అబీమెలెకుతో ఇస్సాకు అబద్ధం చెప్పటం
26
1 ఒకసారి కరువుకాలం వచ్చింది. అబ్రాహాము జీవిత కాలంలో వచ్చిన కరువులాంటిదే ఇది. కనుక గెరారు పట్టణంలో ఉన్న ఫిలిష్తీ ప్రజల రాజు అబీమెలెకు దగ్గరకు ఇస్సాకు వెళ్లాడు.
2 ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: “ఈజిప్టు వెళ్లవద్దు. నీవు ఉండాలని నేను నీకు ఆజ్ఞాపించిన దేశంలోనే నీవు నివసించాలి.
3 ఆ దేశంలోనే నీవు నివాసం ఉండు, నేను నీతో ఉంటాను. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నీకు నీ వంశానికి ఈ భూభాగాలన్నీ ఇస్తాను. నీ తండ్రి అబ్రాహాముకు నేను వాగ్దానం చేసినదంతా నీకు నేను ఇస్తాను.
4 ఆకాశ నక్షత్రాలు ఎన్నో, నీ సంతానం అంతటిదిగా నేను చేస్తాను. ఈ దేశాలన్నీ నీ కుటుంబానికి నేను ఇస్తాను. నీ సంతానం మూలంగా భూమిమీద జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయి.
5 నీ తండ్రియైన అబ్రాహాము నా మాటలకు లోబడి, నేను చెప్పిన వాటిని చేసాడు గనుక నేను ఇది చేస్తాను. అబ్రాహాము నా ఆజ్ఞలకు చట్టాలకు, నియమాలకు విధేయుడయ్యాడు.”
6 కనుక ఇస్సాకు గెరారులో ఉండిపోయి అక్కడ నివసించాడు.
7 ఇస్సాకు భార్య రిబ్కా చాలా అందగత్తె. రిబ్కాను గూర్చి అక్కడి మనుష్యులు ఇస్సాకును అడిగారు. “ఆమె నా సోదరి” అని చెప్పాడు ఇస్సాకు. రిబ్కా తన భార్య అని వారితో చెప్పడానికి ఇస్సాకు భయపడ్డాడు. ఆమెను పొందటం కోసం ఆ మనుష్యులు తనను చంపివేస్తారని ఇస్సాకు భయపడ్డాడు.
8 ఇస్సాకు అక్కడు చాలా కాలం ఉన్న తర్వాత, ఇస్సాకు అతని భార్యతో సరసాలు ఆడుకోవటం అబీమెలెకు తన కిటికీ గుండా చూశాడు.
9 అబీమెలెకు ఇస్సాకును పిలిచి “ఈ స్త్రీ నీ భార్య. ఈమె నీ సోదరి అని మాతో ఎందుకు చెప్పావు?” అని అడిగాడు.
“నీవు ఈమెను పొందటం కోసం నన్ను చంపేస్తావని నేను భయపడ్డాను” అని ఇస్సాకు అతనితో చెప్పాడు.
10 “నీవు మాకు కీడు చేసావు. మా మనుష్యుల్లో ఎవడైనా ఒకడు నీ భార్యతో శయనించి ఉండేవాడు. అప్పుడు అతడు మహా పాపము చేసిన నేరస్థుడయ్యైవాడు” అన్నాడు అబీమెలెకు.
11 అందుచేత అబీమెలెకు ప్రజలందరికి హెచ్చరిక ఇచ్చాడు. “ఈ పురుషునిగాని, ఇతని భార్యనుగాని ఎవరూ బాధించగూడదు. వారిని బాధించినవాడు ఎవరైనా సరే చంపివేయబడతాడు” అని అతడు చెప్పాడు.
ఇస్సాకు ధనికుడయ్యాడు
12 ఆ దేశంలో ఇస్సాకు పొలాల్లో విత్తనాలు విత్తాడు. ఆ సంవత్సరం అతడు విస్తారంగా పంట కూర్చుకున్నాడు. యెహోవా అతన్ని ఎంతో అశీర్వదించాడు.
13 ఇస్సాకు ధనికుడయ్యాడు. అతడు మహా ఐశ్వర్యవంతుడు అయ్యేవరకు మరింత విస్తారంగా ఐశ్వర్యం కూర్చుకొన్నాడు.
14 గొర్రెల మందలు, పశువుల మందలు అతనికి విస్తారంగా ఉన్నాయి. అతనికి చాలా మంది బానిసలు కూడా ఉన్నారు. ఫిలిష్తీ ప్రజలంతా అతని మీద అసూయ పడ్డారు.
15 కనుక ఇస్సాకు తండ్రియైన అబ్రాహాము, అతని సేవకులు తవ్విన చాలా బావుల్ని ఫిలిష్తీ ప్రజలు పాడుచేశారు. ఆ బావుల్ని ఫిలిష్తీ ప్రజలు మట్టితో నింపారు.
16 అబీమెలెకు ఇస్సాకుతో, “మా దేశం వదలి పెట్టు. నీవు మాకంటే చాలా అత్యధికంగా శక్తిమంతుడవయ్యావు” అన్నాడు.
17 కనుక ఇస్సాకు ఆ స్థలం విడిచిపెట్టి, గెరారు చిన్న నదికి సమీపంలో నివాసం చేసాడు. ఇస్సాకు అక్కడ ఉండి జీవించాడు.
