కుమ్మరి మరియు బంకమట్టి
18
ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవానుండి వచ్చినది: “యిర్మీయా, కుమ్మరి వాని ఇంటికి వెళ్లు. నా వర్తమానం నీకు అక్కడ యిస్తాను.”
నేను కుమ్మరివాని ఇంటికి వెళ్లాను. ఆ కుమ్మరి తన సారె (చక్రం)పై కుండలు చేస్తున్నాడు. బంకమన్నుతో అతడొక కుండను చేస్తున్నాడు. కాని ఆ కుండరూపులో ఏదో లోపం వచ్చింది. చేసే కుండను తీసివేసి ఆ మట్టితో కుమ్మరి మరో కుండను చేశాడు. తన చేతి వ్రేళ్లను నైపుణ్యంగా ఉపయోగించి తనుకోరిన రీతిగా కుండను మలిచాడు.
అప్పుడు యెహోవా వాక్కు వాకు వినిపించింది: “ఇశ్రాయేలు వంశమా, నేను (యెహోవా) నీ విషయంలో కూడా అదేరీతిగా చేయగలనని నీకు తెలుసు. నీవు కుమ్మరి చేతిలో మట్టిలా వున్నావు. నేను కుమ్మరి వానిలా వున్నాను! నేను ఒక దేశాన్ని గురించిగాని, ఒక సామ్రాజ్యాన్ని గురించి గాని మాట్లాడే సమయం రావచ్చు. నేనారాజ్యాన్ని పెరికి వేయగలనని చెప్పవచ్చు. లేదా, ఆ దేశాన్నిగాని, ఆ సామ్రాజ్యాన్నిగాని కిందికి లాగి నాశనం చేస్తానని నేను అంటాను. అయితే ఆ దేశపు ప్రజలు మనస్సు మార్చుకొని తమ నడవడికను సరిచేసికోవచ్చు. ఆ దేశ ప్రజలు దుష్టకార్యాలు చేయటం మానివేయవచ్చు. అప్పుడు నా మనస్సును కూడా నేను మార్చుకుంటాను. ఆ దేశానికి బాధలు తెచ్చి పెట్టినా పథకాన్ని నేను అమలుపర్చను. ఒక దేశాన్ని గురించి నేను ప్రస్తావించే మరో సమయంరావచ్చు. నేనా దేశాన్ని తీర్చిదిద్ది, దాన్ని సుస్థిర పరుస్తానని అనవచ్చు. 10 కాని ఆ దేశ ప్రజలు నాకు విధేయులుకాకుండా దుష్టకార్యాలు చేస్తూ ఉండవచ్చు. అప్పుడు ఆ దేశానికి చేయదలచుకున్న మంచి పనుల విషయంలో నేను పునరాలోచించవలసి వుంటుంది.
11 “కావున యిర్మీయా, యూదా ప్రజలకు, యెరూషలేము నగర వాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడని చెప్పుము: ‘మీకు నేనిప్పుడే కష్టాలు సిద్ధం చేస్తున్నాను. మీకు వ్యతిరేకంగా పథకాలు తయారు చేస్తున్నాను. కావున మీరు చేస్తున్న దుష్టకార్యాలు చేయటం మానివేయాలి. ప్రతి ఒక్కడూ మార్పు చెందాలి. సత్కార్యాలు చేయటం మొదలు పెట్టాలి!’ 12 కాని యూదా ప్రజలు ఇలా సమాధాన మిస్తారు, ‘మార్చుటకు ప్రయత్నం చేయుటవల్ల ఏమీ ప్రయోజనముండదు. మేము చేయదలచుకున్నదేదో అదే చేస్తూపోతాము. మాలో ప్రతివాడూ తన కఠినమైన దుష్టమైన హృదయం ఎలా చెపితే అలా నడుచుకుంటాడు.’”
13 యెహోవా చెప్పే విషయాలు వినండి:
“అన్య దేశాల ప్రజలను ఈ ప్రశ్న అడగండి:
‘ఇశ్రాయేలు చేసినటువంటి దుష్కార్యాలు మరెవరైనా చేస్తున్నట్లు మీరెప్పుడైనా విన్నారా?’
పైగా ఇశ్రాయేలు దేవుని వధువులా ఉంది!
14 పొలాల్లో నుండి బండలు తమంత తాము బయటికి పోవని నీకు తెలుసు.*
లెబానోను పర్వతాల నుండి మంచు ఎన్నడూ కరిగిపోదని కూడా నీకు తెలుసు.
అక్కడ ప్రవహించే శీతల వాగులు ఎన్నడూ ఎండిపోవని కూడా నీకు తెలుసు.
