కొత్త ఇశ్రాయేలు
31
“ఆ సమయంలో ఇశ్రాయేలు వంశస్థులందరికి నేను దేవుడనై యుందును. వారు నా ప్రజలైయుందురు” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
యెహోవా ఇలా చెపుతున్నాడు:
“శత్రువు యొక్క కత్తికి గురికాకుండా కొంతమంది మిగిలిపోతారు. వారికి ఎడారిలో ఆదరణ లభిస్తుంది.
ఇశ్రాయేలు విశ్రాంతికొరకు అన్వేషిస్తూ అక్కడికి వెళ్తుంది.”
యెహోవా తన ప్రజలకు
దూరము నుండి దర్శనమిస్తాడు.
ఆయన ఇలా అన్నాడు: “ప్రజలారా మిమ్మల్ని నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను.
అందుకే నా కృప శాశ్వతంగా మీ పట్ల చూపిస్తూవచ్చాను.
నేను మీ పట్ల సదా సత్యంగా ఉంటాను.
ఓ నా ఇశ్రాయేలు కన్యకా, నిన్ను నేను పునర్నిర్మిస్తాను.
నీవు మరల ఒక దేశంలా అవుతావు.
నీవు మరలా తంబుర మీటుతావు.
వేడుక చేసికొనే ప్రజలందరితో కలిసి నీవు నాట్యం చేస్తావు.
ఇశ్రాయేలు రైతులారా, మీరు మళ్లీ పంటలు పండిస్తూ, ద్రాక్షాతోటలు పెంచుతారు.
సమరయనగర పరిసరాల్లో వున్న కొండలనిండా
మీరు ద్రాక్ష తోటలు పెంచుతారు.
ఆ ద్రాక్షా తోటల ఫల సాయాన్ని
రైతులంతా అనుభవిస్తారు.
కావలి వారు ఈ వర్తమానాన్ని
చాటే సమయం వస్తుంది:
‘రండి మనమంతా సీయోనుకు వెళ్లి
మన దేవుడైన యెహోవాను ఆరాధించుదాము!’
కొండల ప్రాంతమైన ఎఫ్రాయిములో కూడ కావలివారు ఆ వర్తమానాన్ని చాటి చెప్పుతారు!”
యెహోవా ఇలా చెప్పుచున్నాడు:
“సంతోషంగా ఉండండి. యాకోబు కొరకు పాటలు పాడండి!
రాజ్యాలలో కెల్ల మేటియైన ఇశ్రాయేలు విషయంలో ఎలుగెత్తి చాటండి.
మీ స్తుతి గీతాలు పాడండి! ఇలా చాటి చెప్పండి:
‘యెహోవా తన ప్రజలను కాపాడినాడు!*
ఇశ్రాయేలు దేశంలో జీవంతో మిగిలిన వారిని యెహోవా రక్షించినాడు!’
ఉత్తరాన గల దేశం నుండి
ఇశ్రాయేలీయులను తీసికొని వస్తానని తెలిసికొనండి.
భూమి మీద వివిధ దూర దేశాలలో చెదరియున్న
ఇశ్రాయేలును నేను తిరిగి కూడదీస్తాను.
వారిలో చాలా మంది గుడ్డి వారు, కుంటివారు అయ్యారు.
కొందరు స్త్రీలు నిండు గర్భిణీలై కనటానికి సిద్ధంగా ఉన్నారు.
ఎంతో మంది ప్రజలు తిరిగి వస్తారు.
వారు తిరిగి వచ్చే సమయంలో ఎంతగానో దుఃఖిస్తారు.
కాని నేను వారికి మార్గదర్శినై, వారిని ఓదార్చుతాను.
నేను వారిని ప్రవహించే సెలయేళ్ల పక్కగా నడిపించుతాను.
వారు తూలిపోకుండా
తిన్ననైన బాటపై వారిని నడిపిస్తాను.
నేనా విధంగా వారికి దారి చుపుతాను.
కారణమేమంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని
మరియు ఎఫ్రాయిము నా ప్రథమ పుత్రుడు.
10 “ఓ రాజ్యములారా (ప్రజలారా), యెహోవా యొక్క ఈ వర్తమానం వినండి!
ఈ సందేశాన్ని దూరసముద్రతీర వాసులందరికి తెలియజెప్పండి.
