ఇస్సాకు కోసం ఒక భార్య
24
1 అబ్రాహాము కురువృద్ధుడయ్యేంత వరకు జీవించాడు. అబ్రాహామును, అతడు చేసిన దాన్నంతటిని దేవుడు ఆశీర్వదించాడు.
2 అబ్రాహాము యొక్క పాత సేవకుడు ఆస్తి వ్యవహారాలన్నింటి మీద నిర్వాహకునిగా ఉన్నాడు. ఆ సేవకుణ్ణి అబ్రాహాము తన దగ్గరకు పిలిచి ఇలా చెప్పాడు: “నీ చేయి నా తొడకింద పెట్టు.
3 ఇప్పుడు నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి. కనాను స్త్రీలలో ఎవరినీ నా కుమారుని పెళ్లి చేసుకోనివ్వవని భూమ్యాకాశాలకు దేవుడుగు యెహోవా ఎదుట నాకు వాగ్దానం చేయి. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం గాని అతణ్ణి మాత్రం కనాను స్త్రీని వివాహం చేసుకోనివ్వవద్దు.
4 నా దేశంలోని నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లు. అక్కడ నా కుమారుని కోసం భార్యను చూడు. అప్పుడు ఆమెను ఇక్కడికి (అతని దగ్గరకు) తీసుకురా.”
5 ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశం రావడానికి ఇష్టపడకపోతే, నీ కుమారుడ్ని నేను నీ స్వంత దేశానికి తీసుకొని వెళ్లవచ్చునా?” అని అడిగాడు.
6 అబ్రాహాము అతనితో చెప్పాడు: “వద్దు, నా కుమారుని ఆ దేశం తీసుకు వెళ్లొద్దు.
7 పరలోక దేవుడైన యెహోవా నా స్వదేశము నుండి ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడు. ఆ దేశం నా తండ్రికి, నా కుటుంబానికి మాతృదేశం కాని ఈ నూతన దేశం నీ కుటుంబానికి చెందుతుందని యెహోవా వాగ్దానం చేసాడు. ప్రభువు నీకంటే ముందర తన దేవదూతను పంపిస్తాడు. మరి నీవు నా కుమారునికి వధువును అక్కడనుంచి తెస్తావు.
8 అయితే అమ్మాయి నీతో రావటానికి నిరాకరిస్తే, ఈ వాగ్దాన విషయంలో నీ బాధ్యత తీరుపోతుంది. అంతేగాని నా కుమారుని మాత్రం నీవు ఆ దేశానికి తిరిగి తీసుకువెళ్లొద్దు.”
9 కనుక ఆ సేవకుడు తన యజమాని తొడకింద తన చేయి పెట్టి వాగ్దానం చేసాడు.
అన్వేషణ ప్రారంభం
10 అబ్రాహాము ఒంటెలలో పదింటిని తీసుకొని ఆ సేవకుడు ఆ చోటు విడిచి వెళ్లాడు. రకరకాల అందాల కానుకలు ఎన్నో తనతో కూడ ఆ సేవకుడు తీసుకెళ్లాడు. మెసపొతేమియాలోని నాహోరు పట్టణం వెళ్లాడు ఆ సేవకుడు.
11 పట్టణం వెలుపల ఉన్న మంచి నీళ్ల బావి దగ్గరకు ఆ సేవకుడు సాయంకాలం వెళ్లాడు. నీళ్లు తీసుకొని పోయేందుకు స్త్రీలు సాయంకాలం వస్తారు. ఆ సేవకుడు తన ఒంటెలను అక్కడ మోకరింపజేసాడు.
12 ఆ సేవకుడు చెప్పాడు: “ప్రభూ, నీవు నా యజమాని అబ్రాహాము దేవుడవు. ఈ వేళ నన్ను అతని కుమారుని కోసం భార్యను కనుగొనునట్లు చేయుము. నా యజమాని అబ్రాహాముకు దయచేసి ఈ మేలు అనుగ్రహించు.
13 ఇదిగో, మంచి నీళ్లు బావి దగ్గర నేను ఉన్నాను, పట్టణం నుండి అమ్మాయిలు నీళ్లు తోడటానికి ఇక్కడికి వస్తున్నారు.
