ఈజిప్టులోని యూదా వారికి యెహోవా సందేశం
44
యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారందరి కొరకు ఉద్దేశించబడింది. ఈ వర్తమానం మిగ్దోలు, తహపనేసు, నొపు పట్టణాలలోను మరియు దక్షిణ ఈజిప్టులోను నివసిస్తున్న యూదా వారికై ఇవ్వబడింది. ఆ సందేశం ఇలా ఉంది: “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, ‘యెరూషలేము నగరం మీదికి, యూదా పట్టణాలన్నిటి మీదికి నేను రప్పించిన భయంకర విపత్తులను మీరంతా చూశారు. ఆ పట్టణాలన్నీ ఈనాడు వట్టి రాళ్ల గుట్టల్లా వున్నాయి. ప్రజలంతా పాపకార్యాలు చేయుటవల్లనే ఆ ప్రదేశాలన్నీ నాశనమయ్యాయి. ఆ ప్రజలు అన్యదేవతలకు బలులు అర్పించారు. అది నాకు కోపకారణమయ్యింది! గతంలో మీ ప్రజలు మీ పూర్వీకులు ఆ అన్యదేవతలను ఎరుగరు; ఆరాధించలేదు. ఆ ప్రజల వద్దకు నా ప్రవక్తలను అనేక పర్యాయాలు పంపి యున్నాను. ఆ ప్రవక్తలు నా సేవకులు. ఆ ప్రవక్తలు నా సందేశాన్ని ప్రజలకు చెప్పారు. “మీరీ భయంకరమైన పని చేయవద్దు. విగ్రహారాధన విషయమై మిమ్మల్ని నేను అసహ్యించు కుంటున్నట్లు” వారు ప్రజలకు చెప్పారు. కాని ఆ ప్రజలు నా ప్రవక్తల మాట వినలేదు. ప్రజలసలు ప్రవక్తలను లక్ష్యపెట్టనేలేదు. ఆ ప్రజలు దుష్ట కార్యాలు చేయటం మానలేదు. అన్యదేవతలకు బలులు అర్పించటం వారు మానలేదు. కావున వారి మీద నా కోపాన్నీ చూపించాను. యూదా పట్టణాలను, యోరూషలేము నగర వీధులను నేను శిక్షించాను. ఈనాడు అవి వున్నట్లుగా యోరూషలేము నగరాన్ని, యూదా పట్టణాలను పట్టి రాళ్ల గుట్టల్లా నా కోపం మార్చివేసింది.’
“ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు, “విగ్రహారాధన చేస్తూ మిమ్మల్ని మీరు ఎందుకు బాధపెట్టుకుంటున్నారు? యూదా కుంటుంబం నుంచి పురుషులను, స్త్రీలను మరియు పిల్లలను, పసికందులను వేరు చేస్తున్నారు. ఆ విధంగా యూదా వంశంలో ఎవ్వరూ మిగలకుండా మీరు చేసుకుంటున్నారు. విగ్రహాలను తయారు చేస్తూ మీరెందుకు నాకు కోపం కల్గించ దల్చుకున్నారు? ఇప్పుడు మీరు ఈజిప్టులో ఉన్నారు. మళ్లీ మీరిప్పుడు ఈజిప్టుకు చెందిన బూటకపు దేవతలకు బలులు సమర్పిస్తూ నాకు కోపం కల్గిస్తూ ఉన్నారు. మీకై మీరే మిమ్మల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కేవలం అది మీ తప్పే. ఇతర దేశాలవారు మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడతారు. ఈ భూమి మీద వున్న రాజ్యాలన్నీ మిమ్మల్ని హేళన చేస్తాయి. మీ పూర్వీకులు చేసిన చెడుకార్యాలను మీరు మర్చిపోయారా? యూదా రాజులు, రాణులు చేసిన క్రూర కార్యాలు మీరు మర్చిపోయారా? మీరు, మీ భార్యలు కలసి యూదాలోను మరియు యెరూషలేము నగర వీధులలోను చేసిన చెడుకార్యాలు మర్చిపోయారా? 10 ఈనాటికీ యూదా ప్రజలు తమ్ము తాము తగ్గించు కోలేదు. నాపట్ల గౌరవ భావమేమీ చూపలేదు. ఆ ప్రజలు నా బోధనలను అనుసరించలేదు. మీకు, మీ పితరులకు యిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు పాటించలేదు.”
