12
ఒక మనిషి జ్ఞానము కలిగి ఉండాలి అనుకొంటే, అతడు తప్పు చేసినప్పుడు దానిని ఎవరైనా అతనికి చెప్పగా అతనికి కోపంరాదు. తాను చేసింది తప్పు అని ఎవరైనా తనకు చెప్పటం ఇష్టంలేని మనిషి మూర్ఖుడు.
మంచి మనిషి విషయం యెహోవా సంతోషిస్తాడు. కాని దుర్మార్గుని దోషిగా యెహోవా తీర్చు చెబుతాడు.
దుర్మార్గపు మనిషి ఎన్నడూ క్షేమంగా ఉండడు. అయితే మంచి మనుష్యులు సురక్షితంగా ఉండగలరు.
మంచి భార్య విషయమై భర్త సంతోషించి అతిశయిస్తాడు. కాని ఒక స్త్రీ తన భర్తను అవమానిస్తే, అప్పుడు ఆమె అతని శరీరంలో ఒక వ్యాధిలా ఉంటుంది.
మంచి మనుష్యులు తాము చేయాలని తలపెట్టే విషయాల్లో నిజాయితీగా, న్యాయంగా ఉంటారు. కాని దుర్మార్గుడు నీతో చెప్పే విషయాలను నమ్మవద్దు.
దుర్మార్గుల మాటలు రక్తంకోసం పొంచి వుంటాయి. కాని మంచి మనుష్యుల మాటలు వారిని అపాయం నుండి తప్పిస్తాయి.
దుర్మార్గులు నాశనం చేయబడగా ఇంకేమీ మిగులదు. అయితే మంచి మనుష్యులు వెళ్లిపోయిన తరువాత చాలా కాలం వరకు మనుష్యులు వారిని జ్ఞాపకం చేసికొంటారు.
జ్ఞానము గల మనిషిని ప్రజలు పొగుడుతారు. కాని మూర్ఖుడైన మనిషిని ప్రజలు గౌరవించరు.
భోజనం లేకపోయినా, ప్రముఖునిలా నటించే మనిషిలా ఉండటంకంటె, ప్రముఖుడు కాకపోయినా కష్టపడి పనిచేసే మనిషిలా ఉండటం మేలు.
10 మంచి మనిషి తన పశువుల విషయం శ్రద్ధ తీసుకొంటాడు. కానీ దుర్మార్గులు దయగా ఉండలేరు.
11 తన పొలంలో పనిచేసే రైతుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. కాని పనికిమాలిన ఆలోచనలతో సమయం వృధా చేసేవాడు బుద్ధిహీనుడు.
12 దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు పసులు చేయాలని చూస్తుంటారు. కానీ మంచివాళ్లకు చెట్ల వేర్లవలెలోతుకు చొ చ్చుకొనిపోయే బలం ఉంటుంది.
13 దుర్మార్గుడు తెలివి తక్కువ విషయాలు మాట్లాడి, తన మాటలచేత పట్టుబడతాడు. కానీ మంచి మనిషి అలాంటి కష్టం నుండి తప్పించుకొంటాడు.
14 ఒక వ్యక్తి తాను చెప్పే మంచి విషయాల మూలంగా బహుమానం పొందుతాడు. అదే విధంగా అతడు చేసే పనివల్ల అతనికి లాభం కలుగుతుంది.
15 బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ తన స్వంత విధానమే మంచిదని తలస్తాడు. కానీ జ్ఞానముగలవాడు ఇతరులు తనతో చెప్పే మాటలు వింటాడు.
16 బుద్ధిహీనుడు త్వరగా కలవరం చెందుతాడు. అయితే ఇతరులు ఏదైనా తప్పు చెప్పినప్పుడు తెలివిగలవాడు త్వరగా క్షమిస్తాడు.
17 ఒక వ్యక్తి సత్యం చెబితే, అతడు చెప్పే విషయాల్లో నిజాయితీ గలవాడే. కానీ ఒకడు అబద్ధాలు గనుక చెబితే, అది కష్టాలకు దారి తీస్తుంది.
18 ఒక వ్యక్తి ఆలోచన లేకుండా మాట్లాడితే, అప్పుడు ఆ మాటలు ఖడ్గంలా బాధించవచ్చు. అయితే జ్ఞానముగలవాడు అతడు చెప్పే విషయాల గూర్చి జాగ్రత్తగా ఉంటాడు. అతని మాటలు ఆ బాధను నయం చేయవచ్చును.
19 ఒక వ్యక్తి అబద్ధం చెబితే, ఆ మాటలు వేగంగా వ్యర్థం అవుతాయి. కానీ సత్యం శాశ్వతంగా జీవిస్తుంది.
20 దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టం కలిగించాలని కోరుకొంటారు. అయితే శాంతికోసం పని చేసేవారు సంతోషంగా ఉంటారు.
21 మంచి మనుష్యులు యెహోవా చేత క్షేమంగా కాపాడబడుతారు.కానీ చెడ్డవాళ్లకు చాలా కష్టాలు ఉంటాయి.
22 అబద్ధాలు చెప్పే వాళ్లంటే యెహోవాకు అసహ్యం. అయితే సత్యం చెప్పే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం.
23 చురుకైనవాడు తనకు తెలిసిన అన్నీ విషయాలూ చెప్పడు. కానీ బుద్ధిహీనుడు అన్నీ చెప్పి, తాను బుద్ధిహీనుడను అని చూపెట్టుకొంటాడు.
24 కష్టపడి పనిచేసే మనుష్యులు ఇతరుల మీద అధికారులుగా నియమించబడుతారు. అయితే సోమరి బానిసలా పనిచేయాల్సి ఉంటుంది.
25 చింతించటం ఒక మనిషి సంతోషాన్ని తీసివేయగలదు. కానీ దయగల ఒక మాట ఒక మనిషిని సంతోష పెట్టగలదు.
26 మంచివాడు తన చుట్టూవున్న వాళ్లకంటే ఎక్కువ పొందుతాడు. దుర్మార్గుల చెడు నడతలే వాళ్లను చెడు మార్గాలలో పెట్టి, విజయం నుండి తప్పిస్తాయి.
27 బద్ధకస్తుడు తాను కోరుకొనే వాటి వెనుక వెళ్లడు. కానీ కష్టపడి పనిచేసే వానికి ఐశ్వర్యాలు వస్తాయి.
28 నీవు సరైన విధంగా జీవిస్తే, అప్పుడు నీకు నిజమైన జీవం ఉంటుంది. అదే శాశ్వతంగా జీవించటానికి మార్గం.