14 ఇస్సాకు కోసం ఏ అమ్మాయి సరైనదో తెలుసుకొనేందుకు ఒక ప్రత్యేక సూచన కోసం నేను కనిపెడుతున్నాను. ఆ ప్రత్యేక సూచన ఏమిటంటే: ‘నేను నీళ్లు తాగాలి, నీ కడవ కింద పెట్టు’ అని అమ్మాయితో నేను అంటాను. ‘తాగు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను’ అని అమ్మాయి గనుక చెబితే, అప్పుడు ఆమె సరైన అమ్మాయి అని నేను తెలుసుకొంటాను. అలా జరిగితే ఆమె ఇస్సాకుకు సరైన జోడు అని నీవు రుజువు చేసినట్టే. నా యజమానికి నీవు కరుణ చూపించావని నాకు తెలుస్తుంది.”
భార్య దొరికింది
15 అంతలో, ఆ సేవకుడు ప్రార్థన ముగించక ముందే రిబ్కా అనే ఒక అమ్మాయి తన గ్రామం నుండి బావి దగ్గరకు వచ్చింది. రిబ్కా బెతూయేలు కుమార్తె. బెతూయేలు అబ్రాహాము సోదరుడు నాహోరు, మిల్కాల కుమారుడు. రిబ్కా తన నీళ్ల కడవ తన భుజంమీద పెట్టుకొని బావి దగ్గరకు వచ్చింది.
16 ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఆమె కన్య. ఆమె ఎన్నడూ పురుషునితో శయనించలేదు. ఆమె తన కడవ నింపుకోటానికి బావిలోనికి దిగింది.
17 అప్పుడు ఆ సేవకుడు ఆమె దగ్గరకు పరుగెత్తి వెళ్లి, “నాకు తాగటానికి దయచేసి నీ కడవలో కొన్ని నీళ్లు ఇస్తావా” అన్నాడు.
18 రిబ్కా త్వరగా తన భుజంమీద నుండి కడవ దించి, అతనికి నీళ్లు ఇచ్చింది. “అయ్యా, ఇదిగో తాగండి” అంది రిబ్కా.
19 అతను తాగటానికి పోయడం అయిన వెంటనే, “నీ ఒంటెలకు గూడా నేను నీళ్లు పోస్తాను” అంది రిబ్కా.
20 రిబ్కా వెంటనే తన కడవలోని నీళ్లన్నీ ఒంటెల కోసం అని చెప్పి నీళ్ల తొట్టిలో పోసింది. తర్వాత ఇంకా నీళ్లు తెచ్చేందుకు ఆమె బావి దగ్గరకు పరుగెత్తింది. ఆ ఒంటెలన్నింటికి ఆమె నీళ్లు పెట్టింది.
21 ఆ సేవకుడు మౌనంగా ఆమెను గమనించాడు. యెహోవా తనకు జవాబిచ్చాడని, తన ప్రయాణాన్ని విజయవంతం చేశాడని అతను రూఢిగా తెలుసుకోవాలనుకొన్నాడు.
22 ఒంటెలు నీళ్లు తాగడం అయిపోగానే, అతడు అరతులం బంగారపు ఉంగరం రిబ్కాకు ఇచ్చాడు. 5 తులాల ఎత్తుగల బంగారపు గాజులు రెండు అతడు ఆమెకు ఇచ్చాడు.
23 “నీ తండ్రి ఎవరు? మా గుంపు పండుకొనేందుకు నీ తండ్రి ఇంటిలో చోటు ఉందా?” అని ఆ సేవకుడు ఆమెను అడిగాడు.
24 “నా తండ్రి బెతూయేలు, నాహోరు మిల్కాయొక్క కుమారుడు” అని రిబ్కా జవాబిచ్చింది.
25 తర్వాత, “అవునండి, మీ ఒంటెలకు గడ్డి, మీరు పండుకొనేందుకు స్థలం మా దగ్గర ఉంది” అని ఆమె చెప్పింది.
26 ఆ సేవకుడు వంగి యెహోవాను ఆరాధించి,
27 “నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవా స్తుతించబడు గాక. యెహోవా నా యజమానుని పట్ల దయ చూపాడు. నా యజమాని బంధువు యింటికి యెహోవా నన్ను నడిపించాడు” అని చెప్పాడు.
