30
“కాని యిప్పుడు నన్ను హేళన చేసే వారు నాకంటే చిన్నావారు.
ఆ యువకులకు పనికి మాలిన తండ్రులు ఉన్నారు. వారి తండ్రులను నా గొర్రెలను కాపలా కాసే కుక్కలతో కూడా నేను ఉండనివ్వను.
నాకు సహాయం చేసేందుకు వాళ్లకు బలం లేదు.
వారు అలసిపోయిన వృద్ధులు.
ఆ మనుష్యులు చచ్చిన వాళ్లతో సమానం.
ఎందు కంటే వారికి ఏమీ లేక ఆకలితో ఉన్నారు. ఎండి పోయిన ఖాళీ నేలను కూడా వారు తినటానికి ప్రయత్నిస్తున్నారు.
ఆ మనుష్యులు వారి ఎడారిలోని తుత్తి చెట్లను పెరికి వేస్తారు.
తంగేడు చెట్టు వేర్లను వారు తింటారు.
ఆ మనుష్యులు ఇతర మనుష్యులు దగ్గర నుండి బలవంతంగా వెళ్లగొట్టబడతారు.
మనుష్యులు దొంగల మీద అరచినట్టుగా వారి మీద అరుస్తారు.
ఎండిపోయిన నదులలోను, బండలలోను,
కొండగుహలలోను, నేలలోని గుంటలలోను నివసించేందుకు వారి వృద్ధులు బలాత్కారం చేయ బడతారు.
వారు పొదలలో అరుస్తారు.
ముళ్ల కంపల్లో వారంతా ఒక్కచోట చేరుతారు.
వాళ్లు పనికిమాలిన అనామకుల గుంపు.
వాళ్లు వారి దేశం నుండి బలవంతంగా వెళ్లగాట్టబడిన వాళ్లు.
“ఇప్పుడు ఆ మనుష్యుల కొడుకులు నన్ను హేళన చేసేందుకు నన్ను గూర్చి పాటలు పాడుతారు.
వాళ్లకు నా పేరు చెడ్డ మాట అయింది.
10 ఆ యువకులు నన్ను ద్వేషిస్తారు, వారు నాకు దూరంగా నిలుస్తారు, వారు నాకంటే మంచివాళ్లము అనుకొంటారు.
చివరికి వాళ్లు నా ముఖం మీద ఉమ్మి కూడా వేస్తారు.
11 నా వింటి నారిని దేవుడు తీసుకొని నన్ను బలహీనుణ్ణి చేశాడు.
ఆ యువకులు తమని తాము వారించుకొనక నిండు కోపంతో నాకు విరోధంగా తిరుగుతారు.
12 నా కుడి ప్రక్క ఆ యువకులు నామీద పడుతున్నారు.
నేను పడిపోయేలా వాళ్లు చేస్తున్నారు.
వారు నామీద దాడి చేసి, నన్ను నాశనం చేసేందుకు నా చుట్టూరా పట్టణానికి ముట్టడి దిబ్బ వేసినట్లు వేస్తున్నారు.
13 నేను పారిపోయే మార్గాన్ని ఆ యువకులు కాపలా కాస్తున్నారు.
నన్ను నాశనం చేయటంలో వారువిజయం పొందుతున్నారు. వారు నన్ను నాశనం చేయటానికి వారికి ఎవరి సహాయం అవసరం లేదు.
14 గోడలోని కన్నంగుండా వెళ్లిపోయినట్టు వారు నామీద దాడి చేస్తున్నారు.
వారు దూకేసి నా మీదకు విరగబడుతున్నారు.
15 భయాలు నన్ను ఆవరించేస్తున్నాయి.
వస్తువులనుగాలి చెదరగొట్టినట్లు ఆ యువకులు నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు.
నా భద్రత మబ్బులా మాయమవుతోంది.
16 “ఇప్పుడు నా జీవితం దాదాపు అయిపోయింది.
నేను త్వరలోనే మరణిస్తాను. శ్రమదినాలు నన్ను పట్టివేశాయి.
17 రాత్రివేళ నా ఎముకలు అన్నీ నొప్పెడతాయి.
బాధ నన్ను నమిలివేయటం ఎన్నడూ ఆగిపోలేదు.
18 దేవుడు మహాబలంగా నా చొక్కా పట్టి లాగుతున్నాడు.
ఆయన నా బట్టలను నలిపి వేస్తున్నాడు.
19 దేవుడు నన్ను బురదలో పడదోస్తున్నాడు.
నేను మట్టిలా, బూడిదలా అయిపోతున్నాను.
20 “దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెడుతున్నాను.
కానీ నీవు జవాబు ఇవ్వవు.
నేను నిలబడి ప్రార్థన చెస్తాను.
కానీ నీవు నాకు జవాబు ఇవ్వవు.
21 దేవా, నీవు నా ఎడల అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు.
నన్ను బాధపెట్టేందుకు నీవు నీ శక్తిని ప్రయోగిస్తున్నావు.
22 దేవా, బలమైన గాలి నన్ను కొట్టుకొని పోయేటట్టు నీవు చేస్తున్నావు.
నీవు నన్ను తుఫానులో పడదోస్తున్నావు.
23 నీవు నన్ను నా మరణానికి తీసుకొని పోతున్నావని నాకు తెలుసు.
మరణం ప్రతి మనిషికి ఏర్పాటు చేయబడిందే.
24 “కానీ అప్పటికే నాశనమయి, సహాయంకోసం అలమటించేవాణ్ణి
నిశ్చయంగా ఎవ్వరూ బాధించరు.
25 దేవా, కష్టాల్లో ఉన్న ప్రజల పక్షంగా నేను మొర్ర పెట్టానని నీకు తెలుసు.
పేద ప్రజల కోసం నా హృదయం ఎంతో విచారించిందని నీకు తెలుసు.
26 కానీ నేను మంచివాటి కోసం ఎదురు చూస్తే వాటికి బదులు చెడ్డవి జరిగాయి.
వెలుగుకోసం నేను చూస్తే చీకటి వచ్చింది.
27 అంతరంగంలో నేను చీల్చివేయబడ్డాను.
శ్రమలు ఎన్నటికీ ఆగిపోవు. శ్రమకాలాలు నా యెదుట ఉన్నాయి.
28 నేను ఎల్లప్పుడూ ఎంతో విచారంగా ఉంటానుగాని,
నాకు ఆదరణ లభ్యం కాదు. నేను సమాజంలో నిలబడి సహాయం కోసం కేకలు వేస్తాను.
29 నేను అడవి కుక్కలకు సోదరుడినయ్యాను. నిప్పుకోళ్లు నాకు జతగాళ్లు.
30 నా చర్మం చాలా నల్లబడిపోయింది.
నా శరీరం జ్వరంతో వేడిగా ఉంది.
31 దుఃఖమయ గీతాలు వాయించేందుకు నా స్వర మండలములను శృతి చేయబడింది.
విచారంగా ఏడుస్తున్న శబ్దాలు నా పిల్లనగ్రోవి చేస్తుంది.