‘ఇశ్రాయేలు ప్రజలను చెల్లా చెదరు చేసిన ఆ సర్వోన్నతుడే
తిరిగి వారందరినీ ఒక్క చోటికి కూడదీస్తాడు.
గొర్రెల కాపరిలా తన మందను (ప్రజలను) కాచి రక్షిస్తాడు.’
11 యెహోవా యాకోబును తిరిగి తీసికొని వస్తాడు.
యెహోవా తన ప్రజలను వారి కంటె బలవంతుల బారి నుండి రక్షిస్తాడు.
12 ఇశ్రాయేలు ప్రజలు సీయోను కొండ పైకి వస్తారు.
వారు ఆనందంతో కేకలు వేస్తారు.
యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల కారణంగా
వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి.
యెహోవా వారికి ఆహార ధాన్యాలను, కొత్త ద్రాక్షారసాన్ని,
నూనెను, గొర్రె పిల్లలను, ఆవులను ఇస్తాడు.
నీరు పుష్కలంగా లభించే
ఒక తోటలా వారు విల్లసిల్లుతారు.
ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట
ఎంత మాత్రము ఇబ్బంది పెట్టబడరు.
13 ఇశ్రాయేలు యువతులంతా
సంతోషంతో నాట్యం చేస్తారు.
యువకులు, వృద్ధులు నాట్యంలో పాల్గొంటారు.
వారి విచారాన్ని సంతోషంగా మార్చుతాను.
ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చుతాను! వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చుతాను!
14 యాజకులకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది.
నేనిచ్చే పారితోషికాలతో నా ప్రజలు నిండిపోయి తృప్తి చెందుతారు!”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది!
15 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు:
“రామాలో రోదన వినవచ్చింది.
అది ఒక తీవ్రమైన రోదన; గొప్ప విషాదం.
రాహేలు తన పిల్లలు హతులైన కారణంగా
ఆమె ఓదార్పు పొందుటకు నిరాకరిస్తుంది.”
16 కాని యెహోవా ఇలా అంటున్నాడు: “విలపించుట ఆపి వేయిము.
నీవు కంటి తడి పెట్టవద్దు!
నీ పనికి తగిన ప్రతిఫలం నీకు దక్కుతుంది!”
ఇది యెహోవా సందేశం.
“ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రు రాజ్యం నుండి తిరిగి వస్తారు.
17 కావున, ఇశ్రాయేలూ, మంచి భవిష్యత్తుకు నీవు ఆశతో ఎదురు చూడుము.”
ఇది యెహోవా వాక్కు.
“నీ పిల్లలు వారి రాజ్యానికి తిరిగి వస్తారు.
18 ఎఫ్రాయిము విలపిస్తున్నట్లు నేను విన్నాను.
ఎఫ్రాయిము ఇలా అంటూవుండగా నేను విన్నాను:
‘యెహోవా, నీవు నిజంగా నన్ను శిక్షించావు! నేను మంచి గుణపాఠం నేర్చుకున్నాను.
నేనిక ఎన్నడూ తర్భీతు పొందని కోడెదూడలా ఉన్నాను.
దయచేసి నన్ను శిక్షించటం మానివేయుము.
నేను తిరిగి నీ యొద్దకు వస్తాను.
నీవే నిజమైన నా యెహోవా దేవుడవు.
19 యెహోవా, నేను నీకు దూరమయ్యాను.
కాని నేను చేసిన దుష్కార్యాలను నేను గుర్తించాను.
కావున నేను నా జీవన విధానాన్ని మార్చుకొని, హృదయ పరివర్తన కలిగియున్నాను.
నా చిన్న తనంలో నేను చేసిన మూర్ఖపు పనులకు సిగ్గుపడి కలవరపడియున్నాను.’”
20 దేవుడు ఇలా చెప్పు చున్నాడు:
“ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని మీకు తెలుసు.
ఆ బిడ్డను నేను ప్రేమిస్తున్నాను.
అవును, నేను ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా తరచు మాట్లాడియున్నాను.
అయినా నేను అతనిని జ్ఞాపకం చేసికుంటూ ఉంటాను.
నేనతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.
నేను నిజంగా అతన్ని ఓదార్చ గోరుతున్నాను.”
ఇది యెహోవా సందేశం.
21 “ఇశ్రాయేలు ప్రజలారా, రహదారి గుర్తులను నెలకొల్పండి.