28 అప్పుడు రిబ్కా పరుగెత్తి వెళ్లి తన ఇంటివారికి ఈ సంగతులన్నీ చెప్పింది.
29-30 రిబ్కాకు ఒక సోదరుడు ఉన్నాడు. అతని పేరు లాబాను. ఆ మనిషి తనతో చెప్పిన విషయాలు రిబ్కా చెప్పింది. లాబాను ఆమె మాటలు వింటున్నాడు. ఎప్పుడైతే తన సోదరి చేతులకు ఉంగరం, గాజులు లాబాను చూశాడో, అప్పుడు బావి దగ్గరకు అతడు పరుగెత్తాడు. అక్కడ ఆ మనిషి బావి దగ్గర ఒంటెల పక్కగా నిలబడి ఉన్నాడు.
31 “అయ్యా, తమరికి లోనికి సుస్వాగతం. మీరలా ఇక్కడే బయట నిలబడి ఉండనక్కర్లేదు. మీ ఒంటెలకు స్థలం, మీరు పండుకొనేందుకు గది నేను సిద్ధం చేసాను” అని లాబాను చెప్పాడు.
32 కనుక అబ్రాహాము సేవకుడు ఆ ఇంటిలో ప్రవేశించాడు. ఒంటెల పనిలో అతనికి లాబాను సహాయం చేసి, అతని ఒంటెలకు గడ్డి వేసాడు. అతను, అతనితో ఉన్న మనుష్యులకు కాళ్లు కడుక్కొనేందుకు నీళ్లు ఇచ్చాడు.
33 తర్వాత లాబాను అతనికి భోజనం పెట్టాడు. అయితే ఆ సేవకుడు తినకుండా నిరాకరించాడు. “నేను ఎందుకు వచ్చానో మీతో చేప్పకుండా నేను భోజనం చేయను” అన్నాడు అతను.
కనుక లాబాను, “అలాగైతే మాతో చెప్పు మరి” అన్నాడు.
రిబ్కా కోసం మంతనాలు
34 ఆ సేవకుడు చెప్పింది ఇది: “నేను అబ్రాహాము సేవకుడను.
35 అన్ని విషయాల్లోను యెహోవా నా యజమానిని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. నా యజమాని మహా ఘనుడయ్యాడు. గొర్రెల మందలు, పశువుల మందలు విస్తారంగా యెహోవా అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాముకు వెండి బంగారాలు విస్తారంగా ఉన్నాయి. చాలా మంది ఆడ మగ సేవకులు ఉన్నారు. ఒంటెలు, గాడిదలు చాలా ఉన్నాయి.
36 నా యజమాని భార్య శారా. ఆమె చాలా వృద్ధాప్యంలో ఒక కుమారుని కన్నది. నా యజమాని తన ఆస్తి సర్వం ఆ కుమారునికి ఇచ్చాడు.
37 నేను ఒక వాగ్దానం చేయాలని నా యజమాని నన్ను బలవంతం చేసాడు. నా యజమాని ‘నా కుమారుణ్ణి కనాను అమ్మాయిల్లో ఎవర్నీ చేసుకోనివ్వగూడదు. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం కాని కనాను అమ్మాయిల్నెవరినీ అతడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు.
38 కనుక నీవు నా తండ్రి దేశానికి వెళ్తావని వాగ్దానం చేయాలి. నా వంశం వారి దగ్గరకు వెళ్లి, నా కుమారుని కోసం భార్యను కుదుర్చి’ అని నాతో చెప్పాడు.
39 ‘ఒక వేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశానికి రాదేమో’ అని నేను నా యజమానితో అన్నాను.
40 అయితే నా యజమాని నాతో ఇలా చెప్పాడు, ‘నేను యెహోవాను సేవిస్తాను, యెహోవా తన దూతను నీతో కూడ పంపి నీకు సహాయం చేస్తాడు. అక్కడి ప్రజలలో నా కుమారుని కోసం భార్యను నీవు కనుక్కొంటావు.