15 కాని నా ప్రజలు నన్ను గురించి మర్చిపోయారు.
వారు పనికిరాని విగ్రహాలకు బలులు సమర్పించారు.
నా ప్రజలు వారు చేసే పనులలో తొట్రు పాటు చెందుతారు.
వారి పితరులు నడచిన పాత దారిలో నడిచి తడబడతారు.
నా ప్రజలు వేరే మార్గాన నడుస్తారు.
గతుకుల బాటలపై నడుస్తారు.
కాని వారు మంచి మార్గంపై నన్నను సరించరు!
16 యూదా రాజ్యం వట్టి ఎడారిగా మారిపోతుంది!
ఆ దారిన పోయే వారందరు దాని గతిచూచి ఆశ్చర్యంతో తలలు ఆడిస్తారు.
ఆ దేశం ఎలా నాశనమైపోయిందా అని వారు తికమక పడతారు!
17 యూదా ప్రజలను వారి శత్రువులముందు పనికి రానివారిగా పడవేస్తాను.
బలమైన తూర్పుగాలి వస్తువులను చెల్లాచెదరు చేసేలా నేను వారిని విసరివేస్తాను.
నేనా ప్రజలను నాశనం చేస్తాను. ఆ సమయంలో నేను వారికి అండగా వస్తున్నట్టు నన్ను చూడలేరు.
మరియు! నేను వారిని వదిలి పెడుతున్నట్లుగా చూస్తారు!”
యిర్మీయా నాల్గవ విన్నపం
18 పిమ్మట యిర్మీయా శత్రువులు ఇలా అన్నారు: “రండి. మనం యిర్మీయా పై కుట్ర పన్నుదాము. నిశ్చయముగా యాజకుడు చెప్పిన ధర్మశాస్త్రము వృధాపోదు, జ్ఞానులు చెప్పిన సలహాలు ఇంకా మనతో ఉంటాయి. ప్రవక్తల మాటలు మనకు ఇంకా ఉంటాయి. అందువల్ల మనం అతనిపై అబద్ధప్రచారం చేద్దాం. అది అతనిని నాశనం చేస్తుంది. అతడి మాటలను మనం వినము.”
19 యెహోవా, నా మనవి ఆలకించుము.
నా శత్రువుల మాట విని వారిని మంచి మార్గంలో నడిచేలా నీవే నిర్ణయించుము.
20 నేను యూదా ప్రజలకు మేలు చేశాను.
వారు నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు.
నన్ను చంపే ఉద్దేశ్యంతో వారు గోతిని తవ్వి సిద్ధం చేశారు.
21 కావున నీవిప్పుడు వారి పిల్లలు క్షామంలో తిండి లేక మాడి పోయేలా జేయి.
వారి శత్రువులు వారిని కత్తులతో ఓడించును గాక!
వారి భార్యలు తమ పిల్లలను భర్తలను పోగొట్టు కొందురు గాక!
యూదా రాజ్యంలో పురుషులంతా చనిపోవుదురు గాక!
వారి భార్యలను వితంతువులుగా చేయి.
వారి యువకులు యుద్ధంలో కత్తి వేటుకు చనిపోవును గాక.
22 వారి ఇండ్లలో రోదనలు కలుగును గాక!
నీవు వారిపైకి ఆకస్మికంగా శత్రువును రప్పించినపుడు వారు మిక్కిలి విలపించేలా చేయి.
నా శత్రువులు నన్ను మోసం చేయదలచినందుకు ఇదంతా వారికి సంభవించును గాక!
నా అడుగు పడ్డ వెంటనే పట్టడానికి బోనులు అమర్చారు.
23 యెహోవా, నన్ను చంపటానికి వారి ఎత్తుగడలన్నీ నీకు తెలుసు.
వారి నేరాలను క్షమించవద్దు. వారి పాపాలను తుడిచి వేయవద్దు.
నా శత్రువులను మట్టు బెట్టు!
నీకు కోపం వచ్చినపుడు వారిని శిక్షించు!

* 18:14: పొలాల్లో … తెలుసు ఇది మాటలతో ఆడే ఆట అక్షరార్థముగా ఇది అంటుంది: “ఎవరైనా షద్దే (శిలను) విడచిపెడతారా?” అని భావం. ఇవి రెండూ దేవుని సూచించే పేర్లు లేకపోతే “లెబానోను మంచు షద్దే పర్వతం మీదినుంచి ఎన్నడైనా కరిగిపోతుందా?” అని కూడా అనువదించవచ్చు. ఇది బహుశ హెరోను కొండను సూచించవచ్చు.