హాయి నాశనమగుట
8
1 అప్పుడు యెహోవా యెహోషువతో చెప్పాడు: “భయపడకు. జడియకు. నీ యుద్ధ వీరులందరినీ హాయి మీదికి నడిపించు. హాయి రాజును ఓడిచేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతని ప్రజల్ని, అతని పట్టణాన్ని, అతని దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను.
2 నీవు యెరికోకు, దాని రాజుకు చేసినట్టే హాయికి, దాని రాజుకుగూడ చేస్తావు. ఈసారి మాత్రమే మీరు ఐశ్వర్యాలన్నీ తీసుకొని మీకోసం దాచుకోవచ్చు. ఆ ఐశ్వర్యాలను మీరు, మీ ప్రజలు పంచుకోండి. ఇప్పుడు మీ సైనికులు కొందర్ని పట్టణం వెనుక మాటు వేయమని చెప్పు.”
3 కనుక యెహోషువ తన సైన్యం అంతటినీ హాయివైపు నడిపించాడు. తర్వాత మంచి పరాక్రమంగల ముప్పయివేలమంది శూరులను యెహోషువ ఏర్పాటు చేసుకొన్నాడు. అతడు వీళ్లందరినీ రాత్రి పూట బయటకు పంపించాడు.
4 యెహోషువ వారికి ఇలా ఆజ్ఞాపించాడు: “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా వినండి. పట్టణం వెనుక ప్రాంతంలో మీరు దాక్కోవాలి. దాడి చేయాల్సిన సమయంకోసం కనిపెట్టి ఉండాలి. పట్టణానికి మరీ దూరంగా వెళ్లకండి. కనిపెడ్తూ, సిద్ధంగా ఉండండి.
5 నేను నాతో ఉన్న మనుష్యులను పట్టణం మీదికి నడిపిస్తాను. పట్టణంలోపలి మనుష్యలు మాతో యుద్ధం చేయటానికి బయటకు వస్తారు. మేము ఇదివ రకువలెనే, వెనుదిరిగి వారి దగ్గర్నుండి పారిపోతాం.
6 ఆ మనుష్యులు పట్టణం నుండి మమ్మల్ని తరుముతారు. ఇదివరకువలెనే మేము వాళ్ల ఎదుట నుండి పారిపోతున్నామని వారు అనుకొంటారు. కనుక మేము పారిపోతాము.
7 అప్పుడు మీరు దాగుకొన్న చోటు నుండి బయటకు వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. మీ యెహోవా దేవుడు మీరు గెలిచేందుకు మీకు శక్తి ఇస్తాడు.
8 “యెహోవా చెప్పినట్టే మీరు చేయాలి. నన్ను గమనించండి. దాడి చేసేందుకు నేను మీకు ఆజ్ఞఇస్తాను. మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత మీరు దాన్ని కాల్చివేయాలి.”
9 అప్పుడు యెహోషువ, వారు దాగుకొనే చోటుకు వారిని పంపించగా, బేతేలు, హాయికి మధ్యగల ఒకచోటికి వారు వెళ్లారు. ఇది హాయికి పశ్చిమాన ఉంది. ఆ రాత్రి యెహోషువ తన మనుష్యుల దగ్గరే ఉండిపోయాడు.
10 మరునాడు ఉదయాన్నే యోహోషువ పురుషులందరినీ సమావేశం చేసాడు. అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు నాయకులు అందరినీ హాయి మీదికి నడిపించారు.
11 యెహోషునతో ఉన్న సైనికులందరూ హాయి మీద దాడి చేశారు. ఆ పట్టణం ఎదుట వాళ్లు ఆగి పోయారు. పట్టణానికి ఉత్తరాన సైన్యం బసచేసింది. సైన్యానికినీ హాయికినీ మధ్య ఒక లోయఉంది.
12 అప్పుడు యెహోషువ ఐదువేల మంది పురుషులను ఏర్పరచుకొన్నాడు. పట్టణానికి పశ్చిమంగా, బేతేలుకు, హాయికి మధ్య ప్రాంతంలో దాగి ఉండమని యెహోషువ వారిని పంపించాడు.
13 కనుక యెహోషువ తన మనుష్యుల్ని యుద్ధానికి సిద్ధం చేసాడు. పట్టణానికి ఉత్తరాన ముఖ్యమైన బస ఉంది. మిగిలిన వాళ్లు పడమటివైపు దాగుకొన్నారు. ఆ రాత్రి యెహోషువ లోయలోనికి దిగి వెళ్లాడు.