41 కాని నీవు నా తండ్రి దేశం వెళ్లాక, నా కుమారుని కోసం భార్యను ఇచ్చేందుకు వారు నిరాకరిస్తే, అప్పుడు ఈ ప్రమాణ బాధ్యత నీకు ఉండదు.’
42 “ఈ వేళ నేను ఈ బావి దగ్గరకు వచ్చి అన్నాను: ‘నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవా, దయతో నా ప్రయాణం విజయవంతం చేయి.
43 నేను ఈ బావి దగ్గర నిలబడి, నీళ్లకోసం ఒక అమ్మాయి ఇక్కడికి రావాలని నిరీక్షిస్తాను. అప్పుడు నేను, దయచేసి తాగటానికి నీ కడవలోనుంచి నీళ్లు ఇమ్మని అడుగుతాను.
44 సరైన అమ్మాయి అయితే ఒక ప్రత్యేక విధానంలో జవాబిస్తుంది. ఈ నీళ్లు తాగు, నీ ఒంటెలకు గూడ నేను నీళ్లు తెస్తాను అని ఆమె అంటుంది. ఆ విధంగా, నా యజమాని కుమారుని కోసం యెహోవా ఏర్పరచిన స్త్రీ ఆమె అని నేను తెలుసుకొంటాను.’
45 “నేను ప్రార్థించటం ముగించక ముందే, నీళ్ల కోసం రిబ్కా బావి దగ్గరకు వచ్చింది. ఆమె తన నీళ్ల కడవ తన భుజం మీద పెట్టుకొంది. ఆమె వెళ్లి బావినుండి నీళ్లు తోడింది. ‘దయచేసి కొంచెం నీళ్లు ఇమ్మని’ నేను ఆమెతో అన్నాను.
46 వెంటనే ఆమె తన భుజం మీదనుండి కడవదించి, నాకు నీళ్లు పోసి, ‘ఇవి త్రాగు, నీ ఒంటెలకు గూడ నేను నీళ్లు తెస్తాను’ అంది. అందుచేత నేను నీళ్లు తాగాను, నా ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పెట్టింది.
47 అప్పుడు ‘నీ తండ్రి ఎవరు?’ అని నేను ఆమెను అడిగాను. ‘మిల్కా నాహోరుల కుమారడైన బెతూయేలు నా తండ్రి’ అని ఆమె జవాబిచ్చింది. అప్పుడు ఆమె చేతికి ఉంగరం, గాజులు నేను ఇచ్చాను.
48 ఆ సమయంలో నేను నా తలవంచి యెహోవాకు వందనాలు చేశాను. నా యజమాని దేవుడైన యెహోవాను నేను స్తుతించాను. నా యజమాని సోదరుని మనుమరాలి దగ్గరకే నన్ను ఆయన తిన్నగా నడిపించినందుకు ఆయనకు వందనాలు చెప్పాను.
49 ఇప్పుడు మీరేం చేస్తారో నాకు చెప్పండి. నా యజమాని యెడల మీరు దయ, నమ్మకత్వం చూపి, మీ కుమార్తెను ఆయనకు ఇస్తారా? లేక మీ కుమార్తెను ఇవ్వటానికి నిరాకరిస్తారా? నేను ఏమి చెయ్యాలో నాకు తెలిసేటట్టు, మీరు చెప్పండి.”
50 అప్పుడు లాబాను, బెతూయేలు జవాబిచ్చారు. “ఇది యెహోవా నుండి వచ్చినట్లు మేము చూస్తున్నాము. కాబట్టి దీన్ని మార్చమని మేము చెప్పుటకు ఏమీలేదు.
51 రిబ్కా నీ ముందే వున్నది. ఆమెను తీసుకొని వెళ్లు. నీ యజమాని కుమారుణ్ణి ఆమె పెళ్లి చేసుకొంటుంది. ఇదే యెహోవా కోరేది.”
52 అబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, యెహోవా యెదుట నేలపై సాగిలపడ్డాడు.