ఇంటి మార్గాన్ని సూచించే గుర్తులను నిలబెట్టండి.
మార్గాన్ని కనిపెట్టుకొని ఉండండి.
మీరు పయనించే దారిని శ్రద్ధగా పరిశీలిస్తూ ఉండండి.
ఇశ్రాయేలూ, నా కన్యకా, ఇంటికి రమ్ము!
నీ నగరాలకు తిరిగిరా.
22 నీవు విశ్వాసం లేని కుమార్తెవై ఉన్నావు.
కాని ఇంకెంత కాలం అక్కడిక్కడ తిరుగుతావు. ఎప్పుడు ఇంటికి వస్తావు?
“నీ దేశంలో ఒక నూతనమైన దానిని యెహవా సృష్టించినప్పుడు
ఒక స్త్రీ తన పురుషుని ఆవరిస్తుంది.”
23 ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదా ప్రజలకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. వారిని తిరిగి నేను నిర్బందము నుండి తీసికొస్తాను. ఆ సమయంలో యూదా రాజ్యంలో దాని నగరాల్లోని ప్రజలు మళ్లీ ఇలా అంటారు: ‘ఓ నీతిగల నివాసమా, ఓ పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను దీవించు గాక!’§
24 “యూదా పట్టణాలలోని ప్రజలంతా శాంతి యుత సహాజీవనం చేస్తారు. రైతులు, స్థిరంగా లేకుండా తిరిగే పశువుల కాపరులు, అంతా యూదాలో ప్రశాంతంగా కలిసి జీవిస్తారు. 25 బలహీనులకు, అలసిపోయిన ప్రజలకు నేను విశ్రాంతిని, బలాన్ని ఇస్తాను. దుఃఖిస్తున్న వారి కోరికను తీరుస్తాను.”
26 అది విన్న తరువాత నేను (యిర్మీయా) మేల్కొని చుట్టూ చూశాను. అదెంతో హాయిని గూర్చిన నిద్ర.
27 “ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు అభివృద్ధి చెందేలా నేను సహాయపడే రోజులు వస్తున్నాయి.” ఇది యెహోవా వాక్కు. “వారి సంతానం, వారి పశుసంపద వర్థిల్లేలా కూడా నేను సహాయపడతాను. నేను చేసే ఆ పని ఒక మొక్కను నాటి దానిని పెంచినట్లుగా ఉంటుంది. 28 గతంలో ఇశ్రాయేలు, యూదావారు చేసే కార్యకలాపాలపై నేను నిఘా వేసి ఉన్నాను. వారిని మందలించే సమయం కోసం నేను వేచి ఉన్నాను. సమయం వచ్చింది; వారిని చీల్చి చెండాడాను. వారికి అనేక కష్ట నష్టాలు కలుగ జేశాను. కాని ఇప్పుడు వారిని పైకి తీసికొని రావటానికి, వారిని బలపర్చటానికి నేను వారిని గమనిస్తూ ఉన్నాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
29 “ఆ సమయంలో ప్రజలు ఈ సామెత చెప్పరు:
‘తండ్రులు పుల్లని ద్రాక్ష తిన్నారు,
కాని పిల్లల పళ్లు పులిశాయి.’**
30 కాని ప్రతివాడు తన పాపాల కారణంగా చని పోతాడు. పుల్లని ద్రాక్షా తిన్న వాని పండ్లే పులుస్తాయి.”
కొత్త ఒడంబడిక
31 “ఇశ్రాయేలు వంశంతోను, యూదా వంశంతోను నేనొక కొత్త ఒడంబడికను కుదుర్చుకునే సమయం ఆసన్న మవుతూ ఉంది. 32 ఇది నేను వారు పూర్వీకులతో చేసికొన్న ఒడంబడిక వంటిది గాదు. వారిని నా చేతితో ఈజిప్టు నుండి నడిపించి తీసికొని వచ్చి నప్పుడు మేమా ఒడంబడిక చేసికొన్నాము. నేను వారి యెహోవాను, కాని వారే ఆ ఒడంబడికను ఉల్లంఘించారు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
33 “భవిష్యత్తులో నేను ఇశ్రాయేలుతో ఈ రకమైన ఒడంబడిక చేసికుంటాను.” ఇదే యెహోవా వాక్కు. “నా బోధనలన్నీ వారి మనస్సులో నాటింప చేస్తాను. పైగా వాటిని వారి హృదయాల మీద రాస్తాను. నేను వారి దేవుణ్ణి. వారు నా ప్రజలై ఉందురు. 34 యెహోవాను గురించి తెలిసికొనేందుకు ప్రజలు వారి పొరుగువారికి, బంధువులకు బోధించనక్కరలేదు. ఎందువల్లనంటే అన్ని తరగతుల ప్రజలు తమతమ భేదం లేకుండా నన్ను తెలిసికుంటారు.” ఇదే యెహోవా వాక్కు. “వారు చేసిన చెడ్డ పనులన్నిటినీ నేను క్షమిస్తాను. వారి పాపాలను నేను గుర్తు పెట్టుకోనను.”