14 తర్వాత హాయి రాజు ఇశ్రాయేలు సైన్యాన్ని చూసాడు. రాజు, అతని ప్రజలు లేచి, ఇశ్రాయేలు సైన్యంతో యుద్ధం చేసేందుకు త్వరపడ్డారు. హాయి రాజు పట్టణానికి తూర్పు దిశన బయటికి వెళ్లాడు. కనుక పట్టణం వెనుకవైపు సైనికులు దాగి ఉన్న విషయం అతనికి తెలియదు.
15 యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ హాయివారి చేత వెనుకకు నెట్టబడ్డారు. యెహోషువ, అతని మనుష్యులు ఎడారివైపు తూర్పు దిశగా పారిపోవటం మొదలుబెట్టారు.
16 పట్టణంలో ఉన్న ప్రజలు కేకలు వేస్తూ, యెహోషువను, అతని మనుష్యులను తరమటం మొదలుబెట్టారు. ప్రజలంతా పట్టణం వదలిపెట్టేసారు.
17 హాయి, బేతేలు ప్రజలు అంతా ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమారు. పట్టణం బాహాటంగా తెరచి ఉంది పట్టణాన్ని కాపాడేందుకు ఎవరూ అక్కడ ఉండి పోలేదు.
18 యెహోవా “నీ ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకో. ఆ పట్టణాన్ని నేను నీకు ఇస్తాను” అని యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ తన ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకొన్నాడు.
19 దాగుకొన్న ఇశ్రాయేలు మనుష్యులు ఇది చూసారు. వారు దాగుకొన్న చోటునుండి త్వరగా బయటకు వచ్చి, పట్టణంవైపు త్వరగా బయల్దేరారు. వారు పట్టణంలో ప్రవేశించి, దాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అప్పుడు సైనికులు ఆ పట్టణాన్ని కాల్చి వేసేందుకు మంటలు పెట్టడం మొదలుపెట్టారు.
20 హాయినుండి వచ్చిన మనుష్యులు వెనుకకు తిరిగి చూడగా వారి పట్టణం కాలిపోవటం కనుపించింది. పొగ ఆకాశానికి ఎక్కటం వారు చూసారు. కనుక వారి బలం, ధైర్యం క్షణించిపోయాయి. వారు ఇశ్రాయేలీయులను తర మటం మానివేసారు. ఇశ్రాయేలు మనుష్యులు పారిపోవటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యులతో పోరాటానికి దిగారు. హాయి మనుష్యులు పారిపోయేందుకు క్షేమకరమైన స్థలం ఏమీ లేకపోయింది.
21 యెహోషువ, అతని మనుష్యులు అందరూ, వారి సైన్యం ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటం చూసారు. ఆ పట్టణంనుండి పొగ లేవటంవారు చూసారు. అప్పటికే వారు పరుగెత్తటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల మీద పోరాటానికి పరుగెత్తారు.
22 అప్పుడు దాగు కొనియున్న మనుష్యలు పోరాటంలో సహాయం చేసేందుకు పట్టణంలో నుండి బయటకు వచ్చారు. హాయి మనుష్యులకు రెండువైపులా ఇశ్రాయేలు సైన్యంఉంది. హాయి మనుష్యులు చిక్కులోపడ్డారు. ఇశ్రాయేలీయులు వారిని ఓడించారు. హాయి మనుష్యుల్లో ఒక్కరినిగూడ బ్రతకనీయకుండా, శత్రువు ఒక్కడూ తప్పించుకోకుండా వారు పోరాడారు.
23 అయితే హాయి రాజును ప్రాణంతో ఉండనిచ్చారు. యెహోషువ మనుష్యులు అతణ్ణి యెహోషువ దగ్గరకు తీసుకొచ్చారు.
యుద్ధాన్ని గూర్చి ఆలోచించటం
24 యుద్ధ సమయంలో హాయి మనుష్యుల్ని ఇశ్రాయేలు సైన్యం పొలాల్లోనికి, ఎడారిలోనికి తరిమింది. కనుక హాయి మనుష్యులందరినీ ఇశ్రాయేలు సైన్యం చంపటం పూర్తి చేసింది. పొలాల్లో, ఎడారిలో ఉన్న మనుష్యులను చంపటం వారు పూర్తి చేసారు. అప్పుడు ఇశ్రేయేలు మనుష్యులంతా తిరిగి హాయి వెళ్లారు. అప్పుడు ఆ పట్టణంలో ప్రాణంతో ఇంకా బతికి ఉన్న వాళ్లందరినీ వారు చంపేసారు.