11 “కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘మీకు భయంకరమైన విపత్తులు కలుగజేయటానికి నేను నిశ్చయించాను. యూదా వంశాన్నంతా నాశనం చేస్తాను! 12 యూదాలో బహు తక్కువమంది మిగిలారు. వారిక్కడ ఈజిప్టుకు వచ్చియున్నారు. కాని యూదా వంశంలో మిగిలిన ఆ కొద్దిమందినీ నేను నాశనం చేస్తాను. వారు కత్తివాతబడిగాని, ఆకలితోగాని చనిపోతారు. ఇతర దేశాలవారు వీరిని గురించి చెడుగా చెప్పుకునేలా వీరు తయారవుతారు. వీరికీ జరిగిన సంఘటనలను తలుచుకొని ఇతర దేశాలవారు భయభ్రాంతులవుతారు. ఆ ప్రజలు శాపానికి మారు పేరవుతారు. ఆ యూదా ప్రజలను ఇతర దేశీయులు అవమానపర్చుతారు. 13 ఈజిప్టులో నివసించటానికి వచ్చిన వారిని నేను శిక్షిస్తాను. వారిని శిక్షించటానికి నేను కత్తిని, క్షామాన్ని, భయంకర రోగాలను వినియోగిస్తాను. యెరూషలేము నగరాన్ని శిక్షించిన విధంగానే ఆ ప్రజలను కూడ నేను శిక్షిస్తాను. 14 యూదాలో బతికి బయటపడి ఈజిప్టులో నివసిస్తున్న కొద్ది మందిలో ఏ ఒక్కడూ నా శిక్షను తప్పించుకోలేడు. యూదాకు తిరిగి రావటానికి ఒక్కడు కూడా మిగలడు. వారు యూదాకు తిరిగివచ్చి మరల అక్కడ నివసించాలని కోరుకుంటారు. బహుశః తప్పించుకున్న బహు కొద్దిమంది తప్ప, వారిలో ఒక్కడు కూడ యెరూషలేముకు తిరిగి వెళ్లడు.’”
15 ఈజిప్టులో నివసిస్తున్న చాలా మంది యూదా స్త్రీలు అన్యదేవతలను ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అది వారి భర్తలకు తెలుసు. అయినా వారు వారిని వారించలేదు. ఆ ప్రజలు పెద్ద గుంపుగా కలుసుకొన్నారు. వారిలో దక్షిణ ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలున్నారు. అన్యదేవతలకు నైవేద్యాలు అర్పిస్తున్న స్త్రీల భర్తలు యిర్మీయాతో ఇలా అన్నారు: 16 “నీవు మాకు చెపుతున్న యెహోవా సందేశాన్ని మేము వినం. 17 ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు సమర్పిస్తామని మేము మొక్కుకున్నాము. మేము మొక్కుకున్న విధంగా అంతా చేస్తాము. ఆమెకు పూజలో బలులు అర్పించి, పానార్పణ సమర్పిస్తాము. గతంలో మేమలా చేశాం. గతకాలంలో మా పూర్వీకులు, మా రాజులు, మా అధికారులు అలా చేశారు. యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను మేమంతా అలా చేశాం. ఆకాశ రాణిని మేము ఆరాధించినపుడు మాకు పుష్కలంగా ఆహారం దొరికింది. మాకు విజయం చేకూరింది. మాకు ఏ కీడూ సంభవించలేదు. 18 కాని మేము ఆకాశ రాణికి పానీయాలు సమర్పించటం మానివేశాం. ఆమె పూజలో ఇవన్నీ మేము చేయటం మానినప్పటి నుండి మాకు అనేక సమస్యలు వచ్చాయి. మా ప్రజలు కత్తులచేత, ఆకలిచేత చంపబడ్డారు.”
19 తరువాత స్త్రీలు మాట్లాడారు.* వారు యిర్మీయాతో యిలా చెప్పారు, “మేము ఏమి చేస్తున్నామో మా భర్తలకు తెలుసు. ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు అర్పించుటకు మా భర్తల అనుమతి పొందాము. వారి అనుమతితోనే మేము ఆమెకు పానీయాలు వారబోశాము. ఆమె ప్రతిరూపంగా మేము కుడుములు చేయటం కూడ మా భర్తలకు తెలుసు.”
20 పిమ్మట యిర్మీయా ఆ స్త్రీ పురుషులతో మాట్లాడాడు. ఈ విషయాలన్నీ చెప్పిన ఆ ప్రజలతో అతడు మాట్లాడినాడు. 21 ఆ ప్రజలతో యిర్మీయా ఇలా అన్నాడు: “యూదా పట్టణాలలోను, యెరూషలేము నగరంలోను మీరు ఈ దేవతలకు చేసిన బలి అర్పణలు యెహోవా గుర్తుపెట్టుకున్నాడు. మీరు, మీ పితరులు, మీ రాజు, మీ అధికారులు మరియు దేశంలో ఇతర ప్రజలు ఆ పనులు చేశారు. మీరు చేసిన పనిని యెహోవా గుర్తుపెట్టుకొని దానిని గురించి ఆలోచన చేశాడు. 22 తరువాత యెహోవా మీపట్ల ఎంతమాత్రం ఓర్పు వహించ లేకపోయాడు. మీరు చేసిన భయంకరమైన పనులను యెహోవా అసహ్యించుకున్నాడు. అందువల్ల యెహోవా మీ దేశాన్ని వట్టి ఎడారిగా మార్చి వేశాడు. అక్కడ ఇప్పుడు ఎవ్వడూ నివసించడు. అన్యులు ఆ రాజ్యాన్ని గురించి చెడ్డగా చెప్పుకుంటారు. 23 అన్య దేవతలకు మీరు బలులు అర్పించిన కారణంగా మీకు కష్టాలన్నీ వచ్చాయి. మీరు యెహోవా పట్ల పాపం చేశారు. మీరు యెహోవాకు విధేయులై వుండలేదు. మీకు అందజేసిన ఆయన ఆదేశాలనుగాని, ఆయన నిర్దేశించిన న్యాయసూత్రాలను గాని మీరు అనుసరించలేదు. దేవుని ఒడంబడికలో మీ బాధ్యతను మీరు విస్మరించారు.”