18 దీనికి ఎంతో ముందు అబ్రాహాము చాలా బావులు తవ్వాడు. అబ్రాహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీ ప్రజలు ఆ బావులను చెత్తతో నింపేసారు. కనుక ఇస్సాకు తిరిగి వెళ్లి ఆ బావులను మళ్లీ తవ్వాడు. వాటికి తన తండ్రి పెట్టిన పేర్లే ఇస్సాకు పెట్టాడు.
19 చిన్న నది దగ్గర ఇస్సాకు సేవకులు ఒక బావి తవ్వారు. ఆ బావిలో నీటి ఊట ఒకటి ఉబికింది.
20 అయితే గెరారు లోయలో గొర్రెల మందలను కాసేవాళ్లు ఇస్సాకు పనివాళ్లతో జగడమాడారు. “ఈ నీళ్లు మావి అన్నారు వాళ్లు.” కనుక ఆ బావికి “ఏశెకు” అని ఇస్సాకు పేరు పెట్టాడు. అక్కడ ఆ మనుష్యులు అతనితో జగడమాడారు గనుక దానికి ఆ పేరు పెట్టాడు.
21 అప్పుడు ఇస్సాకు సేవకులు మరో బావి తవ్వారు. ఆ బావి మూలంగా అక్కడి ప్రజలు కూడా జగడమాడారు. కనుక ఆ బావికి “శిత్నా” అని ఇస్సాకు పేరు పెట్టాడు.
22 ఇస్సాకు అక్కడనుండి వెళ్లపోయి మరో బావి తవ్వాడు. ఆ బావి విషయం వాదించటానికి ఎవరూ రాలేదు. కనుక ఆ బావికి “రహెబోతు” అని ఇస్సాకు పేరు పెట్టాడు. “ఇప్పుడు మనకోసం యెహోవా ఒక స్థలం ఇచ్చాడు. ఈ దేశంలో మనం అభివృద్ధిపొంది సఫలము కావాలి.” అన్నాడు ఇస్సాకు.
23 ఆ చోటు నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్లాడు.
24 ఆ రాత్రి ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. “నీ తండ్రి అబ్రాహాము దేవుణ్ణి నేను. భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వంశస్తులను అభివృద్ధి చేస్తాను. నా సేవకుడు అబ్రాహాము కారణంగా నేను ఇది చేస్తాను” అని చెప్పాడు యెహోవా.
25 కనుక ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించేందుకు ఒక బలిపీఠాన్ని ఇస్సాకు కట్టించాడు. ఇస్సాకు అక్కడ నివాసం చేయగా, అతని సేవకులు ఒక బావి తవ్వారు.
26 ఇస్సాకును చూసేందుకు గెరారు నుండి అబీమెలెకు వచ్చాడు. సలహాదారుడు అహుజతును సైన్యాధిపతయైన ఫీకోలును వెంటబెట్టుకొని అబీమెలెకు వచ్చాడు.
27 ఇస్సాకు వారితో, “ఇంతకుముందు నీవు నాతో స్నేహంగా లేవు గదా. నీ దేశం వదిలిపెట్టేట్టు నీవు నన్ను బలవంతం గూడా చేసావు గదా. ఇప్పుడు నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు?” అన్నాడు.
28 వారు జవాబు చెప్పారు: “యెహోవా నీకు తోడుగా ఉన్నాడని ఇప్పుడు మాకు తెలిసింది. మనం ఒక ఒడంబడిక చేసుకోవాలని మా అభిప్రాయం. మాకు నీవు ఒక ప్రమాణం చేయాలి.
29 మేము నిన్ను బాధించలేదు. ఇప్పుడు నీవు కూడా మమ్మల్ని బాధించనని ప్రమాణం చేయాలి. నిన్ను మేము పంపించివేసినా, సమాధానంగా పంపించాం. యెహోవా నిన్ను ఆశీర్వదించాడని యిప్పుడు తేటగా తెలుస్తుంది.”
30 ఇస్సాకు వారికి విందు చేసాడు. వారు తిని తాగారు.
31 మర్నాడు ఉదయం ఒక్కొక్కరు ఒక్కో ప్రమాణం చేసారు. తర్వాత ఆ మనుష్యులు సమాధానంగా వెళ్లిపోయారు.
32 ఆ రోజున ఇస్సాకు సేవకులు వచ్చి, వారు తవ్విన బావిని గూర్చి చెప్పారు. “ఆ బావిలో నీళ్లు చూశాం” అని చెప్పారు సేవకులు.
33 కనుక ఆ బావికి “షేబ” అని పేరు పెట్టాడు ఇస్సాకు. ఆ పట్టణం ఇప్పటికీ బెయేర్షెబా అని పిలువబడుతుంది.
ఏశావు భార్యలు
34 ఏశావు 40 సంవత్సరాల వయస్సులో హిత్తీ స్త్రీలను ఇద్దరిని వివాహం చేసుకొన్నాడు. ఒక స్త్రీ బేయేరి కుమార్తె యహూదీతు. ఇంకొక ఆమె ఏలోను కుమార్తె బాశెమతు.
35 ఈ వివాహాలు ఇస్సాకు రిబ్కాలను చాలా బాధపెట్టాయి.