25 హాయి పట్టణ ప్రజలంతా ఆ రోజునే చనిపోయారు. పన్నెండువేల మంది పురుషులు, స్త్రీలు
26 ఆ పట్టణాన్ని నాశనం చేసేందుకు తన ప్రజలకు ఒక సంకేతంగా యెహోషువ తన ఈటెను హాయి పట్టణం వైపు ఎత్తి పట్టుకొన్నాడు. ఆ పట్టణంలోని ప్రజలు అందరూ నాశనం చేయబడేంతవరకు యెహోషువ ఆపు చేయలేదు.
27 ఆ పట్టణ ప్రజలు కలిగియున్న వస్తువులను, జంతువులను ఇశ్రాయేలు ప్రజలు తమ కోసం దాచు కొన్నారు. యెహోషువకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ఇలా చేసేందుకు అనుమతి ఇచ్చాడు.
28 అప్పుడు యెహోషువ హాయి పట్టణాన్ని కాల్చివేసాడు. ఆ పట్టణం ఒక పనికిమాలిన రాళ్ల కుప్ప అయింది. నేటికీ అది అలానే ఉంది.
29 హాయి రాజును యెహోషువ ఒక చెట్టుకు ఉరితీసాడు. ఆ సాయంత్రం వరకు అతణ్ణి అలానే ఆ చెట్టుకు వేలాడనిచ్చాడు. సూర్యాస్తమయం అయినప్పుడు ఆ రాజు దేహాన్ని చెట్టు మీదనుండి దించమని యెహోషువ తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. పట్టణద్వారం దగ్గర వారు అతని దేహాన్ని క్రింద పడవేసారు. తర్వాతవారు అతని దేహాన్ని రాళ్ల గుట్టతో కప్పివేసారు. ఆ రాళ్ల కుప్ప నేటికీ అక్కడ ఉంది.
ఆశీర్వాదాలు మరియు శాపాలను చదవటం
30 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. ఏబాలు కొండమీద ఆ బలిపీఠాన్ని అతడు కట్టాడు.
31 బలిపీఠాలు కట్టడం ఎలా అనేది యెహోవా సేవకుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియ జేస్తాడు. కనుక మెషే ధర్మశాస్త్ర గ్రంథంలో వివరించబడిన ప్రకారం యెహోషువ బలిపీఠాన్ని నిర్మించాడు. చెక్కబడని రాళ్లతో బలిపీఠం కట్టబడింది. ఆ రాళ్లమీద ఎన్నడూ ఏ పనిముట్టూ ప్రయోగించబడలేదు. ఆ బలిపీఠం మీద వారు యెహోవాకు దహనబలి అర్పణలు అర్పించారు సమాధాన బలులు కూడా వారు అర్పించారు.
32 ఆ స్థలంలోనే మోషే ధర్మశాస్త్రాన్ని యెహోషువ రాళ్లమీద చెక్కాడు. ఇశ్రాయేలు ప్రజలంతా చూసేందుకు వీలుగా అతడు ఇలా చేసాడు.
33 పెద్దలు, అధికారులు, న్యాయమూర్తులు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ పవిత్ర పెట్టె చుట్టూ నిలబడ్డారు. యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను మోస్తున్న లేవీ యాజకుల ఎదుట వారు నిలబడ్డారు. యూదా ప్రజలు, యూదులు కానివాళ్లు అందరూ అక్కడ ఉన్నారు. సగం మంది ప్రజలు ఏబాలు కొండ ఎదుటను, మిగిలిన సగం మంది ప్రజలు గెరిజీము కొండ ఎదుటను నిలబడ్డారు యెహోవా సేవకుడు మోషే ప్రజలను ఆశీర్వదించినప్పటిలానే ఉంది ఇప్పుడు కూడ. మోషే మొదటిసారు ఆశీర్వదించినప్పుడు ప్రజలు ఇలాగే నిలబడాలని అతడు చెప్పాడు.
34 అప్పుడు యెహోషువ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ చదివాడు. ఆశీర్వాదాలను, శాపాలను కూడ యోహోషువ చదివాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా అతడు చదివాడు.
35 ఇశ్రాయేలు ప్రజలంతా అక్కడ సమావేశం అయ్యారు. స్త్రీలు, పిల్లలు, ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించిన విదేశీయులు అందరూ అక్కడ ఉన్నారు. మరియు మోషే ఇచ్చిన ప్రతి ఆజ్ఞనూ యెహోషువ చదివాడు.