ్చు. కాని అతణ్ణి నమ్మవద్దు. అతని హృదయం దురాలోచనలతో నిండిపోయింది. 26 అతడు తన దుర్మార్గపు పథకాలను చక్కని మాటలతో దాచిపెడతాడు. కాని అతడు నీచుడు. చివరికి అతడు చేసే దుర్మార్గవు విషయాలను మనుష్యులందరు చూస్తారు.
27 ఒక మనిషి ఇతరులను ఇక్కట్టులో పెట్టాలని ప్రయత్నించి, గొయ్యి తవ్వితే అతడు తానే ఆ గోతిలో పడతాడు. మరో మనిషి మీదకు ఒక బండను దొర్లించాలని ప్రయత్నిస్తే అతడు తనను తానే చితుక గొట్టుకుంటాడు.
28 అబద్ధాలు చెప్పే మనిషి తనకు భోధించే వారిని ద్వేషిస్తాడు. మరియు ఒక మనిషి చెప్పే విషయాలు అర్థవంతంగా చెప్పకపోతే అతడు తనను తానే బాధించుకొంటాడు.