యెహోషువ వీడ్కోలు చెప్పటం
24
1 అప్పుడు ఇశ్రాయేలీయుల వంశాలన్ని షెకెములో సమావేశం అయ్యాయి. వారందరినీ యెహోషువ అక్కడికి పిలిచాడు. అప్పుడు ఇశ్రాయేలు నాయకులను, కుటుంబ పెద్దలను, న్యాయమూర్తులను యెహోషువ పిలిచాడు. వీళ్లంతా దేవుని ఎదుట నిలబడ్డారు.
2 అప్పుడు యెహోషువ ప్రజలందరితో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మీతో చెబతున్నదే నేను మీతో చెబతున్నాను. చాలకాలం క్రిందట మీ పూర్వీకులు యూఫ్రటీసు నదికి ఆవలిపక్క నివసించారు. అబ్రాహాము, నాహోరుల తండ్రి తెరహు వంటి మనుష్యులను గూర్చి నేను చెప్పుచున్నాను. అప్పట్లో వాళ్లు ఇతర దేవుళ్లను పూజించారు.
3 అయితే యెహోవానైన నేను మీ తండ్రి అబ్రాహామును నది ఆవలివైపు దేశంనుండి బయటకు రప్పించాను. నేను అతనిని కనాను దేశంగుండా నడిపించి, అతనికి అనేకమంది పిల్లల్ని ఇచ్చాను. అబ్రాహాముకు ఇస్సాకు అనే కొడుకును నేను ఇచ్చాను.
4 మరియు ఇస్సాకునకు యాకోబు, ఏశావు అనే ఇద్దరు కొడుకులను నేను ఇచ్చాను. శేయీరు చుట్టూరా ఉన్న పర్వతాలను నేను ఏశావుకు ఇచ్చాను. కానీ యాకోబు, అతని కొడుకులు అక్కడ నివసించలేదు. బ్రతికేందుకు వారు ఈజిప్టు వెళ్లారు.
5 “అప్పుడు మోషే, అహరోనులను నేను ఈజిప్టుకు పంపించాను. నా ప్రజలను వారు ఈజిప్టునుండి బయటకు తీసుకొని రావాలని నేను కోరాను. ఈజిప్టు ప్రజలకు అనేకమైన భయంకర సంగతులు జరిగేటట్టు నేను చేసాను. అప్పుడు నేను మీ వాళ్లను ఈజిప్టునుండి బయటకు రప్పించాను.
6 కనుక నేనే మీ పూర్వీకులను ఈజిప్టునుండి బయటకు రప్పించాను. వారు ఎర్ర సముద్రం వరకు వచ్చేటప్పటికి, ఈజిప్టు మనుష్యులు వారిని తరుముతున్నారు. రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు అక్కడ.
7 కనుక యెహోవానైన నన్ను ప్రజలు సహాయం కోరారు. నేను ఈజిప్టు ప్రజల మీదికి మహాగొప్ప కష్టం వచ్చేటట్టు చేసాను. సముద్రం వాళ్లను కప్పివేసేటట్టుగా యోహోవానైన నేను చేసాను. ఈజిప్టు సైన్యానికి నేను చేసిన దీనిని మీ మట్టుకు మీరే చూసారు.
“ఆ తర్వాత చాలా కాలం మీరు అరణ్యంలో నివసించారు.
8 అప్పుడు నేను అమోరీయుల దేశానికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఇది యోర్దాను నదికి తూర్పున ఉంది. ఆ ప్రజలు మీతో యుద్ధం చేసారు కాని మీరు వారిని ఓడించేటట్టు నేను చేసాను. ఆ ప్రజలను నాశనం చేసే శక్తి నేను మీకు ఇచ్చాను. అప్పుడు మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
9 “అప్పుడు మోయాబు రాజు, సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాజు బెయొరు కుమారుడైన బిలామును పిలిపించాడు. మిమ్మల్ని శపించమని అతడు బిలామును అడిగాడు.
10 కానీ యెహోవానైన నేను బిలాము మాట వినటానికి నిరాకరించాను. కనుక మీకు మంచి సంగతులు సంభవించాలని అర్థించాడు. అతడు మిమ్మల్ని చాలాసార్లు ఆశీర్వదించాడు. నేను మిమ్మల్ని రక్షించి, కష్టంనుండి బయటకు రప్పించాను.