24 తరువాత ప్రజలందరినీ ఉద్దేశించి యిర్మీయా ఇలా చెప్పాడు: “ఇప్పుడు ఈజిప్టులో ఉన్న యూదా ప్రజలారా, యెహోవా వాక్కు వినండి: 25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్తున్నాడు, ‘మీరు మరియు మీ భార్యలు ఏమి చేస్తామని చెప్పినారో అది చేశారు. ఆకాశ రాణికి “మేము మొక్కుకున్న బలులు అర్పిస్తాము, పానీయాలు వారపోస్తాము” అని మీరన్నారు. అయితే అలాగే చేయండి. మీమాట ప్రకారం మీరు చేస్తామన్న పనులు చేయండి. మీ వాగ్దానాలను మీరు నిలబెట్టుకోండి.’ 26 కాని, ఈజిప్టులో నివసిస్తున్న ఓ యూదా ప్రజలారా యెహోవా సందేశాన్ని వినండి: ‘మహిమగల నా పేరు మీద ఈ ప్రమాణం చేస్తున్నాను: ఇప్పుడు ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారిలో ఒక్కడు కూడ మరెన్నడూ నా పేరు మీద వాగ్దానాలు చేయడు. “నిత్యుడైన యెహోవా సాక్షిగా” అని వారు చెప్పరు. 27 ఆ యూదా ప్రజలను నేను గమనిస్తున్నాను. కాని వారి సంక్షేమం కొరకు నేను వారిని గమనించటం లేదు. వారిని దెబ్బ కొట్టటానికే నేను కనిపెట్టుకునివున్నాను. ఈజిప్టులో వున్న యూదా వారు ఆకలితో మాడి చనిపోతారు. కత్తులతో నరకబడి చనిపోతారు. వారలా క్రమేపీ ఒకరి తరువాత ఒకరు అందరూ ముగిసేవరకు చనిపోతారు. 28 కొంతమంది యూదావారు కత్తివాతబడకుండా తప్పించుకుంటారు. వారు ఈజిప్టునుండి యూదాకు తిరిగి వస్తారు. అలా తప్పించుకోగలిగే యూదా వారు బహు తక్కువ మంది మాత్రమే. ఈజిప్టులో నివసించటానికి వచ్చి బ్రతికి బయటపడే ఆ బహు కొద్ది మంది యూదా వారు ఎవరి మాట నిజమవుతుందో తెలుసుకుంటారు. నా మాట నిజమయ్యినదో, వారి మాట నిజమయ్యినదో వారప్పుడు తెలుసుకుంటారు. 29 ఇక్కడ ఈజిప్టులో మిమ్మల్ని నేను శిక్షిస్తానని తెలిసేటందుకు ఒక నిదర్శనం ఇస్తాను.’ ఇదే యెహోవా వాక్కు. ‘అప్పుడు మిమ్మల్ని శిక్షిస్తానని నేను చేసిన ప్రమాణం నిజమవుతుందని మీకు నిశ్చయంగా తెలుస్తుంది. 30 నేను చెప్పినది చేస్తాననేందుకు ఇది ఒక నిదర్శనం.’ యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: ‘ఫరొహొఫ్ర ఈజిప్టుకు రాజు. శత్రువులు అతనిని చంపజూస్తున్నారు ఫరోహొఫ్రను అతని శత్రువులకు నేనప్పగిస్తాను. సిద్కియా యూదా రాజు. సిద్కియా శత్రువు నెబుకద్నెజరు. సిద్కియాను నేనతని శత్రువుకు అప్పగించాను. అదే రీతిగా ఫరోహొఫ్రను నేనతని శత్రువుకు అప్పగిస్తాను.’”

* 44:19: తరువాత స్త్రీలు మాట్లాడారు ఇది ప్రాచీన గ్రీకు అనువాదం నుండి తీసికొనబడింది. ఈ వాక్యం హెబ్రీ ప్రతిలో లేదు.
† 44:23: దేవుని ఒడంబడిక బహుశా ఇది మోషే ధర్మశాస్త్రంకావచ్చు. అది దేవునికి, ఇశ్రాయేలు ప్రజల మధ్య కుదిరిన ఒడంబడిక.