53 అప్పుడు ఆ సేవకుడు తాను తెచ్చిన కానుకలను రిబ్కాకు ఇచ్చాడు బంగారు వెండి నగలు, ఎన్నో అందమైన బట్టలు అతడు రిబ్కాకు యిచ్చాడు. ఆమె సోదరునికి, తల్లికి గూడ చాలా ఖరీదైన కానుకలు అతడు ఇచ్చాడు.
54 ఆ సేవకుడు, అతనితోనున్న సేవకులు తిని, తాగి అక్కడే ఉన్నారు. ఆ రాత్రి వారు అక్కడే ఉన్నారు. మర్నాడు ఉదయం వారు లేచి, “ఇప్పుడు మేం తిరిగి మా యజమాని దగ్గరకు వెళ్తాం” అన్నారు.
55 అప్పుడు రిబ్కా తల్లి, సహోదరుడు ఈ విధంగా చెప్పారు, “రిబ్కాను కొన్నాళ్లు మా దగ్గర ఉండనివ్వు. పది రోజులు ఉండనివ్వు. ఆ తర్వాత ఆమె వెళ్లవచ్చు.”
56 కానీ ఆ సేవకుడు, “నన్ను ఇంక ఆపవద్దు. నా ప్రయాణాన్ని యెహోవా విజయవంతం చేసాడు. కనుక ఇప్పుడు నా యజమాని దగ్గరకు నన్ను వెళ్లనివ్వండి” అని వారితో చెప్పాడు.
57 “రిబ్కాను పిలిచి, ఆమె ఇష్టం ఏమీటో మేము అడుగుతాం” అన్నారు రిబ్కా అన్న, తల్లి.
58 వారు రిబ్కాను పిలిచి, “నీవు ఈ మనుష్యునితో కలిసి ఇప్పుడే వెళ్తావా?” అని అడిగారు.
“అవును, నేను వెళ్తాను అంది రిబ్కా.”
59 కనుక అబ్రాహాము సేవకునితో, అతని మనుష్యులతో కలిసి రిబ్కా వెళ్లటానికి వారు అనుమతించారు. రిబ్కా దాది కూడ వారితో వెళ్లింది.
60 వారు వెళ్తున్నప్పుడు రిబ్కాతో వారు ఇలా చెప్పారు:
“మా సోదరి, వేలమందికి, పది వేలమందికి నీవు తల్లిని అవుదువు గాక.
నీ సంతానము వారి శత్రువులను ఓడించి వారి పట్టణాలను స్వాధీనం చేసుకొందురు గాక!”
61 అప్పుడు రిబ్కా, ఆమె దాది ఒంటెలను ఎక్కి ఆ సేవకుని, అతని మనుష్యులను వెంబడించారు. ఆ విధంగా ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని తిరుగు ప్రయాణమయ్యాడు.
62 అప్పటికి ఇస్సాకు బెయేర్ లహాయిరోయి విడిచి, నెగెవులో నివసిస్తున్నాడు.
63 ఒక సాయంకాలం ఇస్సాకు ధ్యానించుట కోసం అలా బయటకు పోలాల్లోకి వెళ్లాడు. ఇస్సాకు తలెత్తి చూచేటప్పటికి అంత దూరంలో వస్తున్న ఒంటెలు కనిపించాయి.
64 రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసింది. అప్పుడామె ఒంటె మీద నుండి క్రిందికి దిగెను.
65 “మనలను కలుసుకొనేందుకు ఆ పొలాల్లో నడిచి వస్తున్న యువకుడు ఎవరు?” అంటు ఆమె సేవకుని అడిగింది.
“ఆయనే నా యజమాని కుమారుడు” అని చెప్పాడు ఆ సేవకుడు. కనుక రిబ్కా తన ముఖం మీద ముసుగు కప్పుకొంది.
66 జరిగిన సంగతులన్నీ ఇస్సాకుతో ఆ సేవకుడు చెప్పాడు.
67 అప్పుడు ఇస్సాకు ఆ అమ్మాయిని తన తల్లి గుడారంలోకి తీసుకు వచ్చాడు. ఆ రోజు రిబ్కా ఇస్సాకు భార్య అయ్యింది. ఇస్సాకు ఆమెను చాలా ప్రేమించాడు. తన తల్లి మరణించిన తర్వాత ఇస్సాకు దుఃఖనివారణ పొందాడు.