11 “అప్పుడు మీరు యోర్దాను నది దాటి ప్రయాణంచేసారు. మీరు యెరికో చేరుకొన్నారు. యెరికో పట్టణం ప్రజలు మీతో పోరాడారు. మరియు అమోరీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు మీతో పోరాడారు. కాని వాళ్లందరినీ మీరు ఓడించేటట్టు నేను చేసాను.
12 మీ సైన్యం ముందుకు వెళ్తున్నప్పుడు వారికి ముందుగా కందిరీగలను నేను పంపించాను. ఆ కందిరీగలు మీ శత్రువులను పారిపోయేటట్టు చేసాయి. కనుక మీరు ఖడ్గాలు, బాణాలు ప్రయోగించకుండా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
13 “యెహోవానైన నేను మీకు ఆ దేశాన్ని ఇచ్చాను. మీరు పని చేయాల్సిన అవసరం లేకుండానే ఆ దేశాన్ని నేను మీకు ఇచ్చాను. మీరు నిర్మించని పట్టణాలను నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు మీరు ఆ దేశంలో, ఆ పట్టణాల్లో నివసిస్తున్నారు. మీరు నాటకుండానే ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు మీకు ఉన్నాయి.”
14 అప్పుడు యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు మీరు యెహోవా మాటలు విన్నారు. కనుక మీరు యెహోవాను గౌరవించి, నిజంగా ఆయనను సేవించాలి. మీ పూర్వీకులు పూజించిన అసత్య దేవుళ్లను పారవేయండి. అది ఎప్పుడో చాలకాలం క్రిందట నదికి అవతల, ఈజిప్టులో జరిగిన విషయం. ఇప్పుడు మీరు యెహోవాను సేవించాలి.
15 “అయితే ఒకవేళ యెహోవాను సేవించటం మీకు ఇష్టం లేదేమో. అది ఈ వేళే మీరు తేల్చుకోవాలి. మీరు ఎవరిని సేవిస్తారో నేడే నిర్ణయించుకోవాలి. మీ పూర్వీకులు నదికి ఆవల నివసించినప్పుడు సేవించిన దేవుళ్లను మీరు సేవిస్తారో? లేదా ఈ దేశంలో నివసించిన అమోరీయుల దేవుళ్లను సేవిస్తారో? మీకు మీరే కోరుకోండి. అయితే, నేను, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాము!”
16 అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “లేదు, యెహోవాను అనుసరించటం మేము ఎన్నటికీ మానము. ఇక ఇతర దేవుళ్లను ఎన్నటికి మేము సేవించము.
17 మన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించినవాడు యెహోవాయే అని మాకు తెలుసు. ఆ దేశంలో మనం బానిసలం. అయితే అక్కడ యెహోవా మనకోసం మహాగొప్ప కార్యాలు చేసాడు. ఆయనే ఆ దేశంనుండి మనల్ని బయటకు రప్పించాడు, ఇతర దేశాలగుండా మనము ప్రయాణిం చినప్పుడు ఆయనే మనలను కాపాడాడు.
18 తర్వాత ఈ దేశాల్లో నివసించే ప్రజలను ఓడించటానికి యెహోవాయే మనకు సహాయం చేసాడు. ఇప్పుడు మనం ఉన్న ఈ దేశంలో నివసించిన అమోరీ ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేసాడు. కనుక మేము ఆయననే సేవిస్తాం. ఎందుచేతనంటే ఆయనే మన దేవుడు గనుక.”
19 అప్పుడు యెహోషువ అన్నాడు, “(అది నిజం కాదు) మీరు యెహోవాను సరిగ్గా సేవించలేరు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు. తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజిస్తే దేవునికి అసహ్యం. అలా మీరు ఆయనకు వ్యతిరేకంగా తిరిగితే దేవుడు మిమ్మల్ని క్షమించడు.
20 మీరు యెహోవాను విడిచిపెట్టి, ఇతర దేవుళ్లను సేవిస్తారు మరియు భయంకర సంగతులను దేవుడు మీకు సంభవింపజేస్తాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తాడు. యెహోవా దేవుడు మీ ఎడల దయగా ఉన్నాడు కానీ మీరు ఆయనకు విరోధంగా తిరిగితే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.”
21 అయితే ప్రజలు, “లేదు, మేము యోహోవానే సేవిస్తాము” అని యెహోషువతో చెప్పారు.
22 అప్పుడు యెహోషువ, “మీ చుట్టూ, ఇక్కడ మీతో ఉన్న ప్రజల చుట్టూ చూడండి. మీరు యెహోవానే సేవించేందుకు నిర్ణయం చేసారని మీకు తెలుసా, మీరు ఒప్పుకొన్నారా? దీనికి మీరంతా సాక్షులేనా?” అన్నాడు.