యెహోవా ఇశ్రాయేలును విడవక పోవటం
35 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “సూర్యుడు పగలు ప్రకాశించేలా యెహోవా చేశాడు.
చంద్రుడు, నక్షత్రాలు రాత్రి పూట కాంతిని వెద జల్లేలా యెహోవా చేశాడు.
సముద్రాలను ఘోషింపజేసి అలలు తీరాన్ని ముంచెత్తేలా చేసిందీ యెహవాయే.
ఆయన పేరే సర్వశక్తి మంతుడగు యెహోవా.”
36 యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు:
“ఇశ్రాయేలు సంతతి ఒక రాజ్యంగా జాతిగా ఉండుట ఎప్పుడూ మానరు.
సూర్య చంద్ర నక్షత్ర సముద్రాలపై నా అదుపు తప్పిన నాడు మాత్రమే వారు రాజ్యాంగా జాతిగా ఉండలేరు.”
37 యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “ఇశ్రాయేలు సంతతిని నేనెన్నడు తిరస్కరించను.
ప్రజలు ఆకాశాన్ని కొలవగలిగిననాడు, వారు భూమి యొక్క సర్వ రహస్యాలను తెలిసికోగలిగిననాడు!
నేను ఇశ్రాయేలీయుల సంతతి వారిని తిరస్కరిస్తాను.
అప్పుడు మాత్రం వారు చేసిన అకృత్యాల కారణంగా నేను వారిని తిరస్కరిస్తాను”
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
కొత్త యెరూషలేము
38 “యెహోవా నిమిత్తం యెరూషలేము నగరం తిరిగి నర్మింపబడే రోజులు వస్తున్నాయి. ఇదే యెహోవా వాక్కు. హనన్యేలు బురుజు నుండి మూల ద్వారం వరకు మొత్తం నగరమంతా తిరిగి కట్టబడుతుంది. 39 భూమి కొలత గీత గొలుసు మూల ద్వారం నుండి గారెబు కొండ వరకును, అక్కడ నుండి గోయా అను ప్రదేశం వరకు పరచబడుతుంది. 40 శవాలను, బూడిదను పడవేసిన లోయ అంతా యెహోవాకు పవిత్రమైనదిగా ఉంటుంది. తూర్పున వున్న కిద్రోను లోయకు ఎగువనున్న భూములన్ని గుర్రాల ద్వారం వరకు అన్నీ కలపడుతాయి. యెరూషలేము నగరం మరెన్నడు విచ్చిన్నం చేయబడదు. నాశనం చేయబడదు.”

* 31:7: యెహోవా … కాపాడినాడు యెహోవా నీ ప్రజలను కాపాడుము అని పాఠాంతరం.
† 31:15: రాహేలు ఈమె యాకోబు భార్య, కాని బబులోనుతో యుద్ధంలో చనిపోయిన తమ భర్తల, కుమారుల కొరకు విలపించే స్త్రీలందరు అని పాఠాంతరం.
‡ 31:22: ఒక … ఆవరిస్తుంది వాక్యం సులభ గ్రాహ్యం కాదు. యిర్మీయా కాలంలో వాడుకలో వున్న ఒక సామెతలో ఈ వాక్యం భాగం కావచ్చు.
§ 31:23: ఓ నీతిగల … దీవించు గాక సీయోను పర్వతానికి, దానిమీద నిర్మించిన దేవాలయానికి ఇది ఒక ఆశీర్వచనం.
** 31:29: తండ్రులు … పులిశాయి తల్లిదండ్రులు చేసిన నేరానికి పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారని దీని అర్థం.