ఏశావు కుటుంబం
36
1 ఏశావు కుటుంబ జాబితా ఇది: (ఎదోము అని కూడ అతనికి పేరు) ఏశావు కనాను దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు.
2 ఏశావు భార్యలు ఎవరంటే: ఆదా, హిత్తీవాడైన ఏలోను కుమార్తె అహోలీబామా, హివ్వీవాడైన సిబ్యోను కుమారుడు అనా కుమార్తె,
3 బాశెమతు, ఇశ్మాయేలు కుమార్తె, నెబాయోతు సోదరి.
4 ఎలీఫజు అనే కుమారుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమారుని బాశెమతు ఏశావుకు కన్నది.
5 అహోలీబామా ఏశావుకు ముగ్గురు కుమారులను కన్నది: యూషు, యాలాము, కోరహు. వీరు ఏశావు కుమారులు. వీరు కనాను దేశంలో పుట్టారు.
6-8 ఏశావు కుటుంబం, యాకోబు కుటుంబం కలిసి ఒకే చోట నివసించటం వల్ల ఆ ప్రాంతం వాళ్ల పోషణకు చాలలేదు. కనుక ఏశావు కనాను విడిచిపెట్టి తన సోదరుడు యాకోబుకు దూరంగా మరో దేశం వెళ్లిపోయాడు. ఏశావు తనకు కలిగినదంతా తనతోబాటు తీసుకొని పోయాడు. ఇవన్నీ అతడు కనానులో నివసించినప్పుడు సంపాదించుకొన్నాడు. కనుక తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన బానిసలందరిని, పశువులను, ఇతర జంతువులను ఏశావు తనతో కూడ తెచ్చుకొన్నాడు. కనుక ఏశావు శేయీరు కొండ ప్రాంతానికి తరలి పోయాడు. (ఏశావుకు ఎదోము అని కూడ పేరు). (మరియు ఎదోము, శేయీరు దేశానికి మరో పేరు)
9 ఎదోమి ప్రజలకు ఏశావు తండ్రి. శేయీరు (ఎదోము) కొండ ప్రాంతంలో నివసిస్తోన్న ఏశావు కుటుంబంలోని వాళ్ల పేర్లు యివి:
10 ఏశావు కుమారులు ఎలీఫజు, ఏశావు, ఆదాలకు పుట్టిన కుమారుడు. రగూయేలు, ఏశావు, బాశెమతులకు పుట్టిన కుమారుడు.
11 ఎలీఫజుకు అయిదుగురు కుమారులు: తేమాను, ఓమారు, సెపో, గాతాము మరియు కనజు.
12 ఎలీఫెజుకు తిమ్నా అనే ఒక దాసి కూడ ఉంది. తిమ్నా, ఎలీఫజులకు అమాలేకు పుట్టాడు.
13 రగూయేలుకు ముగ్గురు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.
వీరు బాశెమతు మూలంగా ఏశావుకు మనుమళ్లు.
14 అనా కుమార్తె అహోలీబామా ఏశావుకు మూడవ భార్య. (అనా సిబ్యోను కుమారుడు) ఏశావు, అహోలీబామాలకు పుట్టిన పిల్లలు: యూషు, యాలాము, కోరహు.
15 ఏశావు ద్వారా వచ్చిన వంశాలు యివి:
ఏశావు మొదటి కుమారుడు ఎలీఫజు. ఎలీఫజుకు పుట్టిన వారు: తేమాను, ఓమారు, సెపో, కనజు.
16 కోరహు, గాతాము, అమాలేకు.
ఈ వంశాలన్నీ ఏశావు భార్య ఆదానుండి ఉద్భవించాయి
17 ఏశావు కుమారుడు రగూయేలు ఈ కింది కుటుంబాలకు తండ్రి: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.
ఈ కుటుంబాలన్నీ ఏశావు భార్య బాశెమతు నుండి ఉద్భవించాయి.
18 అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామాకు యూషు, యగ్లాము, కోరహు పుట్టారు. ఈ ముగ్గురు వారికి పుట్టిన కుటుంబాలకు పెద్దలు.
19 ఈ కుటుంబాలన్నీ ఏశావునుండి ఉద్భవించాయి.
20 ఏశావుకంటె ముందు హోరీవాడైన శేయీరు ఎదోములో నివసించాడు. శేయీరు కుమారులు వీరు:
లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
21 దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఏశావు (ఎదోము) ప్రాంతంనుండి వచ్చిన హోరీయ కుటుంబ నాయకులు.
22 హోరీ, హేమీము. వీరికి లోతాను తండ్రి. (తిమ్నా లోతాను సోదరి.)
23 అల్వాన్, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. వీరి తండ్రి శోబాలు.
24 సిబ్యోనుకు ఇద్దరు కుమారులు. అయ్యా, అనా. (అనా తన తండ్రి గాడిదలను కాస్తూ ఉండగా ఎడారిలో ఉష్ణధారలను కనుగొన్నవాడు.)
25 దిషాను, అహోలీబామా అనే వారికి అనా తండ్రి.
26 దిషోనుకు నలుగురు కుమారులు: హెన్దూను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
27 ఏసెరుకు ముగ్గురు కుమారులు: బిల్హాను, జవాను, అకాను.
28 దీషానుకు ఇద్దరు కుమారులు: ఊజు, అరాను.
29 హోరీ కుటుంబాల పెద్దల పేర్లు ఇవి: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
30 దిషోను, ఏసెరు, దీషాను, శేయీరు (ఎదోము) దేశంలో నివసించిన కుటుంబాల పెద్దలు వీరంతాను.
31 అప్పట్లో, ఎదోములో రాజులు ఉన్నారు. ఇశ్రాయేలీయుల రాజులకంటె చాలా ముందే ఎదోములో రాజులు ఉన్నారు.
32 బెయారు కుమారుడు బెల ఎదోమును పాలించిన ఒక రాజు. అతడు దిన్హాబా పట్టణమును పాలించాడు.
33 బెల చనిపోయినప్పుడు యోబాబు రాజయ్యాడు. యోబాబు బొస్రావాడైన జెరహు కుమారుడు.
34 యోబాబు చనిపోయినప్పుడు హుషాము పాలించాడు. హుషాము తేమాని ప్రజల దేశవాసి.
35 హుషాము చనిపోయాక హదదు ఆ ప్రాంతాన్ని పాలించాడు. బదదు కుమారుడు హదదు. (మోయాబు దేశంలో మిద్యానును జయించినవాడు హదదు.) హదదు అవీతు పట్టణంవాడు.
36 హదదు మరణించాక శమ్లా ఆ దేశాన్ని పాలించాడు. శమ్లా మశ్రేకనుండి వచ్చినవాడు.
37 శమ్లా మరణించాక షావూలు ఆ ప్రాంతాన్ని పాలించాడు. యూఫ్రటీసు నదీ ప్రాంతంలోని రహెబోతువాడు షావూలు.
38 షావూలు మరణానంతరం బయల్ హానాను ఆ దేశాన్ని పాలించాడు. అక్బోరు కుమారుడు బయల్ హనాను.
39 బయల్ హనాను మరణించాక హదదు (హదరు) ఆ దేశాన్ని పాలించాడు. హదదు పాపు నగరవాసి. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కుమార్తె. (మత్రేదు తండ్రి మేజాహాబు).
40-43 తిమ్నా, అల్వా, యతేతు, అహోలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈరాము: ఈ ఎదోమీ కుటుంబాలకు పితరుడు ఏశావు. వీటిలో ఒక్కో కుటుంబం, తన కుటుంబం పేరుతోనే పిలువబడే ప్రాంతంలో నివసించింది.