ప్రజలు “అవును, ఇది సత్యం. మేము యెహోవానే సేవిస్తామని మేము నిర్ణయించు కొన్నట్టు మా అందరికీ తెలుసు” అని జవాబిచ్చారు.
23 అప్పుడు యెహోషువ, “అలాగైతే మీ మధ్య ఉన్న అసత్య దేవుళ్లను పారవేయండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి” అని చెప్పాడు.
24 అప్పుడు ప్రజలు “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాము. మేము ఆయనకే విధేయులమవుతాము” అని యెహోషువతో చెప్పారు.
25 కనుక ఆ రోజున యెహోషువ ప్రజలతో ఒక ఒడంబడిక చేసాడు. ఈ ఒడంబడికను వారు పాటించాల్సిన ఒక చట్టముగా చేసాడు యెహోషువ. షెకెము అనబడిన పట్టణంలో ఇదంతా జరిగింది.
26 దేవుని ధర్మశాస్త్రపు గ్రంథంలో యెహోషువ ఈ సంగతులన్నీ వ్రాసాడు. అప్పుడు యెహోషువ ఒక పెద్ద బండను చూసాడు. (ఈ బండ ఈ ఒడంబడికకు ఋజువు) యెహోవా పవిత్ర గుడారం దగ్గర సింధూర వృక్షం క్రింద ఆ బండను అతడు పెట్టాడు.
27 అప్పుడు యెహోషువ ప్రజలందరితో చెప్పాడు: “ఈనాడు మనం చేసిన సంగతులను జ్ఞాపకం చేసుకునేందుకు ఈ బండ మీకు సహాయకరంగా ఉంటుంది. ఈనాడు యెహోవా మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ బండ ఇక్కడే ఉంది. కనుక ఈ వేళ జరిగిన దానిని మనం జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరంగా ఉంటుంది ఈ బండ. మీమీద ఈ బండ సాక్షి. మీ దేవుడైన యెహోవాకు మీరు విరోధంగా తిరుగకుండా ఈ బండ మిమ్మల్ని వారిస్తుంది.”
28 అప్పుడు యెహోషువ ప్రజలందరినీ వారి ఇండ్లకు వెళ్లిపొమ్మని చెప్పాడు. ప్రతి వ్యక్తీ తన స్వంత స్థలానికి వెళ్లిపోయాడు.
యెహోషువ మరణం
29 ఆ తర్వాత నూను కుమారుడైన యెహోషువ చనిపోయాడు. ఆయన వయస్సు నూటపది సంవత్సరాలు.
30 తిమ్నాత్ సెరహులోని తన స్వంత స్థలంలో యెహోషువ పాతిపెట్టబడ్డాడు. ఇది గాయషుకొండకు ఉత్తరాన ఎఫ్రాయిం దేశంలో ఉంది.
31 యెహోషువ జీవించిన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను సేవించారు. యెహోషువ మరణం తర్వాత కూడా ప్రజలు యెహోవాను సేవించారు. తమ నాయకులు బ్రతికి ఉన్నంతవరకు ప్రజలు యెహోవాను సేవించటం కొనసాగించారు ఇశ్రాయేలీయులకు యెహోవా చేసినవాటిని చూసినవారు ఈ నాయకులు.
యోసేపు ఎముకలను ఇంటికి తేవటం
32 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టును విడిచినప్పుడు, యోసేపు ఎముకలను వారితోకూడ మోసుకునివచ్చారు. కనుక యోసేవు ఎముకలను షెకెములో ప్రజలు పాతిపెట్టారు. షెకెము తండ్రి, హమోరు కుమారుల దగ్గర యాకోబు కొన్న భూమిలో వారు ఆ ఎముకలను పాతిపెట్టారు. ఆ భూమిని యాకోబవంద వెండి నాణాలకు కొన్నాడు. ఈ భూమి యోసేపు పిల్లలకు చెందినది.
33 అహరోను కుమారుడైన ఎలీయాజరు చనిపోయాడు అతడు గిబియాల్లో పాతిపెట్టబడ్డాడు. ఎఫ్రాయిము కొండ దేశంలో గిబియా ఒక పురం. ఆ పురం ఎలీయాజరు కుమారుడైన ఫీనెహాసుకు ఇవ్వబడింది.