16
1 మనుష్యులు తమ ఆలోచనలు చేస్తారు. అయితే ఆ విషయాలు జరిగేటట్టుగా చేసేవాడు యెహోవాయే.
2 ఒకడు తాను చేసేది అంతా సరిగ్గా ఉంది అనుకొంటాడు. అయితే మనుష్యులు చేసే వాటికిగల అసలైన కారణాలు ఏమిటో యెహోవా తీర్పు చెబుతాడు.
3 నీవు చేసే ప్రతీదానిలో సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగు, నీవు జయంపొందుతావు.
4 ప్రతీదానికీ యెహోవా ఏర్పాటు ఒకటి ఉంది. యెహోవా ఏర్పాటులో దుర్మార్గులు నాశనం చేయబడతారు.
5 ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే ప్రతి మనిష యెహోవాకు అసహ్యుడు. ఆ గర్విష్ఠుల నందరినీ యెహోవా తప్పక నాశనం చేస్తాడు.
6 నిజమైన ప్రేమ, నమ్మకం నిన్ను పవిత్రం చేస్తాయి. యెహోవాను గౌరవించు, నీవు దుర్మార్గానికి దూరంగా ఉంటావు.
7 ఒక వ్యక్తి యెహోవాను సంతోషపెట్టే విధంగా మంచి జీవితం జీవిస్తూంటే అప్పుడు అతని శత్రువులు కూడా అతనితో సమాధానంగా ఉంటారు.
8 మోసం చేసి విస్తారంగా సంపాదించుటకంటే, సరైన విధంగా కొంచెం మాత్రమే సంపాదించుట మేలు.
9 ఒక మనిషి తాను చేయాలనుకొనే వాటి విషయంలో పథకాలు వేయవచ్చు. అయితే ఏమి జరుగు తుంది అనేది నిర్ణయించే వాడు యెహోవా.
10 ఒక రాజు మాట్లాడితే, అతని మాటలు చట్టం అవుతాయి. అతని నిర్ణయాలు ఎల్లప్పుడూ న్యాయంగా ఉండాలి.
11 త్రాసులు, తూనిక రాళ్లు అన్నీ నిజాయితీగా ఉండాలని యెహోవా కోరుతాడు, వ్యాపార ఒప్పందాలన్నీ న్యాయంగా ఉండాలని ఆయన కోరుతాడు.
12 కీడు చేసే మనుష్యులను రాజులు అసహ్యించుకొంటారు. మంచితనం అతని రాజ్యాన్ని మరింత బలమైనదిగా చేస్తుంది.
13 రాజులు సత్యం వినాలని కోరుతారు. అబద్ధాలు చేప్పని ప్రజలు రాజులకు ఇష్టం.
14 రాజుకు కోపం వస్తే, అతడు ఎవరినైనా చంపవచ్చును. జ్ఞానముగలవాడు రాజును సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు.
15 రాజు సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీ విషయమై రాజు సంతోషిస్తే, అది మేఘం నుండి కురిసిన వర్షపు ఊటలా ఉంటుంది.
16 జ్ఞానము బంగారంకంటె చాలా ఎక్కువ విలువగలది. అవగాహన వెండికంటె చాలా ఎక్కువ విలువగలది.
17 మంచి మనుష్యులు దుర్మార్గానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ తమ జీవితాలు జీవిస్తారు. తన జీవితం కాపాడుకొనేవాడు తన ఆత్మను భద్రము చేసుకొంటున్నాడు.
18 ఒక వ్యక్తి గనుక గర్వంగా ఉంటే, అప్పుడు అతడు నాశనకరమైన అపాయంలో ఉన్నాడు. ఒక మనిషి ఇతరులకంటె తానే మంచివాడినని అనుకొంటే అతడు ఓడిపోయే ప్రమాదంలో ఉన్నాడు.
19 ఇతరులకంటె గొప్పవాళ్లం అనుకొనే వాళ్లతో ఐశ్వర్యాలు పంచుకోవటంకంటె, దీనులైన, పేదవాళ్లతో కలిసి జీవించటం మేలు.
20 మనుష్యులు తనకు నేర్పించుటకు ప్రయత్నించినప్పుడు, వినే వ్యక్తి లాభం పొందుతాడు. యెహోవాను నమ్ముకొనేవాడు ఆశీర్వదించబడుతాడు.
21 ఒకవేళ ఒక మనిషి జ్ఞానముగల వాడైతే అది ప్రజలు తెలుసుకొంటారు. జాగ్రత్తగా ఎంచుకొని మాటలు మాట్లాడే మనిషి, చాలా ఒప్పించదగినవాడుగా ఉంటాడు.
22 జ్ఞానముగల వారికి అది నిజమైన జీవాన్ని తెచ్చిపెడుతుంది. కానీ బుద్ధిహీనులు మరింత బుద్ధిహీనంగా ఉండటమే నేర్చుకొంటారు.
23 జ్ఞానముగల మనిషి మాట్లాడక ముదు ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. అతడు చెప్పే మాటలు మంచివి, వినదగినవి.
24 దయగల మాటలు తేనెలా ఉంటాయి. వాటిని అంగీకరించటం సులభం, అవి నీ ఆరోగ్యానికి మంచివి.
25 మనుష్యుల దృష్టికి సరైనదిగా కనుపించే మార్గం ఒకటి ఉంది. కానీ ఆ మార్గం మరణానికి మాత్రమే నడిపిస్తుంది.
26 పనివాని ఆకలి అతణ్ణి పని చేయిస్తూనే ఉంటుంది. అతడు భోజనం చేయగలిగేటట్టు, అతని ఆకలి అతణ్ణి పని చేయిస్తుంది.
27 పనికిమాలిన మనిషి చెడు పనులు చేయాలని పథకం వేస్తాడు. అతని సలహా నిప్పులా నాశనం చేస్తుంది.
28 చిక్కులు పేట్టేవారు ఎల్లప్పుడూ సమస్యలు పుట్టిస్తూంటారు. చెప్పుడు మాటలు వ్యాపింపజేసేవాడు సన్నిహితులైన మిత్రుల మధ్య చిక్కు కలిగిస్తాడు.
29 త్వరగా కోపం వచ్చే మనిషి తన స్నేహితులకు చిక్కు తెచ్చిపెడ్తాడు. మంచిది కాని మార్గంలో అతడు వారిని నడిపిస్తాడు.
30 కన్నుగీటి, చిరునవ్వునవ్వేవాడు ఏదో అక్రమం, కీడు తలపెడ్తున్నాడు.
31 నెరసిన తల వెంట్రుకలు, మంచి జీవితాలు జీవించిన వారికి మహిమ కిరీటం.
32 బలమైన ఒక సైనికునిగా ఉండటంకంటే సహనం గలిగి ఉండటం మంచిది, ఒక పట్టణం అంతటిని స్వాధీనం చేసికోవటంకంటే, నీ కోపాన్ని స్వాధీనం చేసికోవటం మేలు.
33 నిర్ణయాలు చేయటానికి మనుష్యులు చీట్లు వేస్తారు. కానీ నిర్ణయాలు ఎల్లప్పుడూ దేవుని దగ్గర్నుండి వస్తాయి.